మన పత్రికలు


పత్రికల నిండుగా వెండి తెర బంగారు వార్తలు
వెలుగు నోచని జీవితాల నిలువెత్తు భంగిమలు
వెల ఎక్కువ దుస్తులతో నిండిన ఛాయా చిత్రాలు
వెల కట్టలేని శృంగార పాఠాలు
ఆది అంతం లేని చక్కని కథలు
తలకెక్కని ప్రశ్నలకి త్రుళ్ళిపడే సమాధానాలు
సాహిత్య స్వరూప స్వభావాలే మరిచాము
పఠనా సామర్థ్యం నీరసిస్తోంది
బుల్లితెర మాయ దహిస్తోంది
కాపాడుకోవాలి తీయనిన తెలుగుని
మన సాహిత్యాన్ని
మన బాష నిండుదనాన్ని
ప్రతుల విలువకన్నా
వ్రాతల విలువ పెరగాలి
పత్రికలు తెలుగుకు వెలుగు వేదికలై వర్ధిల్లాలి

-----------------------------------------------------
పత్రికలు వినోదం వైవిధ్యం పంచుతున్నా
కాని అంతర్లీనంగా భాషని, సాహిత్యాన్ని వ్యాపింప చేస్తున్నాయి
వాటి రాయభార భాద్యతలని గుర్తెరగాలి

వెలుగు - చీకటి

చీకటి తో పోరాటం
వెలుగు కై ఆరాటం
తరం తరం ఈ యుద్ధం నిరంతరం
వెలుగు రేఖలతో మన ప్రపంచం నిండాలంటే
స్వేదబిందువుల ఉప్పెన తప్పనిసరి
అలుపెరుగక శ్రమించితే మరి
అన్ని కష్టాలు సలాం అంటూ
మనముందు గులామౌతాయి

జీవన శైలి

మూడు వన్నెల జండా ఎగురవేసినప్పుడు
 ఉద్వేగంగా వుంటుంది
భారతీయుడినైనందుకు గర్వంగా వుంటుంది
దేశం కోసం ఏదైనా చేయాలన్పిస్తుంది
కాని అది ఆ ఒక్క క్షణమే
ఆలోచనలన్నీ మారిపోయే మరు నిమిషమే
దేశం కోసం సమయం లేదు కేటాయించడానికి
చలన చిత్రాలతో సరిపోయింది ఈ వారంతం మరి
బుల్లి తెర ధారావాహికలు
వార్తల పరంపరలు
అంతర్జాలం మహేంద్రజాలం
వేశాయి విలువైన కాలానికి గాలం
నాగరికత చెదలు పట్టింది
జీవిత శైలి భ్రస్టు పట్టింది
త్రుప్పు పట్టిన ఈ మనిషి తీరు మారాలి
ఆకలి చావులు ఒక వైపు
పుష్టి భోజనాలతో రోగిష్టులు మరో వైపు
బాలికా పసికందుల హత్యలు ఒక వైపు
ఆడది ఆకాశం లో సగం అనడం మరో వైపు
పులుల సంరక్షణ కాంక్షిస్తారు కొందరు
పులులై జనం మీద ఎగబడతారు మరికొందరు
అవినీతి నిత్య హారతి భారత మాతకి
కుళ్ళు రాజకీయం మణిహారమయ్యింది భారతావనికి