మేమూ చమటోడుస్తాం

అమ్మెయ్యి సహజ వనరులు
కాజేయి ప్రకృతి వరములు
దోచెయ్యి ప్రజల ఆస్తుల్ని
దాచెయ్యి కుళ్ళిన వ్యవస్థని
విమర్శకులపై ఎదురు దాడి చేసెయ్ 
ఇంకా విరమించకుంటే
ఈ ప్రపంచం నుండే లేపెయ్
చంపూ నరుకూ అంటూ రక్తపుటేరులు పారిస్తూ
మేమూ చమటోడుస్తాం
ముందడుగుకై యత్నిస్తాం
ఐదేండ్లకొకసారి ఎదోపోనీలే అని
ముద్దేస్తూ ముద్దుచేస్తే
అది కావలిదికావాలంటూ
కోరికలు కోరుతారు
కరువంటూ బతుకు బరువంటూ
వెంటపడిపొతారు
ఐదునూర్లు నొక్కేసి నెయ్యి బువ్వ బొక్కేసి
సారా కుమ్మేసి 
జేబుకు చిల్లుపెట్టించి మరీ పదవిస్తారు
పైరవీలు చేయమంటారు
అనుగ్రహ పత్రాలు కావాలంటారు
ఆగ్రహమొస్తే ఇల్లూ వాహనాలు కాల్చేస్తారు
మరి ఆ ఖర్చులన్నీ వడ్డీలన్నీ ఎవరిస్తారు
అందుకే శిస్తు డబ్బు కాస్త నొక్కేసి
ప్రభుత్వ భూముల్ని కొంచెం మింగేసి
నిధుల్లో అరాకొరా మళ్ళిస్తే
పతాక శీర్షికలకెక్కిస్తారు
మళ్ళీ ఎంతో కష్టపడి
జనాలదారి మళ్ళించి పదవి పొందేస్తాం
మా కష్టం తెలిసిందా
మా నష్టం ఎరుకైందా
మీరే మాకు అండా దండా
మీరే మాకు ఉన్నదంతా
మిమ్మల్నే మాయ చేయాలి
మిమ్మల్నే ముద్దు చేయాలి
అప్పుడప్పుడూ పావులా వాడుకుంటాం
ఎప్పుడో ఒకప్పుడు కరివేపాకులా తీసేస్తాం
మాయ మాటలు నమ్మి
అందలమెక్కించినంత కాలం
మేము మేస్తూనేవుంటాము
మీపై ఊరేగుతుంటాము
తప్పదు భరించాలి మరి
తప్పితే మిమ్మల్ని ఎలా వంచించాలో తెలుసుమరి

నీ ముంగిట అరుదెంచినంతనే

ఇన్ని మాసములు వేచి
ఎన్ని విరహముల దాచి
వర్ణనలకు వర్ణములద్ది
వేదనలను సాగనంపి
వలపుల తలపులకు తలుపులు తెరిచి
నీ ముంగిట అరుదెంచినంతనే
చెలిని గాంచిన దిగ్భ్రమలో
నిచ్చేష్టుడనైతిని
నీ కనుచూపు బాణాలు
నా యొంక సంధించినంతనే
మధువు గ్రోలిన మత్తు కమ్ముచున్నది
వేల వేణువులు నన్నలరించినట్లు
మధురముగానున్నది
ఘల్లు మన్న నీ మువ్వల సవ్వడి
ఝల్లు మన్న నాయెద లయలొ
వంత పాడుచున్నది
దశాబ్దాలనుండి రాయిగనున్న
మనసేదో రాగాలు నేర్చినట్లున్నది
మాటలకందని సందేశమేదో
నీ కంటి పాపలో దాగున్నది
చూపులు కలిపి మధురోహల మధువు కొంచెం మరీ కలిపి
వాకిటనున్న ఈ బాటసారికి అందించవా!
అలసిసొలసి, ఊహలను శ్వాశించి, జీర్ణించిన 
ఈ మనసుకు 
నిరీక్షణ శృంఖలాలు త్రెంచి 
నీ పరిష్వంగంలో లాలించవా !! 

వసంతం ఎప్పటిలాగే నీతో కలిసే వస్తుంది

రా ఆడుకుందాం!
రా పాపా ఆడుకుందాం!!
ఏం ఎందుకురావు?
దాచిన బొమ్మలు ఇచ్చేస్తా
పుల్లటి రేగుపళ్ళు కొనిస్తా
గరు జామకాయలు కోసిస్తా
బంకమట్టి ఎడ్లబండి చేసిస్తా
పిలిచినప్పుడేమో రావు
వంద కారణాలు వినిపిస్తావు
నీ దారికే రావాలంటావు
ఉడికి ఉడికి నేను నాలుగు అంటిస్తాను
అలిగి నీవు దుప్పటి కప్పేస్తావు
ముక్కు చీదేస్తావు
ఇంతలో అమ్మ పిలుస్తుంది
నా వీపు మోత మ్రోగిస్తుంది
చెల్లినేడ్పిస్తావా?
బంగారు తల్లినేడ్పిస్తావా??
అంటూ మొటిక్కాయలేస్తుంది
నీపై మురిపాలు కురిపిస్తుంది
రాక్షసిలా నా బొమ్మలు విరిచేశావు
గవ్వలన్నీ పారేసావు
నేను కొన్నదంతా కావాలంటావు
నిన్ను చూస్తే...
నమిలి మింగేస్తామనిపిస్తుంది
ముక్కు కోయాలనిపిస్తుంది
నీ భుజం డప్పులాగ వాయించాలనిపిస్తుంది
ఆరెరె..ఇదేంటి కన్నీరొచ్చేస్తూంది
ఒక్కొక్క చుక్కా రాలి నీ చిత్రంపై పడుతోంది
ఇప్పుడే మెట్టినింట అడుగుపెట్టినట్లుంది
అప్పుడే రెండు మొగ్గలు పూచాయా!!
క్రొత బంధాలు తీవెలై నిన్ను అల్లుకున్నాయా!?
ఇద్దరు చిన్నారులు ముద్దులిచ్చే నీ చిత్రం
చాలా బావుంది
నాకెప్పుడూ మనల్నే గుర్తుకు తెస్తుంది
అన్నగా బాధ్యత నిర్వర్తించానో లేదో
మరచేపోయాను 
నీతో పోట్లాటలోనే బాల్యం గడిపేశాను
ఈ సంవత్సరం మళ్ళీ ఉగాది వస్తుంది
వసంతం ఎప్పటిలాగే నీతో కలిసే వస్తుంది
నీ రాకతో మా ఇంటికి పండుగనేతెస్తుంది

జ్ఞాపకాల్ని నిదురలేపితే

జ్ఞాపకాల్ని నిదురలేపితే
అమావాస్య ఆకాశంలో అనంతకోటి తారలల్లె
కనువిందుచేస్తున్నాయి
వెదికి వెదికి పట్టిన మిణుగురులన్నీ
ఎగిరిపోతున్నట్లు
రంగు రంగుల గోళీలన్నీ
చిన్నారి చేతినుండి జారిపోతున్నట్లు
అందకుండా కదిలిపోతున్నాయి
ఏ జ్ఞాపకాన్ని పలుకరించాలో 
తెలియక మనసు మూగవోతూంది
తెలివి మౌనం వహిస్తోంది
వెలికి రానంటున్న మరికొన్ని
అలిగిన పాపలై దాగుడు మూతలాడేస్తున్నాయి
గొంగళి పురుగు సీతాకోక చిలుకైనట్లు
మరికొన్ని చేదు అనుభవాలు
తీపి జ్ఞాపకాలుగా మెరుగయ్యయి
వెలగని మతాబులై మరికొన్ని
మనసులో నుండి మరుగయ్యయి
నిండు వసంతంలాంటి కొన్ని జ్ఞాపకాలు
కలలై వెంబడిస్తున్నాయి
దోసిట్లో నిలువని నీరై
మరికొన్ని జారిపోతున్నాయి
వెయ్యేండ్లైనా చెరిగిపోని తాళపత్రమై 
నీ జ్ఞాపకాలు మది అడుగున
పదిలమై వున్నాయి
చలిలో నులివెచ్చని దుప్పటి కప్పినట్లు
ఒంటరి ప్రయాణంలో ఒక తోడు కలిసినట్లు
ధారలౌతున్న కన్నీటిలో
ప్రపంచమంతా శూన్యమైనపుడు
నేను తోడంటూ చేయి అందించిన
నీ జ్ఞాపకాలు ఎపుడూ వెంటున్నాయి
అప్పుడప్పుడూ గతం తాలూకు జ్ఞాపకాలు తిరగేస్తాను
నేను ఎవరన్న నిజం నెమరేస్తాను
జ్ఞాపకాల పుటల్లొ మరో సశేషం చేరుస్తాను