నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

అక్షర బానిసత్వం అణువణువునా నిర్వచిస్తూ
కలానికి సంకెళ్ళు వేసి
స్వేచ్ఛా భావాలని అణిచివేసి
రాజకీయాలకు లొంగిపోతూ
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

స్వంత ప్రచారానికి వాడుకుంటూ
రాజకీయ నాయకుల పుత్రికలై
సొంత బాక ఊదుకునే వేదికలై
స్వేచ్ఛను కాలదన్ని అచేతనమై
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

నిజాన్ని పాతరేసిన
వక్ర ధోరణుల
వికృత వ్రాతల
కర దీపికలు - పత్రికలు
బుల్లితెర స్వార్థ వాహికలు - మాధ్యమాలు
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

నాయకుల కొమ్ము కాస్తూ
వారి పంచనే పడగలు పెంచుకుంటూ
అధికారానికి అర్ధాంగిగామారి
వార్తలకు బదులు కట్టుకథలు అల్లేస్తూ
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

ప్రజలకు నిక్కచ్చి సమాచారమందించాల్సిన
ప్రధాన బాధ్యతను విస్మరించి
వ్యాపార సూత్రాలను వల్లెవేస్తూ
నికృష్ట రాజకీయాలు వంటబట్టి
బుల్లితెరలపై ప్రజలకు అబద్ధాలు నూరిపోస్తూ
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

ప్రజలకు తెలుసు ఏ పత్రిక ఎవరికి కొమ్ముకాస్తుందో
ప్రజలకు తెలుసు ఏ మాధ్యమం ఎవరిని ఆకశానికెత్తేస్తుందో
ఎవరు భ్రమలో ఉన్నారు?
ఎవరు నీచ సంస్కృతిని ఎగదోస్తున్నారు?
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

తగులబెట్టండి ఇటువంటి పత్రికల్నీ మాధ్యమాల్ని
విషసంస్కృతిని ప్రజలపై రుద్దకుండా
తిరిగి ఈ సర్పాలు మొలవకుండా
సమాజాన్ని శాసిస్తున్నామనుకోకుండా
తగిన శాస్తి చేయండి
ఎంత  నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు?!!

దాశరధి తెలుగువారి సాహిత్య రథ సారధి

దాశరథి, తెలుగువారి సాహిత్య రథ సారధి
ఎనబది ఏండ్ల సాహితీ వారధి
విలక్షణ రచనల పెన్నిధి
తన పయనంలో
తెలంగాణ మాండలీకంతో
తెలుగు మోదుగుపూలు పూయిస్తూ
తెలంగాణ పోరాటాల్ని
అక్షరీకరిస్తూ
తెలుగు సాహిత్య పరిమళాలకు
నిత్యశోభనిస్తూ
చిల్లరదేవుళ్ళ సమాజాన్ని
కళ్ళకు కడుతూ
నిజాము నెదిరించి
జనపదమునకు అక్షరజీవంపోస్తూ 
కావ్యాలను అనువదిస్తూ
దివికేగిన రంగాచార్యులకు
ఇది మా తెలుగు వారి భాష్పాంజలి

కుళ్ళిన నాయకులని సంతల్లో కొనేస్తూ

కుట్రలు కుతంత్రాల
నాయకులు
కుళ్ళబొడుచుకుంటున్న వైనం
కళ్ళారా చూస్తున్నాం
రోతపనుల ఈ రోగగ్రస్తులని
పాలించరా అని గద్దెనెక్కిస్తే
నిక్కి నీలిగి
ప్రజా పాలన వదిలేసి
రహదారి పై కుక్కల్లాగ
పోట్లాడుకుంటూ
నక్క జిత్తుల తెలివి తేటలన్నీ
ఒకరిపై మరొకరి నాశనానికి
ఉపయోగిస్తూ
కట్టల కట్టలు డబ్బులు
వెదజెల్లుతూ
ప్రజలను వెర్రి వెధవల్ని
చేసే ప్రయత్నంలో విజయం 
సాధించినట్లు విఱ్ఱవీగుతున్నారు
కృతజ్ఞతకు బదులు
ప్రజలకు కృతఘ్నులుగా మారుతున్నారు
విచక్షణలేని వికృతత్వాన్ని 
తలకెక్కించుకున్నారు
విడిపోయినా
తమ ప్రాంత బాగోగులు చూసుకోక
కుఠిల రాజనీతులపై
సమయం వెచ్చిస్తూ
కుళ్ళిన నాయకులని సంతల్లో కొనేస్తూ
సాగే ఈ దుష్టయజ్ఞం ఎన్నాళ్ళు?
దొరికిన దొంగలు కొందరే
దొరని దొంగల దాగుడుమూతలు మరెన్నాళ్ళు?

వచ్చిందిర తెలంగాణ!!


జన గర్జన
పెల్లుకుబికి
పోరాటం
నింగికెగసి
ఉడుకుడుకు నెత్తురుల
ఉరుకులెత్తి
వచ్చిందిర తెలంగాణ!!


పిడికిలి బిగించి
ప్రాణం తెగించి
గళ హోరుగ
జన వేదన
రగిలించిన
అగ్గి గోళమై
శివాలెత్తగ
వచ్చిందిర తెలంగాణ!!

బలిదానపు
విద్యార్థులు
అలుపెరగని
ఉద్యోగులు
ఉద్యమమై సాగగ
కొత్త ఉదయమై
వచ్చిందిర తెలంగాణ!!

ఒక్క తాటిపై
ఒక్క రూపమై
సంధించిన బాణమై
నిదురించని నినాదమై
ఎరుపెక్కిన తూరుపున
వచ్చిందిర తెలంగాణ!!

పల్లె పల్లెన
సయ్యంటూ
పిల్ల పాపలు
జై అంటూ
పాట పదునెక్కి
జనవేడుక కదను త్రొక్కగ
జగమెల్లా స్వాగతము పలుక
వచ్చిందిర తెలంగాణ!!