రా ఆడుకుందాం!
రా పాపా ఆడుకుందాం!!
ఏం ఎందుకురావు?
దాచిన బొమ్మలు ఇచ్చేస్తా
పుల్లటి రేగుపళ్ళు కొనిస్తా
వగరు జామకాయలు కోసిస్తా
బంకమట్టి ఎడ్లబండి చేసిస్తా
పిలిచినప్పుడేమో రావు
వంద కారణాలు వినిపిస్తావు
నీ దారికే రావాలంటావు
ఉడికి ఉడికి నేను నాలుగు అంటిస్తాను
అలిగి నీవు దుప్పటి కప్పేస్తావు
ముక్కు చీదేస్తావు
ఇంతలో అమ్మ పిలుస్తుంది
నా వీపు మోత మ్రోగిస్తుంది
చెల్లినేడ్పిస్తావా?
బంగారు తల్లినేడ్పిస్తావా??
అంటూ మొటిక్కాయలేస్తుంది
నీపై మురిపాలు కురిపిస్తుంది
రాక్షసిలా నా బొమ్మలు విరిచేశావు
గవ్వలన్నీ పారేసావు
నేను కొన్నదంతా కావాలంటావు
నిన్ను చూస్తే...
నమిలి మింగేస్తామనిపిస్తుంది
ముక్కు కోయాలనిపిస్తుంది
నీ భుజం డప్పులాగ వాయించాలనిపిస్తుంది
ఆరెరె..ఇదేంటి కన్నీరొచ్చేస్తూంది
ఒక్కొక్క చుక్కా రాలి నీ చిత్రంపై పడుతోంది
ఇప్పుడే మెట్టినింట అడుగుపెట్టినట్లుంది
అప్పుడే రెండు మొగ్గలు పూచాయా!!
క్రొత బంధాలు తీవెలై నిన్ను అల్లుకున్నాయా!?
ఇద్దరు చిన్నారులు ముద్దులిచ్చే నీ చిత్రం
చాలా బావుంది
నాకెప్పుడూ మనల్నే గుర్తుకు తెస్తుంది
అన్నగా బాధ్యత నిర్వర్తించానో లేదో
మరచేపోయాను
నీతో పోట్లాటలోనే బాల్యం గడిపేశాను
ఈ సంవత్సరం మళ్ళీ ఉగాది వస్తుంది
వసంతం ఎప్పటిలాగే నీతో కలిసే వస్తుంది
నీ రాకతో మా ఇంటికి పండుగనేతెస్తుంది
:):)
రిప్లయితొలగించండి