తోకచుక్కై జారి నేల తాకకుండానే ఎటో మాయమయ్యింది కన్నీటిచుక్క
క్షణంలో మాయమయ్యింది కన్నీటిచుక్క
నిర్ణయమేదో రూపుదాల్చకుండానే మదిలో మిగిలిపోయినట్లు
తీరం తాకిన కెరటమేదో సముద్రంలోకి తిరిగి ఒరిగినట్లు వెనక్కుతగ్గిందో కన్నీటిచుక్క
కనుకొలుకుల కట్టలు దాటి పొంగిపొర్లుతూ
చారికలు చేస్తూ జారిపోయిందో కన్నీటిచుక్క
దారి ఎరిగిన కాలువల్లే బుగ్గలనుండి జారుకుంటూ తన దారి చూసుకుంది
ఉద్వేగం ఉక్రోషం అచేతనం ఆక్రోశం ఆనందం అద్భుతం
తేడాల్లేకుండా పుట్టుకొస్తుంది కన్నీటిచుక్క
మన అనుబంధం చిరకాలమంటోంది కన్నీటిచుక్క
తన వెచ్చటి స్పర్శలో చనువెక్కువ కనబడలేదా అంటూంది కన్నీటిచుక్క
వెళ్ళిపోతూ భారమంతా తీరుస్తుంది
ఒడలిపోయిన మోము కడిగేస్తుంది
తీరు మార్చే యోచన చేయిస్తుంది కన్నీటిచుక్క
పొరలి పొరలి పొంగుకొస్తుంది
ఆగనంటూ తరలిపోతుంది
కొన్నిసార్లు కన్నుల్లో గింగిరాలు తిరుగుతుంది
మరికొన్నిసార్లు కప్పేసిన కనురెప్పల మాటున దాగిపోతుంది
ఏ అర్ధరాత్రో దిండు తడిసిపోయేలా సుడులు తిరుగుతుంది కన్నీటిచుక్క
మబ్బులు వీడిన ఆకాశంలా
కళ్ళలో ఏవో క్రొత్త వెలుగులకు తిరిగి జీవం పోస్తూ
నిమిత్తమాత్రులమని నిలచిపోని, ఓటమికి బెదిరిపోని ధైర్యమిస్తూ
సెలవడిగింది కనీటిచుక్క!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Add your comment here