దీపావళి

వికసిత హృదయాల
తీపి సంబరం,
ఆకసానికి ఎగసిన
తారా జువ్వల సంరంభం,
నృత్య గీతికల కోలాహలం
కలగలిసిన సంభ్రమం ఈ దీపావళి!!
వెలుగు పూల తోరణాల దీపావళి
హృదయాలలో మ్రోగె అనంద రవళి
ఈ దివ్వెల నవ్వుల ముందు వెల వెల బోతుంది అ పాల వెల్లి

ఊహల వర్షం

నీ కన్నుల
మెరిసిన ఓ వెన్నెల
నా మనసు నిండుగ విరిసింది
వేకువ పలికిన రాగమల్లె
నా గుండె లోతును తాకింది
లిఖించలేని మౌన రాగం
సాగర కెరటమై ఎగసింది
రేయీ పగలు కురిసే ఈ ఊహల
వర్షంలో ఇంకొంచెం ఆడాలి
కలలాగ సాగే ఈ పయనం
అవిశ్రాంతంగా కొనసాగాలి

పేగుబంధం

గుండెలోని ఓ చిన్ని రాగం
తల్లి నేర్పిన మమతానుబంధం
నిదురరాని ఓ ఘడియలోన
నిశీధి పాలించు నిశ్శబ్దసీమలోన
కంటి ఎదుట నిలుస్తుంది
దూరమున్న ఆ పేగుబంధం
ఓ పలుకరింపుకు తపించునో
ఓ చిన్ని మాటకై ఎదురుచూచునో
ఏడు సముద్రాల ఆవల ఏచొట నుంటివో
ననుచు ఆ తల్లి వేయి దేవుళ్ళను మ్రొక్కుచుందునో
తల్లీ నీ దరికిచేరి సేవచేయు భాగ్యమ్ము
నాకిమ్మని ఆ దేవుని నే కోరుచుంటి

మరో ఉదయం

తెల తెల వారుతూంది
ఆకాశం క్రొత ఉదయాన్ని ఆవిష్కరించబోతున్నది
చిత్రకారుడి ఊహలు
రూపం దాల్చినట్లు
ప్రపంచమంతా చీకటి వెలుగుల మిశ్రమం
అక్కడక్కడా శీతాకాలపు చలిమంటలు
చలిమంటల నుండి ఎగసే పొగలన్నీ
నింగి నుండి నేలకు జారిన రహదారులల్లెవున్నాయి
చల్లని గాలి తెమ్మెరలు తాకి మేని పులకరిస్తోంది
ఉషాకాంతుల పలుకరింపులతో
జగత్తు నిండా వెలుగు నిండిపోతూంది
చీకటి పారిపోయింది
ఆశలన్నీ నిజమయ్యె మరో ఉదయం మొదలయ్యింది

నీ స్నెహం!!

నీ ప్రక్కన కూర్చుని
ఈ ప్రపంచాన్ని వీక్షిస్తే
ఈ ప్రపంచమంతా
అనుబంధాల అల్లికలా అనిపిస్తుంది
చీకట్లు ముసిరిన నా మనసులో
చిరు దీపం వెలిగినట్లనిపిస్తుంది
కన్నీరు నిండిన కష్టాలన్నీ
దూది పింజలై తేలిపోతాయి
కలిసి చేసిన ప్రతి పని
ఆ పాత మధురమై
తీపి ఙ్ఞాపకమైతుంది
జీవిత బాటసారులమై
పయనించే దారులు వేరైనా
నీ స్నేహం నాకు నేను సాధించుకున్న
అత్యంత విలువైన బహుమానం
మాటలకందని మహోన్నత
మధుర భావాల మహా సాగరం
ఎల్లలు లేని బంధాల సువిశాల ఆకాశం
విశ్వాంతరాళంలో మెరుస్తున్న నక్షత్రాల సమాహారం
నీ స్నెహం!!

ఆమ్మ పాడే లాలి పాట

అమ్మ పాడే లాలి పాట
చల్లని దీవెనల వెన్నెల బాట
వీనుల విందైన ఆ పాట వింటూ
నిదురలోకి జారిపోతాను
ఈ ప్రపంచాన్నే మరచిపొతాను
కలల దొంతరల్లో తేలిపోతాను
చుక్కల్లో రాజునై విహరిస్తాను
అమ్మ ప్రెమంతా అందులో చూశాను
ఆమ్మ లాలి పాట
గుండెకి ధైర్యం చెబుతుంది
అనుక్షణం నీవెంటే ఉన్నానంటుంది
కలతలన్నీ మరచి కంటి నిండా నిద్దరోమంటుంది
ఎన్నెన్ని మమతానుబంధాల పూలతోట
ఆమ్మ పాడే లాలి పాట
---------
లాలి పాట పాడే ప్రతి అమ్మకి వేనవేల కృతఙ్ఞతలు

ఆ బాల్యం కావాలి

అక్కడక్కడా శీతాకాలపు చలిమంటలు
చలిమంట చుట్టూ స్నేహితులు
వెచ్చగా చలి కాచుకుంటూ
స్నెహితులతో కబుర్లాడుకుంటూ
ఆగి పోయె కాలం
చిన్ని చిన్ని పోట్లాటలు
చెమ్మగిల్లె కన్నులతొ తిరిగి కలిసిపోవడాలు
చిరునవ్వుల గుభాళింపులతో
నిండిపోయిన పుటలు
నాలుక పై కరిగి పోయె
అమ్మ చెసిన రవ లడ్డూలాగా
ఎంత తీయటి ఙ్నాపకం
ఆ బాల్యం కావాలి
మళ్ళీ మళ్ళీ రావాలి

జారే కన్నీటి శాపం

ఊపిరి నిప్పుల శగలన్నీ
ఉప్పెనలా ప్రవహిస్తాయి
గుండెల్లో రగిలే బడబాగ్నులు
ద్రవించే లావా ప్రవాహాలైతాయి
ఒక్క చూపుతోనే ప్రపంచం కాలి బూడిదవుతుంది
ఆవేశం కన్నా ఎక్కువ
అణు విస్ఫొటనం కన్నా ఎక్కువ
జీవం లేక జారే కన్నీటి శాపం

సర్వధారి ఉగాది శుభాకాంక్షలు

మిత్రమా
తేట తెలుగు మాటలోని తీయదనం తెలుసు నీకు
మాతృ భాష మరచిపోకు
ఉగాది పచ్చడి తీపి చేదులు తెలుసు నీకు
ఉగాది పండుగ మరచిపోకు
దూరం లో వున్నా నా మనసు తెలుసు నీకు
మన ఈ స్నేహం మరచిపోకు

స్వేదంలో మోదం

స్వేదంలో మోదం దాగుంది
నిర్వేదంలో ఖేదం మిగిలుంది
విజయాల బాట పట్టాలంటే
క్రొత్త ఆశలు చిగురించాలి
కలల షికారులు తగ్గించాలి
మొదటి అడుగుకై అలోచిస్తూ
సంవత్సరాలు గడిపేసి
గమ్యం చెరిపేసి
నీనుండి నీవే దూరంగాపారిపోకు
ఈ చిన్ని జీవితం వ్యర్థం కానీయకు
పోరాటం నీ వంతు
క్షణ క్షణం పరిణితి సాధించు

వ్యర్థానికి అర్థం

బానిసత్వమే నేర్పిందో
బద్దకమే నేర్పిందో
ముందు చూపే లేదు
ఆశ తీరే దారి కానరాదు
వూహల విశ్వాంతరాళంలో పేక మేడలే కడుతూ
గాలి పాటలు పాడుకుంటూ
ఏ తుఫాను గాలికో కొట్టుకు పోతావు
ప్రపంచానికి మరో రోజు గడచిపోతుంది
నీ లాంటి వ్యర్థమైన కథ మరోటి మొదలౌతుంది