పేద రైతు ఆత్మహత్యలకు కారణమెవరు, కరుణించేదెవరు?

పదవిలోకొచ్చేసి
ఇచ్చిన మాటలన్నీ మరిచేసి
మడత నలగని బట్టలేసి
మట్టి పాదాలకంటని ఈ నాయకులు
మట్టి విలువ తెలియని ఒట్టి అమాయకులు
భూములను మ్రింగే మాయావులు

ఎన్నికల ముందు పాదయాత్రలు
ఎన్నికల తరువాత విమాన యాత్రలు
ప్రచారాలకూ ప్రారంభాలకూ విలువనిస్తూ
ప్రజల ప్రారబ్ధం గమనించని ఈ నాయకులెందుకు?

ప్రజలకు చేరని పధకాలెందుకు?
పేదల ప్రతినిధికాని ప్రభుత్వమెందుకు?
మూర్ఖుల చేతిలో మన భవిష్యత్తు పగ్గాలెందుకు?

చిత్రాలకు పరిమితమై విమానాలకు, విఫణులకు మాత్రమే విలువిస్తే
రైతాంగం దారేది, సాగు భూములకు నీరేది?
పేద రైతు ఆత్మహత్యలకు కారణమెవరు, కరుణించేదెవరు?
పది కూడ ఫలితమివ్వని వేయి పధకాలెందుకు?

భజనపరులు చుట్టూ ఉంటే
విమర్శలెలా తెలుస్తాయి?
వీధులవెంట జెండాల రంగులే తప్ప
ప్రజల కడగండ్లు ఎలా కనిపిస్తాయి?
ప్రచారాల డప్పు హోరులో ప్రజలకష్టాలు మూగవోతాయి

ప్రజాసమస్యను తెలుసుకున్నవాడే నిజమైన పాలకుడౌతాడు!
సమస్యను ఎదుర్కొన్నవాడే సరైన నాయకుడౌతాడు!!
సమస్యను పరిష్కరించినవాడే మాహాత్ముడు, కారణ జన్ముడౌతాడు!!!



2 కామెంట్‌లు:

  1. మట్టి విలువ తెలియనీయని మాయకులు

    రైతాంగానికి దారేది, నీరందని సాగు భూముల వైనమే యిది?

    ప్రజాసమస్యను తెలుసుకున్నవాడే నిజమైన పాలకుడౌతాడు
    సమస్యను ఎదుర్కొన్నవాడే సరైన నాయకుడౌతాడు
    సమస్యను పరిష్కరించినవాడే మాహాత్ముడు, కారణ జన్ముడౌతాడు .

    కవిత పెద్దదౌతుందని భావించకుండా , పాఠకులు చదివి అర్ధం చేసుకొనే విధంగా , వచన కవిత్వం వుంటే బాగుంటుంది . అందులకు కవితని కొన్ని కొన్ని చోట్ల ఆపి , తదుపరి లైనులో వ్రాయవలసి వస్తుంది .
    ఉదా : వీధులవెంట జెండాల రంగులే తప్ప ప్రజల కడగండ్లు ఎలా కనిపిస్తాయి?
    ఇలా కంటే ,

    వీధులవెంట జెండాల రంగులే తప్ప ,
    ప్రజల కడగండ్లు ఎలా కనిపిస్తాయి ?
    ఇలా వ్రాస్తే పాఠకుల గుండెల్లో వుండిపోతాయి . ఇలాంటివి వ్రాసిన తర్వాత పఠనం చేసేటప్పుడు బయట పడ్తాయి .
    సబబనిపిస్తే అనుసరించండి .

    రిప్లయితొలగించండి
  2. శర్మ గారు,
    ధన్యవాదాలు. మీరు సూచించిన సవరణలు కొంచెం అమలు చేశాను. మీ విలువైన వ్యాఖ్యలు ఎప్పటిలాగే అందిస్తూ ఉండండి.

    రిప్లయితొలగించండి

Add your comment here