స్వేఛ్చాలోకంలోకి ఎగిరి వెళ్ళాలని
ఊహా జనిత ప్రతిబంధకాల
ఉక్కు ద్వారాల్ని ప్రేల్చివేసి
అర్థంలేని అపోహల సంకెళ్ళను త్రుంచివేసి
రెక్కలు వచ్చిన పక్షి మల్లె ఆకాశంలోకెగరుతోంది ఉబలాటంగా
మిరిమిట్లు గొలిపే వింతకాంతుల
ఇంధ్రధనస్సులు ఆకాశాన్నలంకరించి
నేలవైపు తొంగిచూస్తున్నాయి
ఆకుపచ్చని పైరు అంచులను స్పృశిస్తూ
నా మనసు పయనిస్తోంది
ఎదురుగా నింగిని తాకే కొండలు,
పసిడి కాంతులలో వెలుగుతున్నఆ పర్వత సానువులు
ధవళకాంతుల మేఘమాలికలు కొండల్ని చుట్టుముట్టేసి
తమ తడిపెదాలతో ముద్దాడుతున్నాయి
నా మనసు కొండ చెరియల్ని పలుకరిస్తూ
గడ్డి పూవులతో సంభాషిస్తూ
వట వృక్షాల చిగురాకులను చెలిమి చేసుకుంటూ
మేఘాలవైపు సాగింది
తొలిగా తళుక్కుమన్న సాయంకాలపు వెలుతురు పలుకరించింది
మలిగా చల్లని గాలి తెమ్మెర పులకరింపచేసింది
మేఘాలలోనికి పయనించేకొలదీ మత్తు క్రమ్మిన తీరున
దశ దిశలా తెల్లని తెరలు క్రుమ్మరించిన భావన
ఎన్నాళ్ళనుండో పారిపోతూ
నన్ను నేను ప్రశాంతమైన పొదరింట్లో దాచుకున్న చేతన
పయనించేకొలదీ ఇంకా ఇంకా నాకు నేను తప్పిపోతున్నా
మేఘ సౌధాలుదాటి పర్వత శిఖారాలపైకి చేరుకున్నా
ప్రపంచాన్ని దూరం నుండి చూస్తున్న అనుభూతి
మనసు నిశ్చలమై నిర్మలమై నిలచింది
ఎక్కడైతే మనసు భయం లేక భీతి లేక మసలుతుందో
అక్కడే ప్రశాంతత మనసుని వరిస్తుంది
ఎన్ని కోట్లు వెచ్చించిననూ పలుకరించని
మనశ్శాంతి అక్కడే స్వాగతిస్తుంది
ఎక్కడైతే మనసు భయం లేక భీతి లేక మసలుతుందో
అక్కడే కవి రవీంద్రుని అంతర్దృష్టి అనుభవమౌతుంది
ఈ కవిత మనస్సును తాకుతుంది
రిప్లయితొలగించండి