కనులార్పని ఎదురుచూపు
ఆశ నిరాశల కూర్పు
కనులార్పని ఆ ఎదురుచూపు
నేర్వని భాషల నిట్టూర్పులు
నెరిపిన భాషణల ఓదార్పులు
నెమరేసిన జ్ఞాపకాల పలకరింపులు
నెమ్మది నెమ్మదిగా
కనులలో
తళుక్కుమనే నవ్వులు
చురుక్కుమన్న కోపాలు
తడితగిలి మసకబారి
ఒక్కొక్క చుక్కా జారి
ఎందుకోయని
యేలనని
కొనసాగు కనుచూపు మేరా
కనులార్పని ఆ ఎదురుచూపు
చెమర్చిన కళ్ళు నల్లని కాటుక చివరలను
మరింత అందంగా దిద్ది,
సరిచేసిన విల్లులై కనుబొమ్మలు ఒయ్యారాలు ఒలుకుతూ
ముడిపడుతూ విడిపోతూ
కొంటె చూపులు కొంత జోడించి,
ముంజేతిని ఆనుకున్న
మోము అంచున మంద్రముగ
పాడుతున్న గొంతులోని రాగం
పెదవి దాటి పొరలకుంది
మనసులోని ఆత్రుత
తీరాన్ని దాటకుంది
కొనసాగు కనుచూపు మేరా
కనులార్పని ఆ ఎదురుచూపు
ఉప్పెనలకు సమాయత్తమౌతూ
సంభ్రమాశ్చర్యాలకు పురివిప్పి
మోమున ఒక ఒంక నెలవంక
మరో వంక మినుకు మినుకు మంటున్న ఆశల వేడుక
కొనసాగు కనుచూపు మేరా
కనులార్పని ఆ ఎదురుచూపు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Add your comment here