చెలిమి లిఖించిన జ్ఞాపకాల పుటల్లో

చెలిమి లిఖించిన జ్ఞాపకాల పుటల్లో
ఏదో మరచిపొయాను...ఏంటబ్బా!?
ఈదుతున్నప్పుడు జారిపోయిన కిట్టిగాడి చెడ్డీ చమత్కారం గురించా?
వనజకు వీడుకోలు తెలుపుతూ క్రిందపడి శాశ్వత గుర్తును
ముక్కుపై వేసుకున్న బాలు విరహం గురించా?
తప్పిపోయిన కుక్కపిల్లకై అన్నం మానేసిన బాచి అభిమానం గురించా?
మంచం క్రింద దాక్కుని నిదురపోయి ఊరినంతా వెదికించిన
వేణు నిర్వాకం గురించా?
చలిమంటకై గడ్డివామిని తగులబెట్టి వీధికెదురు నిలిచినా నా తెగింపు గురించా?
తేనెపట్టుకు పొగబెట్టబోయి దుప్పటి ముసుగులో ఇంటిని అంటించిన జగను సాహసం గురించా?
కుక్కల్ని భయపెట్టబోయి ఒళ్ళంతా కరిపించుకున్న వాసు ధీరత్వం గురించా?
బాదంకాయకై రాయి విసిరి నిలువెత్తు గాజు అద్దం పగులగొట్టి
ఆరు నెలలు వీధిని వెలివేసిన ప్రసాదు ఉద్యమం గురించా?
రాత్రంతా చదివి పరీక్షలో నిద్దురపోయిన మధు అలుపెరగని పోరాటం గురించా?
పులికైనా ఎదురునిలుస్తానని చెప్పి బల్లి మీదపడి భయపడి 
జ్వరమొచ్చిన నవీను శూరత్వం గురించా?
అబ్బో చాలా గుర్తొచ్చేశాయి!!
కాని మరేదో జ్ఞాపకం మరచిపోయాను

గుండెలో నీ గుడి

ఈ మధ్యే గుండె లయతప్పిందట
అన్ని పరీక్షలు చేసి
కొన్ని మందులు వ్రాసి
చెప్పారు వైద్యులు జాగ్రత్త అని
గుండె నిండా నీ చిత్రాలు రక్తానికి అడ్డం పడుతున్నాయట
ఇది నా వ్యాధి ముదిరిందని చెప్పటానికి అద్దం పడుతుందట
గుండె చప్పుడు మారి కూని రాగాలు తీస్తుందట
ఇది జబ్బుల జాబితాలో క్రొత్త విషయమని శలవిచ్చారు
నీ కౌగిలింతలతో గుండె వేగం పెరిగే అదృష్టముందన్నారు స్నేహితులు
శస్త్ర చికిత్స చేస్తామంటే
ఎక్కడ నీ జ్ఞాపకాలు గుండెల్లోనుండి ఎగిరిపోతాయోనని వద్దన్నా
గుండె మార్పిడి నేను కుదరదన్నా..చూశావా త్యాగాలమయమయ్యింది జీవితం
గుండెలో నీ గుడి కట్టమని నిన్ననే మేస్త్రిని కలిశా
ఎండాకాలం ఇసుక వెల ఎక్కువని కాస్త ఆగమన్నాడు
నీకై నేను చేయని ప్రయత్నంలేదు
నీవు త్వరగా నన్ను చేరకపోతే
నే చేజారిపోయే ప్రమాదముంది

రెండు రాజధానులొదిలాం, మన కష్టం ఒట్టిపోదు

కొంతమంది వెర్రి వెధవలు
ఫో అంటే
అధికార మదమెక్కిన
ఆంబోతులు సవాలు చేసి శివాలెత్తుతుంటే
మరి ఇంతమంది, కోట్లమంది ఏం పట్టనట్టు 
మనం వారికేం చెందనట్టు
మనల్ని ఎపుడూ ఎరగనట్టు
ఏదొ ఇంతకాలం బిచ్చమేసినట్టు
పీడ విరగడైనట్టు
ప్రవర్తిస్తున్న వీరితోనా మనం కలిసినడిచాం
వీరితోనా ఇన్ని తరాలు సోదరభావంతో మెలిగాం
స్వాభిమానం హద్దు మీరితే స్వార్థమే
ఆత్మాభిమానం తలవంచితే అవమానమే
కుళ్ళిన శవాల మధ్య నిదురిస్తే నీవూ శవమే
వారు క్రొత్త తల్లిని కనుగొన్నారు
విలక్షణంగా ఎదగాలనుకున్నారు
త్వరలో క్రొత భాషనూ కనిపెడతారు
మనమెవరో ఉనికే తెలియదంటారు
ఇంకా ఎందుకన్నా అలోచిస్తావు
ఏం మిగిలుందని వెనుతిరిగి చూస్తావ్?
స్నేహితులే శత్రువులై తరుముతుంటే
ఇంటికప్పే నీపై ఉరుముతుంటే
రెండు రాజధానులొదిలాం, మన కష్టం ఒట్టిపోదు
సున్నా నుండి మొదలు పెట్టడం మనకేం క్రొత్త కాదు
తెలుగు మహామహుల విగ్రహాల తలలే నరికారు
ఏదో పొట్ట చేతబట్టొచ్చిన గొట్టం సుబ్బడు నీవెంత
వారి సంస్కారం ముందు మనమెంత
మన నెత్తురు, మన చెమట ధారపోసిన నేల వదిలి
మనం ముందుకు సాగాలి
సొంత ఊరు పిలుస్తోంది రా కదిలి రా
నవ్యాంధ్ర ఉదయిస్తోంది రా రా

కన్నీటిచుక్క

తోకచుక్కై జారి నేల తాకకుండానే ఎటో మాయమయ్యింది కన్నీటిచుక్క
క్షణంలో మాయమయ్యింది కన్నీటిచుక్క
నిర్ణయమేదో రూపుదాల్చకుండానే మదిలో మిగిలిపోయినట్లు
తీరం తాకిన కెరటమేదో సముద్రంలోకి తిరిగి ఒరిగినట్లు వెనక్కుతగ్గిందో కన్నీటిచుక్క

కనుకొలుకుల కట్టలు దాటి పొంగిపొర్లుతూ
చారికలు చేస్తూ జారిపోయిందో కన్నీటిచుక్క
దారి ఎరిగిన కాలువల్లే బుగ్గలనుండి జారుకుంటూ తన దారి చూసుకుంది
ఉద్వేగం ఉక్రోషం అచేతనం ఆక్రోశం ఆనందం అద్భుతం
తేడాల్లేకుండా పుట్టుకొస్తుంది కన్నీటిచుక్క

మన అనుబంధం చిరకాలమంటోంది కన్నీటిచుక్క
తన వెచ్చటి స్పర్శలో చనువెక్కువ కనబడలేదా అంటూంది కన్నీటిచుక్క
వెళ్ళిపోతూ భారమంతా తీరుస్తుంది
ఒడలిపోయిన మోము కడిగేస్తుంది
తీరు మార్చే యోచన చేయిస్తుంది కన్నీటిచుక్క

పొరలి పొరలి పొంగుకొస్తుంది
ఆగనంటూ తరలిపోతుంది
కొన్నిసార్లు కన్నుల్లో గింగిరాలు తిరుగుతుంది
మరికొన్నిసార్లు కప్పేసిన కనురెప్పల మాటున దాగిపోతుంది
ఏ అర్ధరాత్రో దిండు తడిసిపోయేలా సుడులు తిరుగుతుంది  కన్నీటిచుక్క

మబ్బులు వీడిన ఆకాశంలా 
కళ్ళలో ఏవో క్రొత్త వెలుగులకు తిరిగి జీవం పోస్తూ
నిమిత్తమాత్రులమని నిలచిపోని, ఓటమికి బెదిరిపోని ధైర్యమిస్తూ
సెలవడిగింది కనీటిచుక్క!!

క్రొత్త అమ్మని కనుగొన్న నీకు...

కూడలిలో ఉన్నాము
కలవని దారులెంచుకున్నాము
నీ దారిటు
నా దారటు
జాగ్రత్త తమ్ముడూ!!
ముళ్ళ దారులుంటాయి
భవిష్యత్తు బంగారు చేస్తాననే
జిత్తులమారి నక్కలున్నాయి
అధికారం మరిగిన మృగాలు పొంచివున్నాయి
కనిపించని మలుపుల్లో
కమ్ముకున్న కౄరత్వం
జాలి చూపదు
జోల పాడదు
ఉక్కు కౌగిళ్ళ మధ్య
ఉక్కిరి బిక్కిరి చేస్తాయి
నీ కలలకు సంకెళ్ళు వేస్తాయి
నీవు విడిపోవాలన్నావు
స్వతంత్రమే లేదా అన్నావు
అనూనయించాలని యత్నించా
కలిసుందామన్నా
నీ పటిమతో
ఉద్యమమై నెగ్గావు
నిన్ను నిలుపుకోలేనందుకు సిగ్గు పడుతున్నా
కన్నీటితో సాగనంపుతున్నా
మన జ్ఞాపకాలు
నిలువెత్తు చిత్రపటాలుగా
గుండెల్లో ముద్రించుకున్నా
కుంచిత భావాల పండితులూ
కలుపులే చూస్తున్న కవులూ 
పేగుబంధం తెలియని పెద్దమనుషులూ
చిలువలు పలువలుగా
అల్లుతుండవచ్చు మన బంధాన్ని
జాగ్రత్త తమ్ముడూ!!
క్రొత్త అమ్మని కనుగొన్న నీకు
తెలుసోలేదో మరి
అమ్మ మౌనంగా రోధిస్తోంది
చిదిరిన సీమలవైపు చూసి
చెరగని నెత్తుటి సంతకాలవైపు చూసి
భువన భవనమ్ములు నేను కాంక్షించలేదు
నిధులు వజ్రవైఢూర్యాలు కోరనూలేదు
నిన్ను దోచి నేను ఎదగాలని ఎదురుచూడలేదు
తీయని అనురాగపు చెట్టు నీడలో కలిసుందామనుకున్నా
తరతరాల తెలుగు ఖ్యాతిని కలిసి పంచుదామనుకున్నా 
శలవు మరి
నీకు జయమగుగాక
నీకు సకల విజయములందుగాక
అమ్మ నేర్పిందిదే
తెలుగమ్మ నేర్పిందిదే

చైతన్యం మాలో లేదు

రైతును దోచేసి
ష్టం కాజేసి
కాష్టం రగిలించి
భూమిని పెకిలించి
ఖనిజం అమ్మేసి
గోతులు త్రవ్వేసి
గనులను ఖాళి చేసేసి
అడ్డమైన దారుల్లో
ఎన్ని అవినీతి
క్రతువులు నిర్వహిస్తావ్
అదుపులేని మదుపులేని
ధన ప్రవాహపు
ఒరవడిలో
ఎన్ని భవంతులు
నిర్మిస్తావ్
ఎన్ని పరిశ్రమలు
ఆక్రమిస్తావ్
కళ్ళారా ఇన్ని చూసి
ఇంకా చవి చూస్తున్న
ఈ గొఱ్ఱెల్ని
మంద బుఱ్ఱల్ని
మరింత దోచెయ్
మొత్తంగా అమ్మెయ్
చైతన్యం మాలో లేదు
నూతనత్వం మాకు వద్దు
మేమిలానే బ్రతుకుతాం
జీవఛ్చవాలై మిగులుతాం

శ్రమజీవికితోడై నీవుండాలి

ఏ పరిశ్రమ శ్రమజీవి లేక
పనికి ఉపక్రమించింది?
ఏ కట్టడం శ్రమజీవి లేక
నిర్మాణం జరిగింది?
ఏ క్రొత్త ఆవిర్భావం
శ్రమజీవి లేక
ఈ ప్రపంచంలో అడుగెట్టింది?
ఏ అద్భుతమైన కల
శ్రమజీవి లేక
సాకారమై మన ఎదుట నిలిచింది?
ఏ శ్రమ
దొపిడిలేకుండా సాగింది?
ఏ శ్రమ
బెత్తంపట్టిన పెత్తందార్ల చేతిలో
కీలుబొమ్మయ్యింది?
నీవు విప్లవమంటూ
ఎర్రగుడ్డ తలకుగట్టి
తుపాకీ చేతబట్టి
అడవికి పరిగెట్టితే
ఈ బడుగుజీవి అరణ్యరోదన
పట్టణాలలో అనామకవేదన
ఎవరు తీరుస్తారు?
జాగృతి లేని జనం మధ్య
ఈ కట్టడాల వనం మధ్య
నిలిచి నిలువరించి
పోరాడు 
పడగలెత్తిన దౌర్జన్యపు
మిడిసిపాటును వడిసిపట్టి
నేలకేసి కొట్టి కొట్టి
మదపు పొట్టు తొలచి ఒలిచి
తెట్టు తేలిన స్వార్థాన్ని
తూట్లు తూట్లు పొడిచి పొడిచి
వెగటు పుట్టిన ఈ వ్యవస్థ
పుట్టల్ని పగులగొట్టి
నాజూకు పేర్లతో క్రొత్తబడిన
వెట్టి చాకిరిని
కత్తివేటుకు బలియిచ్చి
శ్రమజీవికితోడై నీవుండాలి
శ్రమజీవివై ప్రజాస్వామ్యాన్ని
మెప్పించాలి
--------------------
కార్మికదినోత్సవ శుభాకాంక్షలు