ఇది అసలు సిసలైన ప్రత్యేకహోదా!!

నాలుకా లేక తాటిమట్టా తెలియని స్థితిలో
నాయకులు నోటికొచ్చింది వాగేసి
ప్రజలకు హామీలు గుప్పించారు
ప్రత్యేకహోదా ప్రమాణాలు చేశారు

తీరా పదవులొచ్చాక
వెంకయ్య గారు ప్రత్యేకం తప్ప అంతా మాట్లాడతారు
మోడి మాటలు చేతలు మార్చేసి నవ వరుడైనట్లు తిరుగుతున్నారు
బాబు నోరు తెరుస్తే చాలు వరాల జడివాన కురిపించేస్తున్నారు
జగనన్న సభలలో మాత్రమే తన యుద్ధ ప్రతిభ కనపరుస్తున్నారు
మరి ప్రత్యేకహోదా గురించి వీరేం చేశారు?

వీళ్ళకి గొంతు పెగలడం లేదు
మాటలు రావడం లేదు
క్రొత్త రాజధానికి దిక్కు లేదు
పాత రాజధానికి వెళ్తే శత్రువులంటున్నారు
ఇది చాలా ప్రత్యేకహోదా!

దేశంలో ఆ ప్రభుత్వమే రాష్ట్రంలో ఆ ప్రభుత్వమే
కాని దమ్మిడి ఉపయోగం లేదు
కోట్లు మాటల్లో తప్ప చేతుల్లోకి రావడం లేదు
చేతల్లో ఒక్క హామీ జరిపి చూపడం లేదు
ఇది మరీ ప్రత్యేకహోదా!!

విభజనకు ముందు
ఐదేండ్లు ప్రత్యేకమంటిరి
తరువాత పదేండ్లు ప్రత్యేకమంటిరి
మంత్రులయ్యాక పదిహేనేండ్లు ఇచ్చినా తప్పు లేదంటిరి
ఇప్పుడు ఇవ్వలేమంటున్నారు
ఇది అసలు సిసలైన ప్రత్యేకహోదా!!

అమ్మ ఇప్పుడు ఒక చిన్న పాప

దేవుడి కథలు చెప్పి
భక్తి విలువ చెప్పి
అ,ఆలు దిద్దించి
అమ్మా..ఆవు నేర్పించి
చందమామను చూపించి
గోరు ముద్దలు తినిపించి
చందమామ చదివించి
చక్కని పదాలు నేర్పించి
చిన్న గాయమైతే విలవిల్లాడి పోయి
అల్లరి చేస్తే మహదానందపడి పోయి
నన్ను ముద్దు ముద్దుగా పెంచి
జీవితపు ప్రయాణంలో అలసిన అమ్మ
ఇపుడు ఒక చిన్న పాప!

మెల్ల మెల్లగా నడుస్తూ
తడబడే అడుగులు వేస్తూ
కళ్ళద్దాలనుండి తొంగిచూస్తూ
నచ్చకపోతే మూతి ముడుచుకుంటూ
అప్పుడప్పుడూ బోసినవ్వ్లు నవ్వేస్తూ
తెల్లటి వెంట్రుకలు ముడివేసి
ప్రశాంతమైన మోముతో
దేవుని పాటలు వింటూ
నిశ్శబ్దంగా శూన్యంలోకి చూస్తూ
ఎప్పుడంటే అప్పుడు నిదుర పోతూ
కనపని మందుల డబ్బాకై మళ్ళీ మళ్ళీ వెదుకుతూ
పిల్లలతో పోటిపడి పోట్లాడుతున్న అమ్మ
ఇపుడు ఒక చిన్న పాప!

నోటిలో ముద్ద కడుపులోకి దిగాలంటే పన్ను కట్టాలా?

నోటిలో ముద్ద కడుపులోకి దిగాలంటే పన్ను కట్టాలా?
ఇంటిలోని వంటగదికి పోవాలంటే పన్ను కట్టాలా?
నిర్ణయించిన వారి పల్లు రాలగొట్టాలా?
కడుపు రగిలిపోతూంది వీరి పిచ్చి చేష్టలకి
గుండె మండిపొతూంది ఈ అసమర్థ విలువలకి

విభజించినప్పుడు అలోచించారా?
అయ్యా ఇష్టమొచ్చినట్లు విభజించారు
ఇబ్బందులున్నాయంటే ఆలకించారా?
కళ్ళు మూసుకుని పని చేస్తూ ప్రజల కడుపులు కొట్టారు
కన్నూ మిన్నూ గానక గురకలెట్టారు
రాజధాని పక్క రాష్ట్రంలో ఉంచేసి,
పోవాలంటే పన్ను కట్టాలి మరి!!
అది జగమెరిగిన సత్యం
పదేళ్ళ రాజధాని అవసరమా మరి?
ఇది విభజన గాయాల మహమ్మారి!
ఎవరు ఎవరా వెధవ నిర్ణయాల మార్గదర్శకులు
పని లేని శని గాళ్ళు పచ్చి మోసగాళ్ళు
విచక్షణలేని విషపు సర్పాలు
దూరదృష్టి లేని మంద బుద్ధులు
చదువుకోని వెర్రి నాగన్నలు సైతం విరగబడి నవ్వే
నిర్ణయాలు
దారీతెన్నూ లేని అడవిలో విడిచిపెట్టే గొప్ప సూత్రాలు

మూర్ఖుల ప్రకోపాలకు రాష్ట్రాలను బలియిస్తూ
చెదలు పట్టిన చదువులు చదివి చెత్త మనపై రుద్దేస్తూ
నోరు కుట్టేసి
చేసేదే చేస్తామంటూ
విభజించినదెవ్వరు?
 తలా తోకా లేని రాతలు రాసేదెవ్వరు?
వెనకుండి సమర్థించినదెవ్వరు?
ముందుండి దారిచూపినదెవ్వరు?
నిర్ణయాలు మురగబెట్టి పగబట్టిందెవ్వరు?
పదేళ్ళ రాజధాని అవసరమా మరి?
ఇంకా అచూరుకే పట్టుకు వ్రేళ్ళడటం అవసరమా మరి?

నిదుర పలుకరించింది

మూతలు పడుతున్న కనులు
నిద్దురను కొంచెం కొంచెంగా
అహ్వానిస్తున్నాయి
నిదుర భారం మొయలేక
కనురెప్పలు దాసోహమంటున్నాయి
క్రింద బూరుగ దూది పరుపా?
చలువ రాతి నేలా?
మట్టితో నిండిన రహదారా?
లెక్క చేయకుండానే శరీరం
జారిపోతూంది
కల మొదలయ్యీ విరామాలిస్తూ
కొంత విసుగు పుట్టిస్తోంది
కొంచెం మెలకువ! కొంచెం నిదురా!
కలగలసి వెలుగూ చీకటి కరిగించి
క్రొత్త దృశ్యాలు తెరకెక్కించినట్టుంది
చేయిని మెత్తని దిండుగా మార్చి
మెల్లగా మనసును అలోచనల
చెరసాలనుండి విముక్తి కల్పిస్తూ
హృదయం నుండి తీర్పు వెలువడింది
బాదలు, బాధ్యతలు, భారాలు
సంతోషాలు, సంబంధాలూ
ఇప్పుడెందుకో ఏవీ గుర్తుకు రావడం లేదు
తేలిపోతూ తూలిపోతూ
స్వేచ్చ దొరికిన పక్షిలాగా
ఎవరికీ అందని క్రొత్త లోకంలోనికి ఎగిరిపోతుంటే
సుఖానికి చిరునామా ఇప్పుడే దొరికినట్లుంది
దారం కట్టినంతసేపూ ఎలా తెంచుకోవాలన్న
గాలిపటంలాగా మనసు యుద్ధం చేసింది
దారం తెంచుకుని ఇప్పుడెగిరిపోతూ ఉంది


ఆశలు - దురాశలు

ఆశపడి
వెంటపడి
వేటాడి
సాధిస్తే
అది గెలుపు!
దురాశపడి
బలంతో
బలగంతో
గర్వంతో
స్వంతం చేసుకోవాలంటే
అది అహం నిండిన బలుపు

ఆశలు
కథలిస్తాయి
కదిలిస్తాయి
కవితలల్లిస్తాయి
విజయగాధల చరితనిస్తాయి
దురాశలు
మరపు రాని మరకలిస్తాయి
మృగపు ఛాయనిస్తాయి
పరాభావాన్నిస్తాయి
నియంతృత్వాన్నిస్తాయి

ఆశలు
కరిగిపోయే రుచులౌతాయి
కమ్మని అనుభూతులిస్తాయి
కలకాలం మిగిలే జ్ఞాపకాలిస్తాయి

దురాశలు
కరడుకట్టిన విషాన్నిస్తాయి
క్రౌర్యం నిండిన అనుభవాలిస్తాయి
కరిగిపోని వ్యర్థాలౌతాయి

కొనసాగు కనుచూపు మేరా కనులార్పని ఆ ఎదురుచూపు

ఆగని మనసు కాసే కాపు
కనులార్పని ఎదురుచూపు
ఆశ నిరాశల కూర్పు
కనులార్పని ఆ ఎదురుచూపు

నేర్వని భాషల నిట్టూర్పులు
నెరిపిన భాషణల ఓదార్పులు
నెమరేసిన జ్ఞాపకాల పలకరింపులు
నెమ్మది నెమ్మదిగా
కనులలో
తళుక్కుమనే నవ్వులు
చురుక్కుమన్న కోపాలు
తడితగిలి మసకబారి
ఒక్కొక్క చుక్కా జారి
ఎందుకోయని
యేలనని
కొనసాగు కనుచూపు మేరా
కనులార్పని ఆ ఎదురుచూపు

చెమర్చిన కళ్ళు నల్లని కాటుక చివరలను
మరింత అందంగా దిద్ది,
సరిచేసిన విల్లులై కనుబొమ్మలు ఒయ్యారాలు ఒలుకుతూ
ముడిపడుతూ విడిపోతూ
కొంటె చూపులు కొంత జోడించి,
ముంజేతిని ఆనుకున్న
మోము అంచున మంద్రముగ
పాడుతున్న గొంతులోని రాగం
పెదవి దాటి పొరలకుంది
మనసులోని ఆత్రుత
తీరాన్ని దాటకుంది
కొనసాగు కనుచూపు మేరా
కనులార్పని ఆ ఎదురుచూపు

చక్రవాకాలకు సిద్ధమౌతూ
ఉప్పెనలకు సమాయత్తమౌతూ
సంభ్రమాశ్చర్యాలకు పురివిప్పి
మోమున ఒక ఒంక నెలవంక
మరో వంక మినుకు మినుకు మంటున్న ఆశల వేడుక
కొనసాగు కనుచూపు మేరా
కనులార్పని ఆ ఎదురుచూపు