అమ్మమ్మని గట్టిగా చుట్టేసి తల భుజంపై దాచుకుంటే

పొడిబారిన కళ్ళల్లో ఏదో క్రొత్త మెరుపులు
ముడతల మోమంతా పురివిప్పిన వెలుగులు
అడుగులో అడుగేసుకుంటూ బుజ్జి పాపలాగ నడిచొచ్చింది
వణికే చేతుల మునివ్రేళ్ళతో తలంతా నిమిరి
పాదాలు తాకబోతున్న నన్ను మెల్లగా దగ్గరకు 
తీసుకుని నుదుటిపై వెచ్చని ముద్దిచ్చింది
ఆ బోసినవ్వులో ఎంత నిర్మలమైన ప్రేమ
అమ్మమ్మని గట్టిగా చుట్టేసి తల భుజంపై దాచుకుంటే
మెత్తటి నూలు చీర ఇంకా మెత్తగా అనిపిస్తూ
ఎపుడో చిన్నపుడు నాకు తోడున్నానంటూ ధైర్యమిచ్చి
నిద్ర పుచ్చిన చక్కని సువాసన
ఒక్కసారిగా నా మనసు తిరిగి నన్ను చేరుకున్న భావన
వేల రోజులన్నీ వెనక్కి పరుగెట్టి
మనసుని బాల్యం వైపు నడిపిస్తున్నాయి
కళ్ళద్దాలు మెల్లగా తీసి రాలబోయిన ఒక్క చుక్కనీ
చీర కొంగుతో కంటి దగ్గరే ఆపేసింది
స్వయంగా తినిపించాలన్న తపన ఆపుకుంటూ
ప్రక్కన కూర్చుని కొసరి వడ్డిస్తూంది
ఆమె పలుకరింపులో నాకు జోలపాడిన గొంతుక
దొరికీ దొరకక దాచుకుంటూంది
తన నులక మంచం వైపు తీసుకెళ్ళి
తలగడ జరుపుతూ కూర్చోమంది
భగవద్గీతలో దాచుకున్న కుంకుమ 
మెల్లిగా తీసి నా నుదిటిపైనుంచింది
నేనలిగినప్పుడల్లా తానిచ్చే తాయం మాత్రం ఇవ్వలేదు
చేతుల్ని కదిలిస్తూ మోములో భావాలు పలికిస్తూ
దాచుకున్న కబుర్లన్నీ చేప్పేస్తూంది
అరే గడియారం మ్రోగుతుందేంటి
కల చెదిరిపోయినా అమ్మమ్మ ఊరికి ప్రయాణం కట్టేశా
ఉరుకు పరుగుల మీద మా ఊరివైపు అడుగేశా

చినుకూ రాదు చిగురుటాకూ రాదు

భావి తరముల మనుగడ యోచింపక
వృక్ష వనములెల్ల నేల గూల్చి
బహుళ భవనములు నిర్మించి
వాహనమ్ముల మోహమ్ముల మరిగి
శీతల యంత్రముల వైభవములలో పెరిగి
భూగర్భ నిక్షేపాలు ఛేదించి
విషవాయువులతోడ జీవనం కబళించి
ధూమ మేఘములు నింపి 
కాలుష్యపు క్షుద్రశక్తిని ఉసిగొల్ఫి
సృష్టి సమతుల్యత సంహరించి
స్వయంకృత  సర్వనాశనమును ఆహ్వానించు మమ్ములను
దూరదృష్టి మరచిన మమ్ములను
అతి నీలలోహిత కిరణములే ఇక
నిలువెల్లా నిమురబోవునది
వడగాడ్పుల వికృత నాట్యాలే
మనమింక కాంచబోవునది
ఆమ్ల వర్ష అభిసారికలే
మమ్ము పలుకరించబోవునది
చినుకూ రాదు చిగురుటాకూ రాదు
నీటి జగడమ్ముల నిండుగా మునిగి
పొరుగు వారితో పోట్లాటలే మిగులు
నిజమెరిగి నిత్య జీవన సత్యమెరిగి
వృక్షముల పెంచి
వనముల రక్షించి
ప్రకృతి పరవశించు జీవనమ్ము కాంక్షించు

వ్యవసాయం జూదమైపోయింది

వ్యవసాయం జూదమైపోయింది
ఓ వ్యసనమైపోయింది
భూమిని నమ్మిమోసపోయి
చివరికి భూమి తెగనమ్మిన కథలెన్నో
ఆశ చావక పుస్తెలమ్మిన వ్యధలెన్నో
ఒడలిపోయిన ఒళ్ళు
వానకై ఎదురుచూసే కళ్ళు
బక్కబారిన ఎడ్లు
బతుకున కానరాని వెలుగులు
ఎండిపోయిన చేలు
ఎడారి మాదిరి చెరువులు
కొనబోదామంటె
నికిలీ విత్తులు
నాణ్యత లేని ఎరువులు
నారు పోసి నీరు పెడదామంటే
గొంతెండిన గొట్టపు బావులు
మొదలుకాని ఎత్తిపోతలు
వడగాడ్పుల నీలి నీడలు
మబ్బు జాడే కానరాని ఆకాశం
పంటను దోచే దళారులు
ఇంతమంది శత్రువుల మధ్య
నీవేం పండిస్తావు రైతన్నా
మాకెలా దిక్కైతావు పెద్దన్నా
రైతే రాజంటూ పలికిన రోజులు
గడచి పొయాయి
కాలంలో కలసిపోయాయి
అర ఎకరం పండించలేక
పొట్ట చేతబట్టి
పొలాలన్ని అమ్మివేసి
కూలీగ మారావు రైతన్నా
కర్కశమైన కాలపు తీర్పిది రైతన్నా
అన్నపూర్ణ ఆంధ్రన్న నానుడి
ఇప్పుడు నీకై కాపుకాసే ఎండమావి
తాలు గింజలు పండించి
తడిసిన ధాన్యం తొలంగించి
చేతికందని కష్టపు చెమట చుక్కలు
ఆవిరైపాయ రైతన్నా
ఎర్రబారిన మోము 
ఎదిగిన అప్పు
ఎదురు నిలుచున్న భూసామి ఒకవైపు
కాళ్ళు చుట్టుకున్న కంటి పాపలు
ఇంటి ముద్దుబిడ్డలు మరోవైపు
గుండె పగిలి ఏడ్చేవు
బాడుగ చెల్లించలేక
కౌలు కట్టలేక
కలుపు తీయలేక
కాలాన్నెదిరించలేక
కన్ను మూతపడక
కను మూయాలని
తలంచితివే రైతన్నా
నీవెదగని సమాజం ముందుకు సాగదన్నా
ఇది మాకు ప్రకృతి శాపమన్నా
కలనైనా మమ్ము వదిలిపోబోకు
కడదాక ధైర్యం వీడబోకు

మనసు చేసిన సంతకం

మనసు ఉరకలేస్తూంది 
స్వేఛ్చాలోకంలోకి ఎగిరి వెళ్ళాలని
ఊహా జనిత ప్రతిబంధకాల
ఉక్కు ద్వారాల్ని ప్రేల్చివేసి
అర్థంలేని అపోహల సంకెళ్ళను త్రుంచివేసి 
రెక్కలు వచ్చిన పక్షి మల్లె ఆకాశంలోకెగరుతోంది ఉబలాటంగా
మిరిమిట్లు గొలిపే వింతకాంతుల
ఇంధ్రధనస్సులు ఆకాశాన్నలంకరించి
నేలవైపు తొంగిచూస్తున్నాయి
ఆకుపచ్చని పైరు అంచులను స్పృశిస్తూ
నా మనసు పయనిస్తోంది
ఎదురుగా నింగిని తాకే కొండలు, 
పసిడి కాంతులలో వెలుగుతున్న పర్వత సానువులు 
ధవళకాంతుల మేఘమాలికలు కొండల్ని చుట్టుముట్టేసి
తమ తడిపెదాలతో ముద్దాడుతున్నాయి
నా మనసు కొండ చెరియల్ని పలుకరిస్తూ 
గడ్డి పూవులతో సంభాషిస్తూ 
వట వృక్షాల చిగురాకులను చెలిమి చేసుకుంటూ
మేఘాలవైపు సాగింది
తొలిగా తళుక్కుమన్న సాయంకాలపు వెలుతురు పలుకరించింది
మలిగా చల్లని గాలి తెమ్మెర పులకరింపచేసింది
మేఘాలలోనికి పయనించేకొలదీ మత్తు క్రమ్మిన తీరున
దశ దిశలా తెల్లని తెరలు క్రుమ్మరించిన భావన
ఎన్నాళ్ళనుండో పారిపోతూ 
నన్ను నేను ప్రశాంతమైన పొదరింట్లో దాచుకున్న చేతన
పయనించేకొలదీ ఇంకా ఇంకా నాకు నేను ప్పిపోతున్నా 
మేఘ సౌధాలుదాటి పర్వత శిఖారాలపైకి చేరుకున్నా
ప్రపంచాన్ని దూరం నుండి చూస్తున్న అనుభూతి
మనసు నిశ్చలమై నిర్మలమై నిలచింది
ఎక్కడైతే మనసు భయం లేక భీతి లేక మసలుతుందో
అక్కడే ప్రశాంతత మనసుని వరిస్తుంది
ఎన్ని కోట్లు వెచ్చించిననూ పలుకరించని
మనశ్శాంతి అక్కడే స్వాగతిస్తుంది
ఎక్కడైతే మనసు భయం లేక భీతి లేక మసలుతుందో
అక్కడే కవి రవీంద్రుని అంతర్దృష్టి అనుభవమౌతుంది

ఈ విభజనకాండను పాఠ్యాంశాలుగా ప్రచురించండి

ప్రజలకు జవాబుదారీ వ్యవస్థ,
అరవై యేండ్ల ప్రజాస్వామ్యం,
గొప్ప రాజ్యాంగం, చట్టాలు, సవరణలు,
ఉన్నత మహోన్నత ఆస్థానాలు,
ఎగువ దిగువ సభలూ
అన్నీ కలిసి 
మనకూ మన భావితరాలకు
గొప్ప జీవితానుభవాన్నిచ్చారు
భవిష్యత్తులో మళ్ళీ 
విభజన జరగాలంటే 
లా జరపా(గా)లో 
ద్విగుణీకృత ఉత్సాహంతో
సోదాహరణంగా చేసి చూపించారు
దీనికి మిగతా వ్యవస్థలు సహకరించిన తీరు
సమర్థించిన తీరు మహాద్భుతం
కొసరి కొసరి వడ్డించిన వైనం అజరామరం
ఇలా జరుపవచ్చా?
ఇది వ్యవస్థ ధర్మానికి విరుద్ధం కాదా?
ఇది ప్రజాస్వామ్య మనుగడకు ప్రశ్నార్థకం కాదా?
ఇది సమంజసమేనా ?
ఇది ఏమి ఉల్లంఘించకుండానే 
ఏదీ అతిక్రమించకుండానే జరిగిందా?
ఈ విభజనకాండను పాఠ్యాంశాలుగా ప్రచురించండి
భావి భారత పౌరులు మన వ్యవస్థల గొప్పదనాన్ని 
అవహగాహన చేసుకుంటారు
సాంప్రదాయాల్ని అందిబుచ్చుకుంటారు
ప్రపంచ దేశాలు మరో వింతగా వ్రాసుకుంటాయి
కారకులైన నాయకుల, వ్యవస్థ రక్షకుల
చిత్రాలు మన దేవాలయాల్లో బద్రం చేద్దాం
వారి త్యాగనిరతిని కథలు కథలుగా చెప్పుకుందాం
ఈ తీయని అనుభూతుల్ని పది కాలాలపాటు
పదిలంగా నెమరువేసుకుంటాం

రాచనగరు ఠీవీగల రాజధాని నిర్మిద్దాం రండి

ప్రపంచ పటంలో తెలుగువారికి తలమానికమై నిలిచేలా
రాచనగరు ఠీవీగల రాజధాని నిర్మిద్దాం రండి
అచ్చ తెలుగు ప్రవహించు జీవనదిని సృష్టిద్దాం రండి
కష్టాలను క్రొత్త అవకాశాలుగా మలచుకుందాం రండి
ఎడారి మధ్య వదిలివేసినా
నిప్పులుకక్కే సూర్యునికెదురునిలచి నవశకానికి నాంది పలుకుతామని
కట్టు బట్టలతో కాలు బయట పెట్టినా
కష్టాన్ని నమ్ముకుని కలలు సాకారం చేసుకుంటామని
మనలాంటి వేలమందికి దారి చూపించగలమని
ఈ ప్రపంచానికి గురుతు చేద్దాం రండి
అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలిగిననాడు...
అంటూ కోట్లమంది తెలుగుబిడ్డల
కళ్ళల్లో ఎరుపు జీరలై
మనసులోని భావాలు ప్రతిబింబిస్తుంటే
గుండెపై రేగిన గాయానికి
సమాధానం చెబుతూ ఆకాశ హర్మ్యాల
ప్రేమ నిలయాల రాజధానిని నిర్మిద్దాం రండి
ఒక్కొక్క చెమట చుక్కా చేర్చి 
తెలుగువాడు గర్వపడేలా
పొగరుగలవాడి తలదన్నేలా
భారతావని ప్రస్తుతించేలా
మన రాజధానిని పునాదులనుండి నిర్మిద్దాం రండి
తెలుగు తల్లి అభినందించేలా
తెలుగు సామ్రాజ్యం విస్తరించిన మహరాజులు
సాహితీ సామ్రాట్టులు
భళిరా!! అనేలా
తెలుగు వెలుగుల రాజధాని నిర్మిద్దాం రండి
మట్టి చేతుల చిట్టి తండ్రులు దాచిన నాణాలిచ్చారు
మహిళామణులు తమ బంగారు ఆభరణాలిచ్చారు
లక్షలమంది యువకులు పొదుపు చేసిన ధనం ఇచ్చారు
తెలుగు వారికి క్రొత్త చిరునామా లిఖిద్దాం రండి
ఉజ్వల భవితకు శుభోదయం పలుకుదాం రండి

ఇకనైనా ఏలుకోండి ప్రక్క రాష్ట్రం మీద పడి ఏడవకుండా

ఇకనైనా ఏలుకోండి ప్రక్క రాష్ట్రం మీద పడి ఏడవకుండా
కుంటి సాకులు కుండ నిండా కాచి జనాలకు చల్ల పోసి
వెనుకబాటుతనమంతా ప్రక్కవారి చలవేనని
దౌర్జన్యం దోపిడీ ఇతరులకు అంటగట్టి
తామేమీ తెలియని అమాయకులమంటే
ప్రజలు వెర్రెత్తిపోయి కిర్రెక్కిపోయి అందలమెక్కించారు
మీ వి"భజన"కి వంత పాడారు
నిజం త్రవ్వి తీస్తే నుసిగా మారిపోదా మీ ఎత్తుగడ
కాలానికి నిలిచిననాడు తేలిపోదా మీ పగటి నీడ
ఇన్నాళ్ళూ ప్రాంతీయ వైరం మీద నెట్టి ఎదగలేకపోయామన్నారు
పదవిస్తేనే విభజిస్తేనే ప్రగతి సాధిస్తామన్నారు
ఇప్పుడు మీదేగా పాలన, చూద్దాం ఎంత వెనుకబాటు తీరుస్తారో
ఎంత ముందుకు తీసికెళ్తారో
ఇప్పుడపవాదులెవెరిమీదేస్తారో 
అపుడూ ఇపుడూ మీరే ప్రజాప్రతినిధులు
మరి గతంలో ఏం చేశారు, ఎంత ప్రగతి సాధించారు
విలాస భవంతులనుండి హాస్యం తిలకించారు
రాష్ట్రం రగులుతుంటే చోద్యం చూసారు
ఎన్ని యువప్రాణాలు బలి అయ్యాయి
ఎన్ని కుటుంబాలు తీరని వ్యథకి లోనయ్యాయి
పదవిస్తేనే పోరాడతారా ప్రజలకొరకై?
అరవై ఏండ్లలో సమాజ నిర్మాణానికి ఏం ప్రయత్నించారు?
హస్తినలో నిరంతర రాయభారాలు ప్రజలకోసమా, పదవికోసమా?
బావోద్వేగాలతో ఆడుకున్నవారు ధరావత్తు కోల్పోయారు
రాజకీయ చరిత్రలో కనుమరుగయ్యారు
కాలం పరీక్షలో ఇపుడు మీ వంతు
చెదిరిపోయే చెడు అనుభవమై మిగులుతారో
చెరిగిపోని చరిత్ర పుటలపై నిలుస్తారో
కాలమే నిర్ణయిస్తుంది