కాస్త కళ్ళు తెరువు బాబు

ముందుకెళ్తున్నానంటూ పరుగులెడుతున్నావు
మరి వెంట ప్రజలున్నారా చూసుకో బాబు
అతి వేగం ప్రమాదకరం
ఫలితమివ్వని సంస్కరణలు పరిహాసమౌతాయి బాబు

చేసేస్తున్నామంటే సరిపోదు
ప్రజల అవసరం తీరిందా అనేదే ప్రశ్న
పథకాలు ప్రకటించడంతోనే బాధ్యత పూర్తవ్వదు
పేదల కడుపునిండుతున్నదా విలువెంచుకో బాబు

సహచరులను వెనెకేసుకురావడం కనిపిస్తూనే ఉంది
స్వచ్ఛత పై పడే మచ్చల జాబితా పెరుగుతూనే ఉంది
క్రొవ్వు పట్టిన మద గజాల కంపు పెరుగుతూనే ఉంది
స్వచ్చ ఆంధ్రప్రదేశ్ జాబితాలో మనుషుల్ని మరి మనసుల్ని
కాస్త చేర్చుకో బాబు

పిల్లి కళ్ళు మూసుకుని...అన్నట్లు
ప్రతిపక్షం మీదనే అంతా రుద్దేస్తే సరిపోదు
మీకు అంటుతున్న మసి మాసిపోదు
కాస్త కళ్ళు తెరువు బాబు

అద్భుతమైన అలోచనలుంటేనే సరిపోదు
ఆచరణలో కూడ కనిపిస్తేనే
చివరి వరకూ కొనసాగిస్తేనే
ప్రజల మన్ననలు అందుతాయి బాబు


ఓ వడ్డీల మహరాజు

పిలిస్తే డబ్బులిస్తామంటూ
రోజువారీ వడ్డీ ఇస్తూ రోజు గడుపుకోమంటూ
అప్పులిచ్చి గుప్పెడంత ఆశనిచ్చాడు
ఓ వడ్డీల మహరాజు

భూమి పత్రం కావాలంటున్నాడు
పుస్తె పసిడి తెచ్చివ్వమంటున్నాడు
దొరికిన కొద్దీ దోచుకుంటున్నాడు
అవసరం తీర్చమంటున్నాడు
ఈ వడ్డీల మహరాజు

పొరపాటు తెలిసినా
గ్రహపాటు తప్పలేదు
అప్పు తీర్చలేక
తప్పు సరిచేయలేక
ఇల్లమ్మి భూములమ్మి
కట్టు బట్టలతో బయటికీడ్చాడు
ఆ వడ్డీల రారాజు!!
లెక్కలు గుక్క తిప్పుకోకుండా
చెబుతున్నడీరోజు
అప్పు నిప్పై తలమీద కూర్చుంటే
పగబట్టిన త్రాచై మీదకురుకుతున్నాడు వడ్డీల రారాజు

ఉసురు తీసుకోకముందే
ఈ కోరలకు బలికాకముందే
గుండెల్లోని బాధ కంఠంలో పొలికేకవ్వగ తిరగబడు
మగ్గుతున్న తలవొగ్గుతున్న  ప్రజలని చైతన్య పరుచు
సమాజం నుండి వెలివేయి ఈ రక్త పిశచుల్ని
స్వంత కుటుంబమే ఈసడించుకోవాలి ఈ మానవ మృగాలని
ఈ కౄరమైన ఆటకి అదే ముగింపు తమ్ముడూ

నీ ప్రేమను కొంచెం కొంచెం రుచి చూపిస్తూనే ఉంది....

చిరుగుల జ్ఞాపకాలలో
చివరికి మిగిలింది
చనువుతో తాకిన
నీ మది గానమే

ఎండల ఈ వేసవి వెంటే ఉంది
కబురులు చెప్పక
కర్కశపు క్షణాలు తెచ్చింది
గుండెను కోత కోసింది

ఎరగా నను వేసి
నిన్ను కాజేసింది
రంగుల దుప్పటి నాపై కప్పి
కాలం కనుమరుగయ్యింది

కాలాలను దాటి
కలలు వెంటాడుతున్నాయి
తలుపులు మూసిన నీ తలపులపై వ్రాసిన
విరహపు కవితలు
రెప్పకు చెప్పక
చప్పున గుండెలోతుల్లోకి ఇంకిపోయాయి

మన ఇళ్ళ మధ్య అల్లుకున్న
సన్న జాజి తీగ మాత్రం
గుప్పెళ్ళతో పూవులు గుమ్మరిస్తూ
నీ ప్రేమను కొంచెం కొంచెం రుచి చూపిస్తూనే ఉంది