బడి ముందల కూకున్న
అచ్చమ్మవ్వ కలే పండ్లమ్ముతుంది
బిక్కిపండ్లు, జామపండ్లు, రేగుపండ్లు,
ఉసిరికలు, గంగి రేగుపండ్లు
కుప్పలు కుప్పలు పోసి అమ్ముతుంది
ఒంటికి గంట గొట్టేస్తానే చెడ్డీలు లాక్కుంటూ
ఉరుకుల పరుగులతో మేమంతా
ఆ బండ చుట్టూ చేరుతాము
అదివ్వు ఇదివ్వమని రచ్చ రచ్చ చేస్తాము
రెండు పైసలు, ఐదు పైసలు,
పావులాలు ఘల్లు ఘల్లుమని రాలతాయి
పట్టమీది పండ్ల కుప్పలన్నీ కరిగిపోయి
పట్టకింద కాసులగుట్టలై పెరుగుతాయి
తాత అప్పుడప్పుడూ వస్తాడు
ఎర్ర కళ్ళతో తాగి తూలుతూ వస్తాడు
వాన పడితే తాత గొడుగు పడతాడు
అప్పులు పెడితే పర్వాలేదంటాడు
అప్పుడవ్వా తాతలకు జగడం మొదలౌతుంది
ఒకటో అయ్యవారు రెండో అయ్యవారు
చీమిడి ముక్కుల సీనుగాడు, దారినపోయే
దానయ్యలు అందరూ పోటీబడిగొంటారు
రేగ్గాయలపై జల్లె ఉప్పుకారం కోసం
ఎగబడతారు
సాయంత్రం ఉడికించిన గుగ్గుళ్ళకై
గొడవలుబడతారు
అనపలు, శనగలు, అలసందలు, వేరు శనగలు
పెసరలు, తిరగమాత పెట్టి మహ రుచిగా
భలే రుచిగా అవ్వ వేడి వేడిగా తీసుకొస్తాది
ఒక్కోసారి ఒక్కోరకం గుగ్గిళ్ళు
ఇన్ని రుచులు సాద్దెమా అని మాకాశ్చర్యం
అత్తిరాసలు, వడలు, కజ్జికాయలు అప్పుడప్పుడూ
పండగలెనకాల అమ్ముకొస్తాది
శనగుంటలు, నువ్వులుంటలు, బఠాణీలు
కలకండ రాళ్ళు పల్లు పట పటలాడించే చిరు తిళ్ళు
అవ్వ మోసుకొస్తాది
బండ మీది అమ్మకాలు బండిమీదికి మారినాయి
బండిమీది అమ్మకాలు అంగడిగా మారినాయి
తాత కనిపించక మనవడు అమ్మబట్టె
అవ్వ అప్పుడప్పుడూ కనిపించి మాయమాయె
పై బడికి పోయినా చిన్నప్పటి గ్యాపకాలు మరచిపోక
అప్పుడప్పుడూ ఆ అంగడికి పోయెటోణ్ణి
పొరలు పొరలుగా ఆ గ్యాపకాలు నా చుట్టూ తెరలు కట్టుతుంటాయి
తెరలపైన పసితనపు చిత్రాలు కదులుతుంటాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Add your comment here