తుపాకుల మోతలతో
రక్తమోడుతున్న శరీరాలతో
కుత్తుకలు కత్తిరిస్తున్న తీవ్రవాదంతో
భరతమాత తలకిరీటం తడిసిముద్దవౌతోంది
హిమశోభల కాశ్మీరం రుధిర ధారలొలికిస్తోంది
గులాబీలతో ప్రసిద్ధిగాంచిన కాశ్మీరం
ముళ్ళతో, పదునెక్కిన తుపాకీ గుళ్ళతో నిండిపోయింది
పగలూ రాత్రీ తేడాలేకుండా నిలువు నరకం అనుభవిస్తోంది
తెగులపట్టిన చెట్టల్లే కృశిస్తోంది
హిమశోభల కాశ్మీరం రుధిర ధారలొలికిస్తోంది
వేర్పాటువాదుల చేతుల్లో తలరాత తిరగబడి
రాజకీయపు విషపుకాటుకు నేలవ్రాలుతూ
మానవత కరువైన మతారణ్యమై ఉడుకుతూ
సైన్యపు పదఘట్టనల క్రింద నలుగుతూ
హిమశోభల కాశ్మీరం రుధిర ధారలొలికిస్తోంది
ఈ దేశపు మట్టిలో పుట్టి, ఈ నేలపై రాలిపోతూ
ఈ గాలి పీలుస్తూ భారత దేశపు వనరులు మ్రింగేస్తూ
కృతజ్ఞతలేని ఈ మనుషులు
ప్రేమ పాలు పోసి పెంచిన విషనాగులు, మత మౌఢ్యులు
చట్టాల్ని చుట్టలుగా చుట్టి తలక్రిందపెట్టుకొని
ప్రక్క దేశపు కొమ్ము కాస్తూ ఆరని నిప్పును రగిలిస్తుంటే
హిమశోభల కాశ్మీరం రుధిర ధారలొలికిస్తోంది!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Add your comment here