రాష్ట్రాన్ని ప్రత్యేకంగా అమ్మేశారు

రాష్ట్రాన్ని ప్రత్యేకంగా అమ్మేశారు
నోట్లకి కొంత
ఓట్లకి కొంత
కాళ్ళక్రింద దూరే బానిసత్వానికి అంతా!!

ఆత్మ గౌరవం లేదు
ఆవకాయ పచ్చడి లేదు
నరంలేని నాయకులుంటే రాష్ట్రం నాశనమే!!

రక్తం మరిగిందని
ఇరవై సార్లు వెళ్ళి కలిశానని
ప్రత్యేకహోదా మాత్రమే కావాలని ప్రజలతో వంతపాడి
ఇచ్చినంతా తీసుకోక ఎంచేద్దామన్నప్పుడే
నీ మేక తోలు ఊడిపొయింది!!

చేతకాకపోతే దిగిపోవచ్చు
చేతనైతే ఎదుర్కొనవచ్చు
రెండిటికీ కాక
చేష్టలుడిగిన నీ మేకపోతు గాంభీర్యం
మమ్మల్ని పగలబడి నవ్వేలా చేస్తూంది!!

విభజన పై ఇచ్చిన ప్రజా తీర్పులో
ఒక రాజకీయవర్గం మాడి మసైపోయింది
కేంద్రం భజన చేస్తూ వారి తొత్తులామారిన
మీ వర్గం మరో తీర్పుతో దిగంతాలకేగుతుంది!!

రాష్ట్రమేమైనా పర్లేదు
నా కుర్చీ ఉండాలి
నేను క్షేమంగా ఉండాలనే
నీ ఆశయం ప్రజలపై రుద్దకు
ఎందుకంటే నిన్ను ప్రజలు రేవుకేస్తారు
ప్రతేకహోదా సబ్బుతో ఉతుకుతారు !!

మరి ఎక్కడ మన అత్మ గౌరవం?

అప్పుడు విభజించద్దంటూ మోకరిల్లి
ఇప్పుడు నిధులకై తల్లడిల్లి
కేంద్రం ముందు బిచ్చమెత్తుకుంటుంటే
మరి ఎక్కడ మన అత్మ గౌరవం?

బొంకయ్యల పిచ్చి కూతలు
బోడీల వాగ్ధానపు బూటకాలు
బాబులు నడిపిస్తున్న నాటకాలు
రెండేండ్లు ఆ బురదలో పొర్లి పొంగిపోతుంటే
మరి ఎక్కడ మన అత్మ గౌరవం?

విభజన ఆపలేక
రాజధానికి దిక్కులేక
నడిదారిలో నిలిపిన
ఈ రాజకీయ రొచ్చులో రగిలిపోతుంటే
మరి ఎక్కడ మన అత్మ గౌరవం?

విభజన ఆపలేనప్పుడే తెలిసింది
మన ఆరంభ శూరత్వం
ఇప్పుడు ప్రత్యెకహోదాకై ఏం పీకలేని
మహా గొప్ప వారసత్వం
మరి ఎక్కడ మన అత్మ గౌరవం?

త్రుప్పు పట్టిన ఆయుధాలు ఏమి లేపుతారులే
కప్పు కింద కూర్చుని పప్పు ఆరగిద్దాం
తెలుగు లేదు వెలుగు లేదు
ఊరు లేని పేరు లేని
నిలువ నీడలేని రాజధాని మనది
మరి ఎక్కడ మన అత్మ గౌరవం?

ఇచ్చిందేదో చాలని
మూసుకొని వుందాం
మనకు మాటలెక్కువ
పట్టుదల తక్కువ
మనం చేసే పనికిమాలిన పోరాటంతో
ఉన్నదీ ఊడుతుంది ఉంచుకున్నదీ పోతుంది
కొంచెం మడిచి ఎత్తిపెట్టు మన అత్మ గౌరవం!!
----------------------------------------------------------------------------
క్షమించండి గుండె రగిలిపోతుంది మనల్ని వీరు ఆడుకుంటున్న తీరు చూస్తుంటే

శ్రీ దుర్ముఖి నామ యుగాది శుభాకాంక్షలతో

నిదురలో పలుకునది తెలుగు
చివుక్కుమన్న మనసు ఒలికేది తెలుగు
బాల్య స్నేహితుని పలుకరింప వచ్చేది తెలుగు
సంభ్రమాశ్చర్యాన గొంతునూరేది తెలుగు

మాతృభాష మనదన్న భాష
ఏబది ఆరు అక్షరాల శబ్ద సంకలన మాల
భావ వ్యక్తీకరణకు సర్వ శబ్దములొక్కచోట చేరిన సాహిత్యపు సిరి వెన్నెల
ముప్పది రెండు వేల అన్నమయ్య కీర్తనల శొభాయమాన
సంగీత రసమయ ఇంద్రనీల

మన పలుకు మూలమ్ము తెలుగు
శతబ్దాల సంప్రదాయ వాహిని తెలుగు
ప్రపంచమంతా విస్తరించిన తెలుగువాడి జీవనాడి తెలుగు
పల్కినకొద్దీ తేనెలూరు
చదివినకొద్దీ చైతన్యమొనరు
వ్రాసినకొద్దీ కథ కవితలూరు
మహా వటవృక్షమ్ము తెలుగు

నేటి తరానికి నేర్పిస్తే సంస్కారం పెరుగుతుంది
రేపటి తరానికి నేర్పిస్తే సంస్కృతి మిగులుతుంది
భవిష్యత్తు తరాలకి నేర్పిస్తే నా జాతన్న తీయని భావన వెలుగుతూనే ఉంటుంది
యుగాది కాలంతరాలు దాటి పయనిస్తూనేఉంటుంది

అందమైన తెలుగు
సుందరమైన తెలుగు
వేమన శుమతీ నీతుల తెలుగు
పోతన వండిన భాగవతపు తెలుగు
తిక్కన నన్నయ యఱ్ఱనల భారతపు తెలుగు
రాయల ఆముక్త మాల్యదలో నిండిన తెలుగు
కృష్ణ శాస్త్రి కవితలలో ఊయలలూగిన తెలుగు
ఎంకి పాటలలోని తెలుగు
శ్రీశ్రీ కలాన దున్నిన తెలుగు
శ్రీనాధ కవిని సార్వభౌముని చెసిన తెలుగు
మహా మహోన్నత భాష మన తెలుగు

ప్రాంతీయతత్వం మత్తు గొప్పదో కాదో కాని....

ప్రాంతీయతత్వం మత్తు గొప్పదో కాదో కాని
మనకు దారి చూపిన గొప్ప నాయకులను
గౌరవించలేని నీచ సంస్కృతి మాత్రం గొప్పది కాదు

తెలుగు వాడి వేడి ప్రపంచానికి చూపింది రామన్న
తెలుగు వారి ఆత్మ గౌరవం గుర్తు చేసింది రామన్న
తెలుగు వారి ప్రియతమ నాయకుడికి నీవందిస్తున్న ద్రోహ నివాళి
ప్రజలందరూ గమనిస్తున్నారు నీ సంకుచిత సరళి

రాజకీయ ప్రస్థానానికి నాంది పలికింది ఆ చేతుల మీదుగానే
భవిష్యత్తు దిద్దుకుంది ఆ నాయకత్వంలోనే
కాని నమ్మకద్రోహానికి మారుపేరు నీవు
కుంచిత మనస్తత్వానికి అసలు రూపు నీవు

విభజన ముందు సిగ్గు శరం లేనోళ్ళు అంధ్రోళ్ళన్నావు
నీచమైన పదాలతో దుమ్మెత్తిపోశావు
ఎన్నికలనగానే కాలి ముల్లును పంటితో తీస్తామన్నావు
వంచిత మనస్తత్వానికి బహురూపం నీవు

పత్రికలని మాధ్యమాల్ని అణచివేస్తూ
నియంత లక్షణాలు నిలువెల్లా చూపిస్తూ
నిర్ణయాలు నవ్వులపాలు కాగా నిచ్చేష్టుడవౌతూ
కుఠిల రాజకీయాల కుళ్ళు కంపు నీవు

అధికారం మూన్నాళ్ళ ముచ్చటే
పుచ్చు పదాల ఉచ్చు మాటలకు ప్రజలు పడిపోరు
బంధు జనాల నీ ఊరేగింపు ఎన్నళ్ళూ సాగుతుంది
పొగరు మాటల కండకావరం త్వరలోనే కొడిగడుతుంది

తెలుగును ఉరితీస్తున్నారు రక్షించండి


మాతృభాష మరువకుండా
తెలుగు మాట అంతరించిపోకుండా
నిండుగా గుండెల్లో ఉండాలని
పరాయి రాష్ట్రంలో ఉన్నా
తమ పిల్లలకి తెలుగు నేర్పుతుంటే
తమిళ భాషే నేర్చుకోవాలంటూ
వారి భాషే బ్రతకాలంటూ
వ్యాధి శోకిన కొందరు
సుందర తెలుంగు విలువ తెలియని కొందరు
వందల ఏళ్ళుగా సమాజ నిర్మాణంలో
పాలుపంచుకున్నామని విస్మరించిన కొందరు
తెలుగు భాషను ఉరితీస్తున్నారు

విద్యార్థుల్ని బలవంతంగా
తమ భాషలోనే చదవాలంటూ
ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వం రుచి చూపిస్తున్నారు
నిర్భంధంగా సమూలంగా తెలుగును తొలగిస్తున్నారు
న్యాయస్థాన తీర్పునే పరిహసిస్తున్నారు
పరీక్షలొచ్చే వేళ పైశాచికం ప్రబలిస్తున్నారు
తమిళవారు అంధ్రదేశంలోనూ  ఉన్నారు
తమ భాషను ఆనందంగా అభ్యసిస్తున్నారు
ఎందుకు వారికి ఈ పైత్యం అంటిందో
తెలుగు భాషను ఉరితీస్తున్నారు

అంధ్ర ముఖ్యమంత్రికి విన్నవిస్తే
ఏమి తెలియనట్లు అమాయకంగా వెళ్ళిపోయాడు
తెలుగు దేశమంటాడు
ప్రపంచంలోని తెలుగువాళ్ళందరూ తనవాళ్ళంటాడు
మరి అక్కడ తెలుగు భాషను ఉరితీస్తుంటే చోద్యం చూస్తున్నాడు

తెలుగు బ్రతకాలి
భావాల బంధాల వారధియై తులతూగుతుండాలి
పుడమి పై తెలుగు మాటలు తేనెలూరుతుండాలి
భాష పరంపర తర తరాలకు కొనసాగాలి
కాని...తెలుగును ఉరితీస్తున్నారు తమిళనాట...రక్షించండి