నిదుర పలుకరించింది

మూతలు పడుతున్న కనులు
నిద్దురను కొంచెం కొంచెంగా
అహ్వానిస్తున్నాయి
నిదుర భారం మొయలేక
కనురెప్పలు దాసోహమంటున్నాయి
క్రింద బూరుగ దూది పరుపా?
చలువ రాతి నేలా?
మట్టితో నిండిన రహదారా?
లెక్క చేయకుండానే శరీరం
జారిపోతూంది
కల మొదలయ్యీ విరామాలిస్తూ
కొంత విసుగు పుట్టిస్తోంది
కొంచెం మెలకువ! కొంచెం నిదురా!
కలగలసి వెలుగూ చీకటి కరిగించి
క్రొత్త దృశ్యాలు తెరకెక్కించినట్టుంది
చేయిని మెత్తని దిండుగా మార్చి
మెల్లగా మనసును అలోచనల
చెరసాలనుండి విముక్తి కల్పిస్తూ
హృదయం నుండి తీర్పు వెలువడింది
బాదలు, బాధ్యతలు, భారాలు
సంతోషాలు, సంబంధాలూ
ఇప్పుడెందుకో ఏవీ గుర్తుకు రావడం లేదు
తేలిపోతూ తూలిపోతూ
స్వేచ్చ దొరికిన పక్షిలాగా
ఎవరికీ అందని క్రొత్త లోకంలోనికి ఎగిరిపోతుంటే
సుఖానికి చిరునామా ఇప్పుడే దొరికినట్లుంది
దారం కట్టినంతసేపూ ఎలా తెంచుకోవాలన్న
గాలిపటంలాగా మనసు యుద్ధం చేసింది
దారం తెంచుకుని ఇప్పుడెగిరిపోతూ ఉంది


2 కామెంట్‌లు:

Add your comment here