నవ్యాంధ్ర, దివ్య తెలంగాణలను దీవింప

తెలుగు అక్షరములే బంధములై జాతి మూలములైన
నవ్యాంధ్ర, దివ్య తెలంగాణలను దీవింప
ధైర్య వీర్యములు, విజయ వైభవములు కలుగునని ఆశీర్వదింప
వేంచేయుచున్నది మన్మథ నామ యుగాది!!

వసంతపు పరవళ్ళతో
మామిడి పిందెలు పొంగి పోతూ
వేప పూతలు చిరునవ్వులు చిందిస్తుంటే
లేత చివురుల పచ్చని పలుకరింపులు వెంటరాగా
రంగవల్లుల అల్లికల పల్లకిలో
వేంచేయుచున్నది మన్మథ నామ యుగాది!!

నూతనాన్ని ఆవిష్కరిస్తూ
చేదు మరచిపోకంటూ
పులుపు మన వెంటే ఉంటుందంటూ
తీపి తప్పక ఎదురౌతుందంటూ
వేంచేయుచున్నది మన్మథ నామ యుగాది!!

తెలుగు అక్షరమాలికలు కవితలై, కావ్యాలైతే
తెలుగు భాష తీయదనం తరతరాలకు అందిస్తూ
తెలుగు వారి స్నేహం ఎల్లలు ఎరుగని బంధమని  చాటుతూ
వేంచేయుచున్నది మన్మథ నామ యుగాది!!

మాతృ భాష తెలుగు
మధువై కలమున ఒలికేది తెలుగు
మధురమై జిహ్వ పై నాట్యంబాడునది తెలుగు
అక్షర వనములై నా చుట్టూ అల్లుకున్నది తెలుగు
ఆ తెలుగునకు వెలుగునిస్తూ, ప్రకృతి పరవశించు ఉషోదయమిస్తూ
వేంచేయుచున్నది మన్మథ నామ యుగాది!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Add your comment here