ఇవీ మన తలరాతలు

నేతల
కోతలు
మోతలు మోతలు
వెఱ్ఱి కూతలు!
రోత
మూతుల
ఆబోతుల
బూతులు
ఇవీ మన తలరాతలు!!

జోతల
చేతలు
జేబున
కాసుల పేరులు
వాహన వరుసలు
అడ్డదారిన ఆదాయాలు!!

వెతల
కతలు
రైతుల
కనుమూతలు
సామాన్యుని
ఆకలి చావులు
తరతరాలకు
తలవంపులు!!

గోతులు
త్రవ్వే
ఈ జిత్తులమారులు
చేతలు ఉడిగిన
అచేతనులు
అధికార మదాంధ
వ్యసనపరులు!!

ఉద్యమ నేతలు పదవికాశ పడితే...

ఉద్యమ నేతలు పదవికాశ పడితే
ఉద్యమమే ప్రక్క దారి పడితే
పిడికిలి బిగించి
ప్రాణాలకు తెగించి
వెంట నడచిన 
వేకువ వెదకిన
ప్రజలేమౌతారు?

వంచన పంచన
కూర్చొని
బేరసారాలు
కుదుర్చుకొని
బందువులను
రాబందులను
గద్దెనెక్కిస్తే
ప్రజలేమౌతారు

నా దారి వేరంటూ
ఉద్యమం ఒదిలేసి
వెంటనడచిన వారి 
నోళ్ళు మూయించి
పోరు బాటలు మరచి
మాటలకే పరిమితమైతే
కోటలకే దాసోహమంటే
స్వార్థం నరనరానా పాకుతుంటే
ప్రజలేమౌతారు?

నిప్పుల ఉప్పెనలౌతారు
నిశ్శబ్ద జల ప్రళయాలౌతారు
గర్జించే అగ్ని పర్వతాలౌతారు
పట్టిన చిలుమును
పెరిగిన కలిమిని
పట్టిన త్రుప్పును
పేరిన ధూళిని
ప్రజలు కడిగేస్తారు
కోటని
తోటని
పదవిని
బలిమిని
అర్థాన్ని
స్వార్థాన్ని
ప్రజలు కూల్చేస్తారు

ఆంధ్ర తెలంగాణ అభిప్రాయ భేదాలు

ప్రాంతాల విభేదం వచ్చిన తరువాత
నీది నాదన్న వాదనలోకి అడుగు పెట్టాక
ఎవరి అడుగులూ వెనుకకి పడవు
కావల్సింది ఇరువైపులా కాస్తంత ఓపిక

కటువు మాటలు కట్టిపెట్టండి
నిన్న మొన్నటిదాక మనం నేస్తాలం
కుటుంబ స్నేహితులం, ఇరుగు పొరుగులం
ఎవరూ వారికి చెందని ప్రాంతంలో ఉండాలనుకోరు
కావల్సింది ఇరువైపులా కాస్తంత ఓపిక

అంతలోనే శత్రువులంటూ దొంగలంటూ దూషించి
ఈసడింపు మాటలకు వెకిలి చేష్టలకు తావివ్వకండి
నిన్నటి స్నేహితుడు నేడు శత్రువంటే మానవత్వం విరగబడి నవ్వుతుంది
కావల్సింది ఇరువైపులా కాస్తంత ఓపిక

ఉద్యోగులైనా, న్యాయస్థానమైన ఎవరికి వారుగా
నేడైనా రేపైనా విడవలసినదే
తమ ప్రాంతానికి తరలవల్సినదే
అవమానించి అపహాస్యం చేయవల్సిన అవసరం లేదు
కావల్సింది ఇరువైపులా కాస్తంత ఓపిక

కొన్ని రోజుల ప్రశాంతత ఓపికా అన్నీ సరిపెడుతుంది
రాజకీయ బురద పోట్లాటలాపి కళ్ళు తెరవండి
అంతలోనే గగ్గోలుపెట్టి గర్వం ప్రదర్శించకండి
మీ ప్రాంతం మీద మీకెంత మక్కువో వారి ప్రాతం మీద వారికంతే
మక్కువ ఉంటుందని గుర్తెరగండి
కావల్సింది ఇరువైపులా కాస్తంత ఓపిక


రాకాసి రాజకీయం రంగు రంగు రూపాల్లో వస్తుంది
కొంపలు మునిగిపొయాయంటుంది,
అంతా వారి వల్లే జరిగిందంటుంది
తప్పులు కప్పిపుచ్చుకోటానికి ప్రతి అవకాశం వినియోగిస్తుంది
ఆ మత్తులో కొట్టుకుపోకండి
ఎవరి రాజకీయాలూ ఎక్కువరోజులు పనిచేయవు
నిజం నిక్కచ్చిగ నక్కల తోలు ఒలిచేస్తుంది
కాలం కసిగా వారిని పాదాల క్రింద నలిపేస్తుంది
ఇవి కదిలిపొయే మబ్బులు
కక్ష కార్పణ్యాలకు లొంగిపోకండి
జీవిత నేస్తాలను ఒదులుకోకండి
న్యాయం జరిగే తీరుతుంది
కావల్సింది ఇరువైపులా కాస్తంత ఓపిక

చెమట చుక్కల పురిటి నొప్పులు

పనిముట్టుల
కనికట్టులు
చెమట చుక్కల
పురిటి నొప్పులు
వెట్టి చాకిరి
తిరుగుబాట్లు
మురికి పట్టిన
పని బట్టలు
తట్టిలేపిన
ఆకలి కేకలు
చుట్టు ముట్టిన
అప్పుల బాధలు
ఉట్టిన మిగిలే ఆశలు
ఉత్తిగ రాలే జీవితాలు
మట్టిన కలిసే జాతకాలు
మేం చవి చూశాము

చెమట కరగందే
రోజు గడవదు
పోరాటమెరగందే
న్యాయం జరగదు
వందలు వేలు పనిచేస్తున్నా
ఒక్కడిక్రిందే బానిసలు
కదిలే ఇనుప చక్రాలు
కరగని రక్త పిపాసులు
బ్రతిమిలాడి
భంగపడి
పనికి తాళమేసి
మెరుపు సమ్మెలు
చేత ఎరుపు జెండాలు
ఇంట కడుపు కోతలు
భటుల కఱ్ఱ దెబ్బలు
దేహాన రక్తపు కాల్వలు
నిరాహార దీక్షలు
నిర్యాణ పర్యవసనాలు
మేము చవి చూశాము

జీవితాలను ఒడగట్టి
కొడగట్టి
కన్నీట ఒకరికి ఒకరై
తోడున్నాము
సంఘటిత శక్తులై మేల్కొన్నాము
ఒక్క పిడికిలితో
ఉక్కు పిడికిలితో
ప్రపంచానికి
క్రొత్త సూర్యుడిని రుచి చూపించాము
మేము కార్మికులం
గమ్యాలకు చేర్చే నావికులం
నిరాశ నిస్పృహలను
పధ ఘట్టనల క్రింద
త్రొక్కి తుత్తునియలు చేశాము
ఎర్ర సలాముల త్యాగ ధనులను
చూశాము
కార్మికలోకపు ఐకమత్యం
మేం చవి చూశాము
---------------------------------
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు



ఘంటసాల గానంబున కరిగిపోయి...

ఘంటసాల గానంబున కరిగిపోయి
తలపుల తేరుగట్టి మనో వీధిన ఏగుచుండ
మకరంద తేనియల వర్షంబు కురిసె
అద్భుతముల్కనుగొని అచ్చెరువొంది
ఇది ధ్యానమా పరధ్యానమా అను సంశయమునుండ,
ఊహల ఆకసాలను చుంబించు
పుష్పక విమాన యానమాయని
మనసు తృళ్ళిపడుచుండ
స్వార్థ ఫలము కోరి చేసిన తపస్సునకు ఫలితముండజాలదని
ఫలమాశించని మనోగమనము మహా తపస్సని
నేనెరింగితి
సర్వజ్ఞుడను కాదు
పండితుడను అసలే కాదు
అనుభవమ్ము గడించిన పామరుడిని
నిక్కచ్చి నిజములు మీకుంగోపము దెప్పించునో
తర్క వితర్కముల నన్ను భస్మీపటలము గావించదరో గానీ
మనసు బల్కిన పల్కులను
అక్షరముల మాలగా గూర్చితి
అంతర్జాలమున పంచ గోరితి