ఎందుకు స్థిరపడతారు ఫోండి ఫోండి అన్నారు
స్థానిక ఎన్నికలు దరికొచ్చేసరికి
ముల్లు పంటితో తీస్తామంటున్నారు
సూటి పోటి మాటలతో గుండె గాయమే చేసి
వింత నిర్ణయాలతో విరక్తి పుట్టించి
ఎన్ని వేషాలేస్తారు?
మీకు బాకా ఊదిన పత్రికలు, కవి పుంగవులు
తరిమేద్దామని కలలుగన్న అంతర్జాల రచయితలు
నోరువెళ్ళబెట్టి చూస్తున్నారు
ఏ నిర్ణయానికి ఒత్తాసు పలకాలో తెలియక
బుర్రలు బ్రద్దలు కొట్టుకుంటున్నారు
ఒక పంధా అనుసరిస్తే మీ వెనుకనున్నవారు
నవ్వులపాలు కాబోరు
వారేమో నిజం మరచి ఉద్వేగంతో ఉత్సాహంతో
పుంఖనుపుంఖాలుగా మీ నిర్ణయాలు కీర్తిస్తే
మీరు తూచ్చి చెప్పి క్రొత్తగా దిమ్మతిరిగే నిర్ణయాలు వెలువరిస్తే
ఏ గంప క్రింద దాక్కోవాలో తెలియక మూగవోతున్నారు బాకావీరులు
స్థిరపడినవారి భుజం తడుతున్న మీ వైఖరికి
కవితలు రాక కారం పూసుకుంటున్నారు
ఎందుకీ విద్వేషాలు?
మనం తెలుగు వారలం
తరతరాల బాంధవ్యపు వెలుగు నీడలం
పట్టుదలలు, పంతాలు వదిలేసి
చేయి చేయి కలిపి నడుద్దాం
భావి తరాలకు తెలుగు వారధులు నిర్మిద్దాం
భాష నిరంతరం
మనం గతించినా నా నాలుక నీ నాలుక పలికిన,
పలికించిన భాష తరతరాలకు సాగుతుంది
మృతించు ప్రతీకారాలకన్నా ప్రేమ పంచే అమృత భాషకై పాటుపడదాం
క్షరం లేని అక్షర యజ్ఞానికి అంకితమౌదాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Add your comment here