బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
ఒంకులొంకుల వయ్యారి గీత ఒంపు సొంపుల వన్నెలద్ది
మనసు పరవశించే అందమైన దృశ్యాలను మలచుతుంది 
గజి బిజి గీతలుగా మొదలై జిగి బిగి జవరాలిగా రూపు దిద్దుకుంటుంది

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
అల్లరి పిడుగు బుడుగు పరిచయమయ్యాడు
పిల్ల చేష్టల పెసూనాంబ పేద్ద ఆరిందాలా పలుకరిస్తుంది
భారీ కాయపు భార్య చనువుగా భర్తను విదిలిస్తుంది
బక్క భర్త మరీ కొయ్యబారి కలానికి దొరికిపోయాడు

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
వేంకటేసుని పాదాలు ఎంత అందంగా ఆ గీతలలో అల్లుకున్నాయి
బాధా తప్త హృదయుడైన శ్రీరాముని రూపం కట్టెదుట నిలిచింది 
అలవోకగా రాధా కృష్ణుల రాసకేళి చిత్ర ప్రేరితమయ్యింది
ఆంధ్ర రంగవల్లులు ముదితకంటే ముగ్ధంగా తెలుగు ముంగిలికి రంగులద్దాయి

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
చలన చిత్రాలతో ఊహలకు రూపం ఇచ్చి
జీవితాలకు బంగారు రంగారు వన్నెలద్ది
బంధాల అందాలను బహు చక్కగా చూపి
ప్రతి దృశ్యంలో తెలుగుదనాన్ని వెలిగించాడు

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
లిపి శైలిని సొంతం చేసుకున్న మహనీయుడు
చిత్రలేఖనంలో తెలుగుదనం నిర్వచించిన ఆదరణీయుడు
వ్యంగ్య చిత్రాల సునిశిత హాస్య చతుర కుంచె యుద్ధ నిష్ణాతుడు
రాత [వ్రాత], గీత [చిత్రలేఖనం], చేత[దర్శకత్వం], కోతలతో [చెణుకులు] చెరగని ముద్రవేసిన చిరస్మరణీయుడు

4 కామెంట్‌లు:

  1. బాపుని సృష్టించేటపుడు ఆ బ్రహ్మ గారు పొరపాటున తన చేతులనే బాపుకి అతికించేసి క్రిందికి పంపించేసుంటారు. లేకపోతే అంత అందమైన బొమ్మలని జీవం ఉట్టిపడేలా సృష్టించడం మానవమాత్రుల చేతులకు సాధ్యమా?

    రిప్లయితొలగించండి
  2. ఓ చిన్న మాట అంటూనే పేద్ద పేద్దగా విషయాలు అవలీలగా వ్రాసేస్తున్నావు మిత్రమా !

    బాపు గారి గురించి ఎంత(గా) చెప్పుకున్నా తక్కువగానే వుంటుంది .

    ' ఒంకులొంకుల వయ్యారి గీత ఒంపు సొంపుల(కు వన్నెలద్దింది )' వన్నెలద్దుకొని ,
    మనసు పరవశించే అందమైన దృశ్యాలను మలచుతుంది
    గజి బిజి గీతలుగా మొదలై జిగి బిగి (పలింకించు ) జవరాలిగా (మారుతుంది ) దిద్దుకొంటుంది .

    అచటచ్చట ముద్రా రాక్షసాలు దొర్లినాయి . అయినా అర్ధమవుతూనే వున్నాయి . అలా అనటం వాటిని ప్రోత్సహించటం కాదు మిత్రమా !

    రిప్లయితొలగించండి
  3. శర్మ గారు, సరిచేశాను చూడండి. మీ ఆదరణకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి

Add your comment here