అందమైన మనసు భావన

మరిగించి
కరిగించి
తరిగించి
తనువొంచి
శ్రమిస్తే అది సాధన

ప్రశ్నించి
పరికించి -తర్కించి
భేదించి
ఛేదించి
నిలువరిస్తే అది వివేచన

విప్లవాగ్ని రగిలించి
అణువణువు కదిలించి
చెద పుట్టలు తొలగించి
కునికిపాట్లు వదిలించి
పిడికిళ్ళు పైకిలేస్తే అది ప్రతిస్పందన

శ్వాసించి
అస్వాదించి
అలాపించి
వర్ణించి
మైమరచితే అది ఆరాధన

ప్రతిస్పందనల ఆరాధన వివేచనతో సాధిస్తే
అది అందమైన మనసు భావన

మోడుల నుండి పచ్చని చివురును మొలిపిద్దాం

రండి జన జాగృతి యఙ్ఞం చేద్దాం!!
మోడుల నుండి పచ్చని చివురును మొలిపిద్దాం
కుమిలిపోతున్న జీవచ్ఛవాలకు బతుకు తీపి కలిగిద్దాం
శాసిస్తే శ్వాసించే మరమనుషులం కామని నింగిలో నిప్పుల బావుటాలెగిరేద్దాం

రండి జన జాగృతి యఙ్ఞం చేద్దాం!!
చరవాణులలో మునిగిన యువతకి చెట్టపట్టాల తీపి అందిద్దాం
చప్పున చెలిమి కేరింతలు ప్రపంచానికి చవిచూపిద్దాం
అణువణువులో దాగిన సమరోత్సాహపు ఉత్తుంగ తరంగాల్ని వెలికి లాక్కొద్దాం

రండి జన జాగృతి యఙ్ఞం చేద్దాం!!
స్వేచ్చా విహంగాల విశాల హృదయాల్ని పరిచయం చేద్దాం
గాలికి ఊగే వరి పైరుల గాలిని శ్వాసిస్తాం
సద్భావనల స్వరూపాల్ని విగ్రహాలుగా చూపిద్దాం

రండి జన జాగృతి యఙ్ఞం చేద్దాం!!
మురుగు కాల్వల చెత్త కుప్పల మధ్య కరిగిపోయే శల్య జీవులకు
నవలోకం అందిద్దాం
పదునైన మాటల శరంపరలో మునుగుతున్న రాజకీయనాయకుల
ధృక్పదం మార్చి క్రియాశీలత నేర్పిద్దాం
లోకకల్యాణం నెరిపిద్దాం
శ్రమలోని జీవన సాఫల్యాన్ని విత్తులుగా నాటుదాం
రండి జన జాగృతి యఙ్ఞం చేద్దాం!!

విద్యాలయంలో నెత్తుటి కాల్వలు

విద్యాలయంలో నెత్తుటి కాల్వలు
తల్లితండ్రుల కళ్ళల్లో కన్నీటి ధారలు
గువ్వల్లా ఎదిగిన చేతుల్లో
నెత్తుటి గడ్డల్లా వాలిన బిడ్డలు
కౄర ఉగ్రవాద రక్త దాహానికి 
బలియైపోయిన పావురాలు
ఎన్ని పేగు బంధాల శోకమో శాపమై
తగిలి ఈ రాబందుల కుత్తుకలను
కత్తిరించలేదా?
ప్రపంచమంతా ఏకమై తీవ్రవాదుల ఉనికి
నశింపచేయలేదా?
లక్ష్యం లేని లౌక్యంలేని అసంపూర్ణ
జాఢ్యాల పొరలను ప్రజలు గుర్తిస్తారు 
దాడులు జరిగే కొద్దీ శాంతికై- మనశ్శాంతికై 
ప్రజలు పరితపిస్తారు
తుపాకులు బంధాలను పంచలేవు పెంచలేవు
జన హనన మార్గాలు చేయందించే ధైర్యం ఇవ్వలేవు
తీవ్ర వాదం విజయం సాధించని సాధించలేని
ఒక నిష్ఫల క్రౌర్య మారణ కాండ
ఏ తీవ్రవాదం గెలిచి ప్రజల మన్ననలు పొందింది?
ఏ తీవ్రవాదం సామాన్య మానవులకు జీవితంపై ఆశ కల్గించింది?
మట్టిగొట్టుకుపోయే ఈ మతిలేని మౌఢ్యం వారినే దహించివేస్తుంది
ఆది అంతం తెలియని వాదం చరిత్రలో మిగులజాలదు

నిలువెత్తు అంతస్తుల రాజధాని తరువాత చూద్దువు గాని...

నిలువెత్తు అంతస్తుల రాజధాని తరువాత చూద్దువు గాని
నిలువు నరకమైన రైతు వెతలు రా!! మరి తీరుద్దువు గాని 
ఋణవిముక్తి కలిగేలోగా బ్రతుకు విరక్తి కలుగుతోంది
తలకు మించిన ఋణం కాటేస్తోంది
పురుగు మందులను అమృతంలాగ త్రాగేస్తూ
కుటుంబాల్ని సజీవ దహనం చేస్తూ
ఉరి త్రాడును ముద్దాడుతూ
రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు
చివరి ఆశ అడుగంటిన వేళ
వట్టి ఊరడింపు ఉరిత్రాడుకు దారితీస్తుంటే
చినుకురాదొకచోట
చెరువులు మునిగే వాన మరోచోట
కన్నీరు లేని ఏడుపు గాధలు
వానల్లో తడిసిన కన్నీటి పాటలు
ఏ బాంధవుడొచ్చినా
బక్క రైతు బాగు చూడడమే లేదు
బ్రతకడానికి ఒక్క ఆశా లేదు
గోడు వినని రాయిలోని దేవుడినెప్పుడో అడగడం మరిచారు
గోడు వినిపించుకోని నేల మీది నాయకులను ఈసడించుకొంటున్నారు
విమోచన పత్రాలు ఎందుకు బాబూ, చలిమంట వేసుకోడానికా?
ఋణమిచ్చినవారి వత్తిడిని రూపు-మాపు
ఋణం సున్నాగా మార్చి చూపు
బక్క రైతు వ్రేలుపట్టి నడిపించు
బరువుదించి నిజమైన నాయకుడవనిపించు

విపత్తు సృష్టించిందీ చక్రవాకం

అలలతో కొట్టి
కలలు పోగొట్టి
పొలాలు చుట్టు ముట్టి
ప్రజల కడుపు గొట్టి
విపత్తు సృష్టించిందీ చక్రవాకం

ఒడ్డున పడవ లేదు
గుడిసె పై కప్పు లేదు
కడవ లోన నీరు లేదు
కంటినిండ కునుకు లేకుండా
విపత్తు సృష్టించిందీ చక్రవాకం

చెట్లు విరిగిపడి
స్తంబాలు తిరిగిపడి
వాహానాలు ఎగిరిపడి
ఊహించ నలవిగాకుండా
విపత్తు సృష్టించిందీ చక్రవాకం

గుడి ముంపు బడి ముంపు
తలలు వాల్చిన గుంపు
కలలు కూల్చిన ముప్పు
చెరగని కష్టాల రచింపు
విపత్తు సృష్టించిందీ చక్రవాకం

దారులన్నీ నీట నిండి
ప్రజకంట కన్నీరు నిండి
ఇళ్ళలోన నీరు నిండి
జీవితాన కష్టాలు దండి
విపత్తు సృష్టించిందీ చక్రవాకం

నేను నిరాశను-నీ నీడను!!

ఏ వాలే ప్రొద్దులోనో నేను మిగిలేవుంటాను
ఏ రగిలే గుండెలోనో నే పాటనై పొంగుతుంటాను
కడలి మధ్య ఒడ్డుకై వెదుకుతుంటాను
కడతేరని బాదలన్నీ చుట్టు ముడితే
పొరలే ఏడుపులో భాగమౌతాను
నేను నిరాశను-నీ నీడను!!

మరపురాని ఓటమికి జైకొడుతూ 
దీపం చుట్టి చుట్టి రాలే పురుగునౌతాను
ముళ్ళ మధ్య పెరగకుండానే ఒరిగిన ఆకునౌతాను
చెరిగిన కలల వాకిట చేరి నిస్తేజమై
ఓడిపోతూ అబధ్ధాన్ని గెలిపిస్తాను
నేను నిరాశను-నీ నీడను!!

చీకటి రాతిరి నలుపు దుప్పట్లు కప్పుకొని
వెక్కిరించే భయాలను తోడు చేసుకుంటాను
తిరిగిరాని కాలాన్ని కలల మేఘాలపై పొంచి
వెక్కిరిస్తాను
నేను నిరాశను-నీ నీడను!!

ఆశలని ఊరించే కోరికలని తరిమికొడతాను
వైరాగ్యాన్ని నిండు మిత్రునిగా అక్కున చేర్చుకుంటాను
నేడు నాటిన చిన్ని ఆశను
రేపే వెలికి తీసి ఎందుకు చివురించలేదని ప్రశ్నిస్తాను
నేను నిరాశను-నీ నీడను!!

నమ్మిన తూనిగ రెక్కలు కసాయిల్లాగా తెగనరుకుతామెందుకు?

పురివిప్పిన వయసు సంకేతాల భ్రమలు ప్రేమలుగా మొదలై
ఆమ్ల దాడులూ అసభ్య ఘటనలుగా ముగుస్తున్నాయి
అనుభవం కోసం తపించే శరీరాలు 
పరిమితి పరిణితి పరిసరాలను మరుస్తున్నాయి
సాంకేతికతతో తీపి జ్ఞాపకాలకు బదులు తీరని క్షోబలు మిగులుతున్నాయి
అనుబంధం ఎరుగని వివాహ బంధాలు 
అనుమానాల విచ్చు కత్తులకు బలియౌతున్నాయి
బంధాలు బరువై విముక్తి కోరుకుంటున్నాయి
పెంచిన చేతులే ప్రాణాలు పెకిలిస్తున్నాయి
అగ్ని సాక్షి ప్రమాణాలు వికటిస్తున్నాయి
లోకం ఎరుగని పసి మొగ్గలు వీరి మధ్య నేలరాలుతున్నాయి
బంధం నేర్వని మనము
తహతహలాడతామెందుకు?
స్వార్థపు సంకెళ్ళలో
మన ప్రేమను బంధిస్తామెందుకు?
నమ్మిన తూనిగ రెక్కలు
కసాయిల్లాగా తెగనరుకుతామెందుకు?
బంధం విలువ తెలియని మనం!
బాధ్యాత బరువు తెలియని మనం
ఏరి ఏరి కోరి కోరి సాధించుకుంటాము
కనువిప్పని అనుబంధాల పసికందును
ఈ ప్రపంచానికరుదెంచకనే
కర్కశ కార్పణ్యాలకు
అంధ ప్రతీకారేచ్చకు
బలి ఇచ్చి మన పేగు బంధాలకూ,
మనలను నమ్ముకున్న ప్రేమ బంధాలకు
నిర్దాక్షిణ్యంగా శలవిచ్చి
లోకం వదిలిపోతామెందుకు?

ఉదయ భానుడు వేంచేయుచున్నాడు

సుప్రభాతము సహస్ర గళముల పలుకుచుండగా
దినకరుడు, శుభకరుడు లోకబాంధవుడు ఉదయించుచున్నాడు
అరుణ కందూకమువలె తూరుపుకొండల నడుమ ఉద్భవించుచున్నాడు
శశిని సాదరముగా సాగనంపుతూ 
చుట్టలుగా చుట్టుకున్న చీకట్లను చీల్చుకుంటూ
సప్తాశ్వ వాహనుడై శ్వేతాంబరి
ఉదయ భానుడు వేంచేయుచున్నాడు
రవికాంతుడు, నింగినేలు నిత్య ప్రకాశకుడు
లోక సేవకు ఉద్యుక్తుడైనాడు
మేఘాలను అరుణ రంజితం చేస్తూ
భాస్కరుడు అంబరాన్ని అలంకరించుచున్నాడు
కొండలు, కోనలు, గుట్టలు, పుట్టలు
వెలుగులతో నింపుతూ
పూవులు, లతలు, మొక్కలు, వృక్షాలు 
వనజమిత్రునికి వినమ్ర స్వాగతాలు పలుకుచుండగా
మంద్ర మారుతాలు మౌన స్పర్శా మాధుర్యం పంచుచుండగా
ప్రకృతి ప్రభాత సొగసులు నింపుచుండగా
విధి మరువని లోక వీక్షకుడు
ఆకాశపథమును అరోహిస్తున్నాడు
ఉషాకిరణముల దీవెనలతో లోకం కనులు తెరిపిస్తూ
జగత్సాక్షైన ప్రచండ మర్తాండుడు
నింగినెగబాకుచున్నాడు
నెత్తుటి రంగు పులుముకుని ఎఱ్ఱెఱ్ఱని మందారాలు గుత్తులు గుత్తులుగా విరబూస్తాయి!!

ఎక్కడైతే...మూర్ఖత్వం ప్రకోపిస్తుందో
ఎక్కడైతే... అంధకారం రాజ్యమేలుతుందో
ఎక్కడైతే...గుప్పెడు మెతుకులు కరువైతాయో
ఎక్కడైతే...ప్రజాస్వామ్యం, పెత్తందార్ల చేతిలో
ప్రతిరోజూ మణించే మూగజీవిగా మారుతుందో
అక్కడ ఎఱ్ఱని మందారాలు విరబూస్తాయి!

ఎక్కడైతే...
చినుకులు కరువై
ఆశలు ఆవిరై
బతుకే బరువై
చావే వరమైతే 
అక్కడ ఎఱ్ఱని మందారాలు విరబూస్తాయి!

ఎక్కడైతే...
బానిసత్వం బ్రతుకీడుస్తుందో
కూలీల కష్టం దోచేయబడుతుందో
మధ్య తరగతి మనుగడ ప్రశ్నార్థకమౌతుందో
అక్కడ ఎఱ్ఱెఱ్ఱని మందారాలు నిండుగా విరబూస్తాయి!

రాజకీయ కుతంత్రాలు తుద ముట్టించడానికి
కుటుంబ పాలనలు మట్టి కరిపించడానికి
ఒట్టి హామీలు గుప్పించే దొరల మెడలు వంచడానికి
నెత్తుటి రంగు పులుముకుని ఎఱ్ఱెఱ్ఱని మందారాలు గుత్తులు గుత్తులుగా విరబూస్తాయి!!


నేల రాలేముందు అమ్మ చేతి స్పర్శ గురుతు చేసింది

చెరిగిపోని అశృవులు దారినిండాపోసి
ముత్యాల కూర్పులని మభ్యపెడుతూ
విరిసిన పూవుల మెరిసిన భావాల కుత్తుకలు కత్తిరించి
రెప్పల చప్పుళ్ళను ఉద్విగ్న క్షణాలుగా ప్రయోగించి
వెదికే చూపుల వెలుగుకందకుండా
ఆశల నావలు ఒడ్డుకు చేరకుండానే
ప్రణయ సంధ్యలు ప్రళయ రాత్రులుగా మలచి
స్వప్నాల నిండా ఎడారుల ప్రయాణాలు 
స్వగతంలో నిర్వేదపు నిర్యాణాలు నింపి
భ్రమలు వీడిన లోకపు అక్షర సత్యాలు
దారం తెగిన పూదండకు మిగలని పుష్పాలై 
ద్వారాలను మూసుకున్న రక్త సంబంధాలు 
హృదయపు రాతిని కోస్తుంటే 
లతలు విడివడి కలతలతో కథ ముడిపడి
ఈదురుగాలికి కొమ్మలు రెమ్మలు తగులుకుంటూ 
తూలిపోతున్న తాను ముక్కై
నేల రాలేముందు అమ్మ చేతి స్పర్శ గురుతు చేసింది
నేనంటూ నాకంటూ ఒక ఆశ, శ్వాస నా చుట్టూ పరిభ్రమిస్తూనే వుందని.

దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!

భూమిలోకి తొక్కుతానంటరు
మెడలు విరిచేస్తానంటరు
జనాలను తరిమేస్తానంటరు
రెచ్చగొట్టే రోషం చూపిస్తరు

దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!

రైలు బండికి నిజాము పేరు పెట్టాలంట
పాఠంగా పిల్లలకూ చెప్పాలంట
నిజాము పాలనను తీసుకొస్తారంట
కాశ్మీరూ తెలంగాణ భారత్ లో లేవంట

దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!

నిజాము పాలనను మరిపిస్తూ ఇండ్లు పగలగొడితిరంట 
జనాలు తిరగబడితే తోక ముడిచిపోతిరంట 
మాధ్యమాలను మూయించి మొండిరాజులనిపిస్తిరంట 
ఇల్లు ఇల్లంతా రాజులూ మంత్రులై పదవులేమో పంచుకొంటిరంట 

దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!

విమోచన దినము చేయకుండ అడ్డుబడితిరంట
గోలుకొండ కోట మీద, 
ఏది!! మన గోలుకొండ కోట మీద జాతీయ జెండ ఎగిరేయకంటిరంట

దొర నైజము చూచితివా ఓ బిడ్డా!

బండెనక బండ్లుగట్టి...అంటూ మళ్ళీ పాడాలంటావా ఓ బిడ్డా!!


బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
ఒంకులొంకుల వయ్యారి గీత ఒంపు సొంపుల వన్నెలద్ది
మనసు పరవశించే అందమైన దృశ్యాలను మలచుతుంది 
గజి బిజి గీతలుగా మొదలై జిగి బిగి జవరాలిగా రూపు దిద్దుకుంటుంది

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
అల్లరి పిడుగు బుడుగు పరిచయమయ్యాడు
పిల్ల చేష్టల పెసూనాంబ పేద్ద ఆరిందాలా పలుకరిస్తుంది
భారీ కాయపు భార్య చనువుగా భర్తను విదిలిస్తుంది
బక్క భర్త మరీ కొయ్యబారి కలానికి దొరికిపోయాడు

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
వేంకటేసుని పాదాలు ఎంత అందంగా ఆ గీతలలో అల్లుకున్నాయి
బాధా తప్త హృదయుడైన శ్రీరాముని రూపం కట్టెదుట నిలిచింది 
అలవోకగా రాధా కృష్ణుల రాసకేళి చిత్ర ప్రేరితమయ్యింది
ఆంధ్ర రంగవల్లులు ముదితకంటే ముగ్ధంగా తెలుగు ముంగిలికి రంగులద్దాయి

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
చలన చిత్రాలతో ఊహలకు రూపం ఇచ్చి
జీవితాలకు బంగారు రంగారు వన్నెలద్ది
బంధాల అందాలను బహు చక్కగా చూపి
ప్రతి దృశ్యంలో తెలుగుదనాన్ని వెలిగించాడు

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
లిపి శైలిని సొంతం చేసుకున్న మహనీయుడు
చిత్రలేఖనంలో తెలుగుదనం నిర్వచించిన ఆదరణీయుడు
వ్యంగ్య చిత్రాల సునిశిత హాస్య చతుర కుంచె యుద్ధ నిష్ణాతుడు
రాత [వ్రాత], గీత [చిత్రలేఖనం], చేత[దర్శకత్వం], కోతలతో [చెణుకులు] చెరగని ముద్రవేసిన చిరస్మరణీయుడు

తెలంగాణ అభిమానం పొందేది ఇట్లగాదు -తెలంగాణ బూచీ

ప్రతి అంశానికి, ప్రతి నిముషానికి తెలంగాణ ముడిపెట్టి
ఎదుటివారిని భయపెట్టి, బెదరగొట్టి
రోజులు గడిపేద్దామని అనుకుంటివా?
నీ ఒక్కడిసొత్తుగాదు తెలంగాణ 
అత్మాహుతి చేసుకున్న అమరుల నెత్తుటిచుక్కలతో
పుట్టింది తెలంగాణ 
కష్టాలకోర్చి కన్నీళ్ళకోర్చి పోరాడిన
వీరుల సొంతం తెలంగాణ 
అధికారం కోసం, బంధుప్రీతి కోసం
మొగ్గ తొడగలేదు తెలంగాణ 

వంగితే....తెలంగాణను అవమానపరచినట్లే
లేస్తే.....తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టినట్లే
తుమ్మితే....తెలంగాణ పైన కుట్ర పన్నినట్లే
ఎవరైనా నిన్ను విమర్శిస్తే...తెలంగాణ బిడ్డ కానట్లే
ఎందుకు విషపు చుక్కలు కలుపుతావు?
ఎందుకు కలుపు మొక్కలు ఇంకా నాటుతావు? 

ఎన్నాళ్ళు  ప్రజలను తెలంగాణ బూచి చూపెట్టి తప్పుదారి పట్టిస్తావు 
ఎవరి నోటా మాట పెగలకుండా మాంఛి మంత్రమనుకొంటివా-తెలంగాణ బూచీ
మళ్ళీ మళ్ళీ భయపెడితే పిల్లికూడ భయపడదు -తెలంగాణ బూచీ
తెలంగాణ అభిమానం పొందేది ఇట్లగాదు -తెలంగాణ బూచీ

పాలనపై కళ్ళుపెట్టు పేదలకు కూడు బెట్టు, గూడు కట్టు
పంతాలకుపొయి వచ్చిన పని మరచిపోకు
పనికిమాలిన మాటలతో నోరు పారేసుకోకు
తెలంగాణ పాలించే అదృష్టం దక్కింది 
దండం బెట్టు జనాలకి, దారి చూపు జనాలకి!!

మాధ్యమాలను నియంత్రించి మూర్ఖుడివనిపించుకోకు

కత్తిపోటు ఒక ప్రాణాన్ని తీస్తే
కలంపోటు ఒక సైన్యాన్ని తయారు చేస్తుంది
అధికార మదమెక్కి విర్రవీగి 
కలంపై కత్తులు దూస్తూ
వేల జీవితాలపై ఉక్కు పాదం పెడుతున్నావు

పదాల పొందికలే పదునైన ఆయుధాలుగా
నిత్య వార్తలతో పత్రికలతో ప్రజల నాడి ప్రతిస్పందనగా 
సామాన్యునికందుబాటుగా, తోడ్పాటుగా 
మాధ్యమాలు నిలిచినపుడు
గొంతునొక్కి, అణగద్రొక్కి, 
త్రొక్కిపట్టి వేడుక చూస్తున్నావు

ఎన్ని నాళ్ళు నీ ప్రస్థానం
ఇదు సంవత్సరాల ఆ స్థానం 
అందలం దిగకా మానదు
నషాళానికంటిన మత్తు దిగిరాకా మానదు
మాధ్యమాలను నియంత్రించి మూర్ఖుడివనిపించుకోకు

పాత్రికేయ మహాశక్తి మౌన ముద్రయై
అహింసా పోరాటమై
ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నా
పదునెంచని, పరికించని నీవు
ఒకనాడు పశ్చాత్తాప పడక తప్పదు

గళానికి, కలానికి సంకెళ్ళు వేసినపుడు
పత్రికా, మాధ్యమాల స్వేచ్ఛను హరించినపుడు
నీలాంటి నియంతలకు నిష్క్రమణ తప్పదు
తునకలుగా, పిడకలుగా
దొరికిపోయి, తరిగిపోయి, 
కరిగిపోయి, చెరిగిపోయి
వెనుదిరికి కనువెదకి చూస్తే
తెర మరుగై, కంపు మురుగై
చీకొట్టి, ఫోకొట్టి
పతనం కాక తప్పదు

గుండె కోసే మంత్రము, ఏదో చెప్పండి చూద్దాం

కలలోనిది
కథలోనిది
వ్యధలోనిది
ఎదలోనిది

కనిపించదు
వినిపించదు
మరుపివ్వదు
మరణించదు

మౌన సంగీతము
విరహ విషతుల్యము
బంధ మకరందము
అంధకార సాగరము

ప్రభాత పారవశ్యము
సంధ్య సౌందర్యము
పులకిత వసంతము
నిశ్చల శిశిరము
కర్కశ తామిస్రము


విప్పారిన మనోనేత్రము
విధినెదురించు పాశాస్త్రము
గుండె కోసే మంత్రము
లౌక్యం పొసగని సూత్రము

పధకాలు సరే, పని జరిగిందెక్కడ బాబూ?


కోట్లంటావు కోతలు లేవంటావు
నడివీధిలో నిలిపారంటావు
నీళ్ళిస్తానంటావు 
నిధులెక్కడ కాస్త చూపించు బాబూ
పధకాలు సరే, పని జరిగిందెక్కడ బాబూ?

అదిగో ఓడరేవులంటావు
ఇదిగో విమానాశ్రయమంటావు
కేంద్ర అనుమతులెక్కడ బాబూ
పధకాలు సరే, పని జరిగిందెక్కడ బాబూ?

రైతు రాజ్యమంటావు
ఋణ మోక్షమంటావు
మహిళా ఋణాలంటావు
రూపాయలు చూపించు బాబూ
పధకాలు సరే, పని జరిగిందెక్కడ బాబూ?

ఒక పధకమైనా ప్రజలకందేలా చూడు
వేయికళ్ళతో ఎదురుచూచు ప్రజలమధ్యకొచ్చి చూడు
పధకాలు ప్రవేశపెట్టడం గొప్ప కాదు
ప్రజలకందేవరకూ ఇచ్చిన మాట నిజం కాదు

చట్ట సభనా లేక మీ చుట్టాల సభనా?

ప్రియురాలికి వీడుకోలు చెప్పినట్టు
చట్ట సభకు చేతులూపుతూ వెళ్ళిపోతావు
నీ సభ్యుల గొంతు నొక్కేసి
ఒక్కడివే ఎంచక్కా పుటలు పుటలు  చదివేస్తావు
దుడ్డు కర్ర పెట్టి చిన్నపుడు పధ్ధతులే నేర్పింటే ఇప్పుడిలాగుండెదా?

నీ మాటే సాగాలంటూ పట్టుబట్టేసి బల్లలు విరిచేసి
గజేంద్రమోక్షపు విష్ణువు పరుగులెట్టినట్లు
ఎక్కడికో వెళ్ళిపోతావు
మీ సభ్యులంతా అవాక్కై చూస్తుంటే ఎదో విజయం ఒంటిచేత్తో సాధించినట్లు
మొహమాటంగా నవ్వుకుంటూ మాయమౌతావు
దుడ్డు కర్ర పెట్టి చిన్నపుడు పధ్ధతులే నేర్పింటే ఇప్పుడిలాగుండెదా?

క్రొత్త సభ్యులకు పాఠాలే నేర్పుతుంటే రాను పొమ్మంటివి
అనుభజ్ఞుల మాటా పెడచెవిన పెట్టేస్తివి
చెప్పిందే వేదమంటూ చెవిపెట్టి ఆలకించవు
పెద్ద లేదు చిన్నలేదు, అందరినీ తోలుబొమ్మలాటాడిస్తావు
దుడ్డు కర్ర పెట్టి చిన్నపుడు పధ్ధతులే నేర్పింటే ఇప్పుడిలాగుండెదా?

గొడవ చేసి గోలచేసి చర్చ మాదే కావాలంటావు
చర్చ మొదలవ్వగానే నిష్క్రమిస్తున్నామంటావు
గందరగోళంలో మీ సభ్యులు తలలు పట్టుకుంటుంటే 
వెంట రాలేదని తలమీద మొట్టికాయలేస్తావు
దుడ్డు కర్ర పెట్టి చిన్నపుడు పధ్ధతులే నేర్పింటే ఇప్పుడిలాగుండెదా?

నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

కూత పెడుతూ, నా గుండె కోత కోస్తూ
పట్టాలెంబడి తనకేమి పట్టనట్టు
చలి గాలిని చీల్చుకుంటూ
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

ఇప్పుడే రాములోరి గుడి దాటి
చదూకున్న బడి దాటి
ఊరి చివరి నారు మళ్ళు దాటి
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

బరువెక్కిన గుండెతో
ఎరుపెక్కిన కళ్ళతో
తల్లడిల్లే మనసుతో
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

వయసుడిగిన అమ్మ నాయనలనొదిలి
ఎంటబడి వచ్చే నేస్తగాళ్ళనొదిలి
మాటిచ్చిన మగువనొదిలి
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

పంట చేలు నీరందక ఎండిపాయ
రాదారి పనులు డబ్బులందకనేపాయ 
రాయి గనులు రాజకీయాలతో మూతబడిపాయ
పొయ్యిలో పిల్లి లేవకపాయ
ఆకలి తీర్చ గతి లేక
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

ఎద్దులు ఎంకటేసుకు మరుగుతాయోలెదో
అమ్మ ఇదు మైళ్ళు బోయి పాలు అమ్ముకొస్తాదోలేదో
నాయిన కొండ మీద కట్టెలు మోసుకొస్తాడోలెదో
కష్టాలు తీరుస్తానని మాటిచ్చి 
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

శానా బరువబ్బా ఈ బాద
గుండె పగల గొట్టినట్టు
రంపంతో కోసినట్టు
రగతమేదో పీల్చినట్టు
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

సేవ చేతువేని నిస్వార్థమైన మనసు తోడ

సేవ చేతువేని నిస్వార్థమైన మనసు తోడ
సర్వంబనుకూలించును ప్రకృతి వరము చేత
భొగ భాగ్యమ్ములొరుగునో లేదో చెప్ప జాలము కానీ
ఎవ్వండు కొనలేని సౌమనస్యము స్వంతమగు నేస్తమా

విజయం నీ సొంతం ఎందుకు కాదూ!?

చమట చుక్క
విలువ తెలిసి,
చెదిరిపోని
తపన కలిగి,
ఒడిదుడుకులకు
బిగి సడలక,
వెనుదిరగక
నినదిస్తే,
ఒటమి ఝడుపులను
పురోగమిస్తే,
విఘ్న శతఘ్నుల నెదిరించి
మున్ముందుకు పయనిస్తే,
మనసులోని
భయాలని తరిమేసి,
సాధించిన
అనుభూతిని నెమరేస్తే
విజయం నీ చెంతకు ఎందుకు రాదూ!?
సంకల్పం వెలిగించి
కొవ్వును కరిగించి
వేదన మరిగించి
ఇంధనముగ నడిపిస్తే
విజయం నీ సొంతం ఎందుకు కాదూ!?

న్యాయ స్థానం ఏ-కేసి ఆరు-న్నొక్క రాగం తీయించినా...

న్యాయ స్థానం ఏ-కేసి ఆరు-న్నొక్క రాగం తీయించినా
బుద్ధి రాని పాలకులు టపాకాయల్లా పేలుతున్నారు
వ్యర్థ ప్రేలాపనలు చేస్తున్నారు
వారు క్రొత్త అర్థాలు వెదుక్కుంటూ
ప్రజలను ప్రక్క దారి పట్టించాలని చూస్తుంటే
ప్రజలు మాత్రం వీరి వెర్రి చేష్టలకి విరగబడి నవ్వుతున్నారు
చేస్తున్నది తప్పని తెలిసి మరీ త్రవ్వుకుంటే
తాము తీసిన గోతిలో తామే పడతామని రుజువు చేస్తున్నారు
ఎందుకర్రా విఱ్ఱవీగుతారు
ప్రజలను మరచి పాలన మరచి
మొండి పట్టుదలలు పొంతనలేని పౌరుషాలు చూపిస్తూ
ఎవరూ లేని చీకట్లో జబ్బలు చరుస్తారు
నీడలపై పోట్లాటలకు సిద్ధమౌతారు
నివురు గప్పిన నిప్పంటూ బూడిద మసి పూసుకుంటే సరిపోతుందా?
లోన విషయముండాలి కదా!?
కనకపు సింహాసనమున ...
చందం కాకుండా
కృషి ఉంటే మనుషులు...
అనిపించుకోండి
మాకు మార్గదర్శులు కండి


నేనే ఒక పనిముట్టునై పదును తేలుతున్నా!

ఇనుప చట్రాలమధ్య చిక్కుకున్న ఒంటరి బానిసత్వం
ఎప్పుడో కడతేరిపోయింది
అంతః శత్రువుని శాశ్వతంగా సంహరించిన నాకు
క్రొత్త రెక్కలు ఎప్పుడొచ్చాయో తెలియదు
కోరినంత దూరం స్వెఛ్చా విహంగంలా ఎగిరిపోతున్నా
ఊహకందని తీరాలకు చేరుకుంటున్నా
వెలుగు కోరే చిరు ఆశల జాబితా 
పుటల క్రొద్దీ నిండిపోయింది
ఆత్మ విశ్వాసపు గొడ్డలి వ్రేటుతో
సోమరి సంకెళ్ళను తెగ నరికి
బద్దకపు పెనుభారాన్ని 
స్వేద శౌర్యానికి బలి ఇస్తున్నా! 
ఆరని ఆశయాల కొలిమిలో 
నేనే ఒక పనిముట్టునై పదును తేలుతున్నా!
ఎలుగెత్తిన వెలుగద్దిన నిలువెత్తు విజయాల 
సంతకం చేస్తున్నా!
అంతః శత్రువుని శాశ్వతంగా సంహరించి 
మున్ముందుకు దూసుకుపోతున్నా!!

ప్రంతీయత చిచ్చు పెట్టి పాలనను జోకొట్టలేరు

ఉద్యమాల ఊపిరితోడ ఉన్నతము ననుభవిస్తూ
దృష్టి ఆభివృద్ది పైనుంచక ప్రజా సంక్షేమమెంచక
కలిసి బ్రతికిన తోటి తెలుగువారలపై కక్ష పెంచుకొనుచూ
రాద్ధాంతముల్ సిద్దాంతమై సాగుతున్నది ఈ దమనకాండ

అణగారిన జీవులకాశ్రయమ్ము గల్పించి
కొండెక్కు జీవితాలకండగా నిలిచెదరనుకుంటే
వాలంబు పెంచి వైరమ్మున్ పంచి దలవంపులు దెచ్చితిరి
ఇది పాలనయాయని చిత్రముగ జూచి ప్రజలు ఛీత్కరించెదరు

నేను రాజు, నాదియే రాజ్యమటంచు విఱ్ఱవీగు
వక్ర వాక్కుల వికృత ప్రాంతీయవాద రాక్షసులు
ఉద్యమాలను స్వంత ఉయ్యాలలుగా వాడుకొను ఉత్తుత్తి నాయకులు
ప్రంతీయత చిచ్చు పెట్టి పాలనను జోకొట్టలేరు

సీమాంధ్రకాగర్భ శత్రువుగాదు - తెలంగాణ
ప్రాంతీయత పరిపక్వతనొందిన పరిణత ప్రేరణ - తెలంగాణ
వీనుల విందుసేయు పలునాదమ్ముల సమ్మోహన వీణ - తెలంగాణ
తేనియ తెలుగు తటాకమునందలరారు మూడు పసిడి కమలములు ఆంధ్ర, సీమ, తెలంగాణ

విషపు తరునఖములు దారి వెంబడి కాపు గాసి
బంధపు ఉనికినే ఎసరుబెట్టినచో
శత సహస్ర మార్గములన్వేషించి తెలుగు బంధం నిలుపుకొనెదము
వెఱ్ఱి పనులు మాని ప్రజలు మెచ్చే పాలన సాగించండి

పోలవరం కథ, స్థానికత కాదేదీ వివాదానికనర్హమంటూ

భావి పౌరుల భవితతోనా  ఆటలాడుతున్నావు?
తెలుగు బిడ్డల వెలుగుపైనా అడ్డం పడుతున్నావు?
ప్రవేశ సమయం మించి పోతున్నా మిన్నకున్నావు
నీ దారి నీదే నంటూ మొండికేసుకున్నావు
ఒక్కసారి అందలమెక్కా ఇంత విఱ్ఱవీగుతున్నావు?
వాహన పన్నంటూ చట్టం తీసుకోస్తే
న్యాయస్థానం మొట్టికాయలేసింది
ఉద్యమాల పేరు చెప్పి ఎన్నాళ్ళు తలలూపమంటావు
తగవుపెట్టి తెగదెంపులుచేసి తలుగందుకున్నావు
సొంత రాష్ట్రం సంతలాగ తయారౌతుంటే
ఎవరిపై ఉద్యమాలు చేయాలో తెలియక అనుచరులు వెర్రిమొహాలేస్తున్నారు
ప్రతి విషయం రాద్ధాంతం చేసి, శత్రుత్వం రగిలించి
పోలవరం కథ, స్థానికత కాదేదీ వివాదానికనర్హమంటూ
లక్ష మార్గాల్లో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నావు
పాలనంటే ప్రజలను రెచ్చగొట్టడం కాదు
పాలనంటే ప్రక్క రాష్ట్రం మీద పడి ఏడవడం కాదు
పాలనంటే ప్రజలపైన దండెత్తడం కాదు
పాలనంటే నియంతృత్వ నిరంకుశ ధోరణి కాదు

పొరుగువారి పొరపొచ్చాలు

కుతూహలమ్ము గుండెలలోన పొంగుతుండవచ్చు
పొరుగువారి పొరపొచ్చాలు గుమిగూడి వినివచ్చి
పదుగురితో పంచుకొనబోవ ఒక్కసారి స్వానుభవ రీతి
యోచింప పలుకుంబట్టు త్రప్పక విరియు నీ నీతి

ఒక పలుకరింపుకై ఎదురుచూసే నేను ఒంటరిని

ఉదయం సాయంత్రంగా పరివర్తన చెందే వరకూ 
జరిగే జీవన పోరాటంలో నేను ఒంటరిని

రాత్రి, ఉదయమయ్యేవరకూ 
జరిగే మానసిక సంఘర్షణలో నేను ఒంటరిని

శీతల ఉదయాల పొగ మంచు తగిలేవేళ 
భావాలు పంచుకొనలేని నేను ఒంటరిని

యెదలోన బాదలముల్లు గ్రుచ్చుకునే వేళా 
పంచుకునే హితులు లేని నేను ఒంటరిని

పుష్పవనాల మధ్య విహరిస్తూ 
అనుభూతి పంచుకొనలేని నేను ఒంటరిని

కష్టాల కౌగిళ్ళలో ఊపిరాడక ఆర్తనాదాలు 
చేయ పేరు పెగలని నేను ఒంటరిని

ప్రతిరోజూ ఎవరూ వ్రాయని ఉత్తరానికై 
ఎదురుచూసే నేను ఒంటరిని

సాగిపోయే దారి వెంబడి ఒక పలుకరింపుకై 
ఎదురుచూసే నేను ఒంటరిని

కథలు చదువుతూ నా కలలు 
నిజమైతాయనుకునే నేను ఒంటరిని

రోజొక క్రొత్త ముసుగుతో 
పరిచయాలకై కాపు కాసే నేను ఒంటరిని

వేలం పాటలో ఒంటరితనాన్ని
వెలకట్టకుండానే దక్కించుకున్న నేను, ఒంటరిని

ఒంటరితనానికే విసుగు పుట్టించ సత్తాగల 
ఏకైక ఒంటరిని

అపుడే మొదలైన ప్రయాణంలో ఒంటరిలా, 
ఎపుడూ అదే అనుభవం విధిర్లిఖితంలా అనుభవిస్తూన్న 
నేను ఒంటరిని

పరిచయం పాదుకోకనే, 
స్నేహం చివురులు తొడగకనే
ఒంటరితనపు విజయబావుట ఎగురవేసే 
నే ఒంటరిని

ఒక క్రొత్త తోడు దొరుకుతుందనే ఆశలో 
మిగిలే నే ఒంటరిని 

బూజు భావాల గాజు కన్నుల పాషాణ హృదయాల 
పసిడి మనుషుల మధ్య
నేను ఒంటరిని

చేతులు మాత్రమే కలిసి 
చేతలు కలవని జన జీవనంలో నేనొంటరిని

మానవ సంబంధాల మధ్య 
నిలువెత్తు గోడలు నిర్మించుకుని ఒంటరితనాన్ని 
రాశులలో కొనుగోలుచేస్తున్న వారిని చూస్తే
నేను నిజంగా ఒంటరిని!!

జాతీయ క్రీడలు నిర్వహిస్తానంటావేం బాబూ?!

రుణభారం
తలసరి భారం
దాయాది వైరం 
తడిసి మోపెడౌతుంటే

రాజధాని లేని రాజ్యం
చట్ట సభలు లేని రాష్ట్రం
మన చేతుల్లో పెడుతుంటే
మనకు నీడలేక ఛస్తుంటే

నీటి కరువు
విద్యుత్తు బరువు
మనమీదపడి దరువేస్తుంటే

మొలకు కట్ట బట్ట లేదు
తలకు చుట్ట తుండుగుడ్డా లేదు
పలకబట్ట శక్తి లేదు
మమ్ము ఆటాడేస్తావా ఓ బాబూ!
జాతీయ క్రీడలు నిర్వహిస్తానంటావేం ఓ బాబూ?!

అది చేస్తావిదిచేస్తావని
పదేండ్ల తరువాత
పిలిచిమరీ పదవిస్తే
గొంతులో నీరు పోయక
పంతులోరికి దారి చూపక
ఆటలంటూ పాటలంటూ గంతులేద్దామంటవేం బాబూ!
జాతీయ క్రీడలు నిర్వహిస్తానంటావేం బాబూ?!

ఆసుపత్రి కట్టు
పేదలకిండ్లు కట్టు
కోట్లుపెట్టి మా నోరుగొట్టి ఏ ఆటాలాడబోకు
తెగువచూపు తెలుగోడివన్న పేరు చెడగొట్టుకోకు
పీడలన్ని ఒదిలాక క్రీడలెన్నొ ఆడొచ్చు
క్రినీడలను తొలగించి అంధ్రాను వెలిగించు
నవ్యాంధ్ర నిర్మాణం ఘనంగా నిర్వహించు ఓ బాబూ?!

వానల్లు కురవాలి!! కరువు తీరేలా, కలలు పండేలా

తేలిపోయే మబ్బులు
తరిగిపోయిన వనాలు
ఎండుతున్న బావులు
నిప్పులు కక్కే గాలి
పురి విప్పని నెమలి
పెదవిప్పని కోకిల
పండకుండానే ఎండిన ఆకులు
ఎదగకుండానే ఆరిన మొలకలు
వాడిపోయిన ములగ చెట్టు
తడారిన పొలం గట్టు
బీటలు వారిన పంట భూమి
గుంటలు తేలిన ఆసామి
తెల్లబడిన కొండ వాలు
నెరెలీనిన చెరువు నేల
వన వేదన
మానవ రోదన
ఈ వ్యధలన్ని వెతలన్నీ
మట్టు వరకూ కొట్టుకు పోవాలంటే 
వానుల్లు కురవాలి!!
వరిచేలు పండాలి
నాగలి భుజానికెత్తి
నవ్వుకుంటూ రైతన్న
పొలం బాట పట్టాలి
పెదవి దాటిన
కూని రాగం ఉత్సాహం
నింపుతుంటే
పంట కాలువలలో
నీరు పారుతూ కమ్మని
శబ్దం చేస్తుంటే
పచ్చని పైరు చూసి
ఇంటిలక్ష్మి పదాలే అల్లుతూ
జానపదాలే పాడుతుంటే
చేతికొచ్చిన పంట
చూసి రైతు మురిసిపోతుంటే
వాన నీటిలో పిల్ల భడవలు
పడవలు వదులుతుంటే
వేకువెక్కని మబ్బులమాటున
వేడికక్కని సూరీడు
దోబూచులాడుతుంటే
ఉరకలేని మేకపిల్ల
పడిలేచి పరుగులెడుతుంటే
బడులవైపు చిన్నారులు
బారులు తీరిన కొంగలల్లే
గుంపులుగా కదులుతుంటే
పచ్చి గడ్డి పరమాన్నం
తిన్న ఆవు, దూడ పిల్లని
వొళ్ళంతా తడిపేస్తూ ముద్దాడుతుంటే
ఆ వేడుక  చూడాలి
వానల్లు కురవాలి!!
అందరి కలలూ పండాలి

ఊపిరి సలపని కోపమై మిగులుతుంది అపార్థం

మాటలోని అర్థమేదో తెలియకుండా
మర్మముందని మధించి
పదే పదే తలచి
పలుగు పెట్టి త్రవ్వి త్రవ్వి
పుట్టలోని పాములల్లె గుంపులుగా
విషపు అలోచనలు ఒలికి ఒలికి వెలికివచ్చి
నిదురింప మనసురాక
ప్రశాంతత తిరిగిరాక
గుండె వేగం పెరిగి
రక్తమంతా మరిగి
విసుగు విసనకఱ్ఱై విసురుతుంటే
ఊపిరి సలపని కోపమై మిగులుతుంది అపార్థం!!
నేరుగా ప్రశ్నించి అర్థమడిగితే
సూటిగా మసలుకుంటే
సమయం వ్యర్థం కానివ్వక
బంధం బరువవ్వక
అరోగ్యం సౌభాగ్యమై
మాయమౌతుంది అపార్థం!!

స్వార్థ ప్రాంతీయవాద కరాళ నృత్యం ఇక కొనసాగుతూనే వుంటుంది

విద్యుత్ వాటా వివాదాలు వైరుద్ధ్యం సృష్టిస్తుంటే
జల జగడాలు జనాల సిగపట్లకు దారి తీస్తుంటే
విద్యార్థుల భవితకి స్థానికత క్రొత్త శత్రువై భయపెడుతుంటే
ప్రభుత్వమొసగిన భూములన్నీ మీవి కావు పొమ్మంటూ
కార్యాలయాలమధ్య కంచెలు బిగించారు
చీకటి క్రమ్ముకొన్న బంధాలు
తూటాలు ప్రేల్చుకుంటున్న ప్రభుతలు
భూమి తడిబారని, గొంతు తడియారిన వైపరీత్యాలు
తేది దాటి పుడితే  నీది ఈ రాష్ట్రం కాదు 
ఇప్పటిదాకా అటువైపున్న వాడు, అరవై అనగానే ఇటువైపంటున్నాడు
ఎవరీ అద్భుత కళాకారులు
ఎక్కడి జగన్నాటకమిది  
ఎవరి వ్యూహమై నడచిన కుఠిల సంగ్రామమిది
ఎవరు కోరిన అధికారకాంక్షా విజయమిది
బలమైన రాజ్యపు పునాదుల్ని పెకలించగలిగిన
స్వార్థ ప్రాంతీయవాద కరాళ నృత్యం ఇక కొనసాగుతూనే వుంటుంది
ఆరని చిచ్చులు ఉచ్చులై స్నేహం ప్రేమలను ఉరివేస్తూ
శాశ్వత శత్రుత్వం దుర్భేధ్యమైన కుఢ్యమై విడదీస్తూ
విడిపోతే సర్దుకుంటుందనుకున్న అపార్థం 
ఇపుడర్థమేలేక అనర్థమై వ్యాపిస్తోంది
దాయాదుల తీరు - కత్తులు నూరుతున్న ఇరువైపుల జోరు
కనులు తెరిచేలోపలే ఈ దావానలం ఎన్ని అరాచకాలు సృష్టిస్తుందో
ఇది చలనంలేని మనం కాంచబోయే  చలన చిత్రం 
చిత్రమేంటంటే ఈ చలన చిత్రంలో మనం పాత్రధారులం
నిస్తేజపు జీవచ్ఛవ శిధిల సాక్ష్యాలం  

అమ్మమ్మని గట్టిగా చుట్టేసి తల భుజంపై దాచుకుంటే

పొడిబారిన కళ్ళల్లో ఏదో క్రొత్త మెరుపులు
ముడతల మోమంతా పురివిప్పిన వెలుగులు
అడుగులో అడుగేసుకుంటూ బుజ్జి పాపలాగ నడిచొచ్చింది
వణికే చేతుల మునివ్రేళ్ళతో తలంతా నిమిరి
పాదాలు తాకబోతున్న నన్ను మెల్లగా దగ్గరకు 
తీసుకుని నుదుటిపై వెచ్చని ముద్దిచ్చింది
ఆ బోసినవ్వులో ఎంత నిర్మలమైన ప్రేమ
అమ్మమ్మని గట్టిగా చుట్టేసి తల భుజంపై దాచుకుంటే
మెత్తటి నూలు చీర ఇంకా మెత్తగా అనిపిస్తూ
ఎపుడో చిన్నపుడు నాకు తోడున్నానంటూ ధైర్యమిచ్చి
నిద్ర పుచ్చిన చక్కని సువాసన
ఒక్కసారిగా నా మనసు తిరిగి నన్ను చేరుకున్న భావన
వేల రోజులన్నీ వెనక్కి పరుగెట్టి
మనసుని బాల్యం వైపు నడిపిస్తున్నాయి
కళ్ళద్దాలు మెల్లగా తీసి రాలబోయిన ఒక్క చుక్కనీ
చీర కొంగుతో కంటి దగ్గరే ఆపేసింది
స్వయంగా తినిపించాలన్న తపన ఆపుకుంటూ
ప్రక్కన కూర్చుని కొసరి వడ్డిస్తూంది
ఆమె పలుకరింపులో నాకు జోలపాడిన గొంతుక
దొరికీ దొరకక దాచుకుంటూంది
తన నులక మంచం వైపు తీసుకెళ్ళి
తలగడ జరుపుతూ కూర్చోమంది
భగవద్గీతలో దాచుకున్న కుంకుమ 
మెల్లిగా తీసి నా నుదిటిపైనుంచింది
నేనలిగినప్పుడల్లా తానిచ్చే తాయం మాత్రం ఇవ్వలేదు
చేతుల్ని కదిలిస్తూ మోములో భావాలు పలికిస్తూ
దాచుకున్న కబుర్లన్నీ చేప్పేస్తూంది
అరే గడియారం మ్రోగుతుందేంటి
కల చెదిరిపోయినా అమ్మమ్మ ఊరికి ప్రయాణం కట్టేశా
ఉరుకు పరుగుల మీద మా ఊరివైపు అడుగేశా

చినుకూ రాదు చిగురుటాకూ రాదు

భావి తరముల మనుగడ యోచింపక
వృక్ష వనములెల్ల నేల గూల్చి
బహుళ భవనములు నిర్మించి
వాహనమ్ముల మోహమ్ముల మరిగి
శీతల యంత్రముల వైభవములలో పెరిగి
భూగర్భ నిక్షేపాలు ఛేదించి
విషవాయువులతోడ జీవనం కబళించి
ధూమ మేఘములు నింపి 
కాలుష్యపు క్షుద్రశక్తిని ఉసిగొల్ఫి
సృష్టి సమతుల్యత సంహరించి
స్వయంకృత  సర్వనాశనమును ఆహ్వానించు మమ్ములను
దూరదృష్టి మరచిన మమ్ములను
అతి నీలలోహిత కిరణములే ఇక
నిలువెల్లా నిమురబోవునది
వడగాడ్పుల వికృత నాట్యాలే
మనమింక కాంచబోవునది
ఆమ్ల వర్ష అభిసారికలే
మమ్ము పలుకరించబోవునది
చినుకూ రాదు చిగురుటాకూ రాదు
నీటి జగడమ్ముల నిండుగా మునిగి
పొరుగు వారితో పోట్లాటలే మిగులు
నిజమెరిగి నిత్య జీవన సత్యమెరిగి
వృక్షముల పెంచి
వనముల రక్షించి
ప్రకృతి పరవశించు జీవనమ్ము కాంక్షించు

వ్యవసాయం జూదమైపోయింది

వ్యవసాయం జూదమైపోయింది
ఓ వ్యసనమైపోయింది
భూమిని నమ్మిమోసపోయి
చివరికి భూమి తెగనమ్మిన కథలెన్నో
ఆశ చావక పుస్తెలమ్మిన వ్యధలెన్నో
ఒడలిపోయిన ఒళ్ళు
వానకై ఎదురుచూసే కళ్ళు
బక్కబారిన ఎడ్లు
బతుకున కానరాని వెలుగులు
ఎండిపోయిన చేలు
ఎడారి మాదిరి చెరువులు
కొనబోదామంటె
నికిలీ విత్తులు
నాణ్యత లేని ఎరువులు
నారు పోసి నీరు పెడదామంటే
గొంతెండిన గొట్టపు బావులు
మొదలుకాని ఎత్తిపోతలు
వడగాడ్పుల నీలి నీడలు
మబ్బు జాడే కానరాని ఆకాశం
పంటను దోచే దళారులు
ఇంతమంది శత్రువుల మధ్య
నీవేం పండిస్తావు రైతన్నా
మాకెలా దిక్కైతావు పెద్దన్నా
రైతే రాజంటూ పలికిన రోజులు
గడచి పొయాయి
కాలంలో కలసిపోయాయి
అర ఎకరం పండించలేక
పొట్ట చేతబట్టి
పొలాలన్ని అమ్మివేసి
కూలీగ మారావు రైతన్నా
కర్కశమైన కాలపు తీర్పిది రైతన్నా
అన్నపూర్ణ ఆంధ్రన్న నానుడి
ఇప్పుడు నీకై కాపుకాసే ఎండమావి
తాలు గింజలు పండించి
తడిసిన ధాన్యం తొలంగించి
చేతికందని కష్టపు చెమట చుక్కలు
ఆవిరైపాయ రైతన్నా
ఎర్రబారిన మోము 
ఎదిగిన అప్పు
ఎదురు నిలుచున్న భూసామి ఒకవైపు
కాళ్ళు చుట్టుకున్న కంటి పాపలు
ఇంటి ముద్దుబిడ్డలు మరోవైపు
గుండె పగిలి ఏడ్చేవు
బాడుగ చెల్లించలేక
కౌలు కట్టలేక
కలుపు తీయలేక
కాలాన్నెదిరించలేక
కన్ను మూతపడక
కను మూయాలని
తలంచితివే రైతన్నా
నీవెదగని సమాజం ముందుకు సాగదన్నా
ఇది మాకు ప్రకృతి శాపమన్నా
కలనైనా మమ్ము వదిలిపోబోకు
కడదాక ధైర్యం వీడబోకు

మనసు చేసిన సంతకం

మనసు ఉరకలేస్తూంది 
స్వేఛ్చాలోకంలోకి ఎగిరి వెళ్ళాలని
ఊహా జనిత ప్రతిబంధకాల
ఉక్కు ద్వారాల్ని ప్రేల్చివేసి
అర్థంలేని అపోహల సంకెళ్ళను త్రుంచివేసి 
రెక్కలు వచ్చిన పక్షి మల్లె ఆకాశంలోకెగరుతోంది ఉబలాటంగా
మిరిమిట్లు గొలిపే వింతకాంతుల
ఇంధ్రధనస్సులు ఆకాశాన్నలంకరించి
నేలవైపు తొంగిచూస్తున్నాయి
ఆకుపచ్చని పైరు అంచులను స్పృశిస్తూ
నా మనసు పయనిస్తోంది
ఎదురుగా నింగిని తాకే కొండలు, 
పసిడి కాంతులలో వెలుగుతున్న పర్వత సానువులు 
ధవళకాంతుల మేఘమాలికలు కొండల్ని చుట్టుముట్టేసి
తమ తడిపెదాలతో ముద్దాడుతున్నాయి
నా మనసు కొండ చెరియల్ని పలుకరిస్తూ 
గడ్డి పూవులతో సంభాషిస్తూ 
వట వృక్షాల చిగురాకులను చెలిమి చేసుకుంటూ
మేఘాలవైపు సాగింది
తొలిగా తళుక్కుమన్న సాయంకాలపు వెలుతురు పలుకరించింది
మలిగా చల్లని గాలి తెమ్మెర పులకరింపచేసింది
మేఘాలలోనికి పయనించేకొలదీ మత్తు క్రమ్మిన తీరున
దశ దిశలా తెల్లని తెరలు క్రుమ్మరించిన భావన
ఎన్నాళ్ళనుండో పారిపోతూ 
నన్ను నేను ప్రశాంతమైన పొదరింట్లో దాచుకున్న చేతన
పయనించేకొలదీ ఇంకా ఇంకా నాకు నేను ప్పిపోతున్నా 
మేఘ సౌధాలుదాటి పర్వత శిఖారాలపైకి చేరుకున్నా
ప్రపంచాన్ని దూరం నుండి చూస్తున్న అనుభూతి
మనసు నిశ్చలమై నిర్మలమై నిలచింది
ఎక్కడైతే మనసు భయం లేక భీతి లేక మసలుతుందో
అక్కడే ప్రశాంతత మనసుని వరిస్తుంది
ఎన్ని కోట్లు వెచ్చించిననూ పలుకరించని
మనశ్శాంతి అక్కడే స్వాగతిస్తుంది
ఎక్కడైతే మనసు భయం లేక భీతి లేక మసలుతుందో
అక్కడే కవి రవీంద్రుని అంతర్దృష్టి అనుభవమౌతుంది

ఈ విభజనకాండను పాఠ్యాంశాలుగా ప్రచురించండి

ప్రజలకు జవాబుదారీ వ్యవస్థ,
అరవై యేండ్ల ప్రజాస్వామ్యం,
గొప్ప రాజ్యాంగం, చట్టాలు, సవరణలు,
ఉన్నత మహోన్నత ఆస్థానాలు,
ఎగువ దిగువ సభలూ
అన్నీ కలిసి 
మనకూ మన భావితరాలకు
గొప్ప జీవితానుభవాన్నిచ్చారు
భవిష్యత్తులో మళ్ళీ 
విభజన జరగాలంటే 
లా జరపా(గా)లో 
ద్విగుణీకృత ఉత్సాహంతో
సోదాహరణంగా చేసి చూపించారు
దీనికి మిగతా వ్యవస్థలు సహకరించిన తీరు
సమర్థించిన తీరు మహాద్భుతం
కొసరి కొసరి వడ్డించిన వైనం అజరామరం
ఇలా జరుపవచ్చా?
ఇది వ్యవస్థ ధర్మానికి విరుద్ధం కాదా?
ఇది ప్రజాస్వామ్య మనుగడకు ప్రశ్నార్థకం కాదా?
ఇది సమంజసమేనా ?
ఇది ఏమి ఉల్లంఘించకుండానే 
ఏదీ అతిక్రమించకుండానే జరిగిందా?
ఈ విభజనకాండను పాఠ్యాంశాలుగా ప్రచురించండి
భావి భారత పౌరులు మన వ్యవస్థల గొప్పదనాన్ని 
అవహగాహన చేసుకుంటారు
సాంప్రదాయాల్ని అందిబుచ్చుకుంటారు
ప్రపంచ దేశాలు మరో వింతగా వ్రాసుకుంటాయి
కారకులైన నాయకుల, వ్యవస్థ రక్షకుల
చిత్రాలు మన దేవాలయాల్లో బద్రం చేద్దాం
వారి త్యాగనిరతిని కథలు కథలుగా చెప్పుకుందాం
ఈ తీయని అనుభూతుల్ని పది కాలాలపాటు
పదిలంగా నెమరువేసుకుంటాం

రాచనగరు ఠీవీగల రాజధాని నిర్మిద్దాం రండి

ప్రపంచ పటంలో తెలుగువారికి తలమానికమై నిలిచేలా
రాచనగరు ఠీవీగల రాజధాని నిర్మిద్దాం రండి
అచ్చ తెలుగు ప్రవహించు జీవనదిని సృష్టిద్దాం రండి
కష్టాలను క్రొత్త అవకాశాలుగా మలచుకుందాం రండి
ఎడారి మధ్య వదిలివేసినా
నిప్పులుకక్కే సూర్యునికెదురునిలచి నవశకానికి నాంది పలుకుతామని
కట్టు బట్టలతో కాలు బయట పెట్టినా
కష్టాన్ని నమ్ముకుని కలలు సాకారం చేసుకుంటామని
మనలాంటి వేలమందికి దారి చూపించగలమని
ఈ ప్రపంచానికి గురుతు చేద్దాం రండి
అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలిగిననాడు...
అంటూ కోట్లమంది తెలుగుబిడ్డల
కళ్ళల్లో ఎరుపు జీరలై
మనసులోని భావాలు ప్రతిబింబిస్తుంటే
గుండెపై రేగిన గాయానికి
సమాధానం చెబుతూ ఆకాశ హర్మ్యాల
ప్రేమ నిలయాల రాజధానిని నిర్మిద్దాం రండి
ఒక్కొక్క చెమట చుక్కా చేర్చి 
తెలుగువాడు గర్వపడేలా
పొగరుగలవాడి తలదన్నేలా
భారతావని ప్రస్తుతించేలా
మన రాజధానిని పునాదులనుండి నిర్మిద్దాం రండి
తెలుగు తల్లి అభినందించేలా
తెలుగు సామ్రాజ్యం విస్తరించిన మహరాజులు
సాహితీ సామ్రాట్టులు
భళిరా!! అనేలా
తెలుగు వెలుగుల రాజధాని నిర్మిద్దాం రండి
మట్టి చేతుల చిట్టి తండ్రులు దాచిన నాణాలిచ్చారు
మహిళామణులు తమ బంగారు ఆభరణాలిచ్చారు
లక్షలమంది యువకులు పొదుపు చేసిన ధనం ఇచ్చారు
తెలుగు వారికి క్రొత్త చిరునామా లిఖిద్దాం రండి
ఉజ్వల భవితకు శుభోదయం పలుకుదాం రండి

ఇకనైనా ఏలుకోండి ప్రక్క రాష్ట్రం మీద పడి ఏడవకుండా

ఇకనైనా ఏలుకోండి ప్రక్క రాష్ట్రం మీద పడి ఏడవకుండా
కుంటి సాకులు కుండ నిండా కాచి జనాలకు చల్ల పోసి
వెనుకబాటుతనమంతా ప్రక్కవారి చలవేనని
దౌర్జన్యం దోపిడీ ఇతరులకు అంటగట్టి
తామేమీ తెలియని అమాయకులమంటే
ప్రజలు వెర్రెత్తిపోయి కిర్రెక్కిపోయి అందలమెక్కించారు
మీ వి"భజన"కి వంత పాడారు
నిజం త్రవ్వి తీస్తే నుసిగా మారిపోదా మీ ఎత్తుగడ
కాలానికి నిలిచిననాడు తేలిపోదా మీ పగటి నీడ
ఇన్నాళ్ళూ ప్రాంతీయ వైరం మీద నెట్టి ఎదగలేకపోయామన్నారు
పదవిస్తేనే విభజిస్తేనే ప్రగతి సాధిస్తామన్నారు
ఇప్పుడు మీదేగా పాలన, చూద్దాం ఎంత వెనుకబాటు తీరుస్తారో
ఎంత ముందుకు తీసికెళ్తారో
ఇప్పుడపవాదులెవెరిమీదేస్తారో 
అపుడూ ఇపుడూ మీరే ప్రజాప్రతినిధులు
మరి గతంలో ఏం చేశారు, ఎంత ప్రగతి సాధించారు
విలాస భవంతులనుండి హాస్యం తిలకించారు
రాష్ట్రం రగులుతుంటే చోద్యం చూసారు
ఎన్ని యువప్రాణాలు బలి అయ్యాయి
ఎన్ని కుటుంబాలు తీరని వ్యథకి లోనయ్యాయి
పదవిస్తేనే పోరాడతారా ప్రజలకొరకై?
అరవై ఏండ్లలో సమాజ నిర్మాణానికి ఏం ప్రయత్నించారు?
హస్తినలో నిరంతర రాయభారాలు ప్రజలకోసమా, పదవికోసమా?
బావోద్వేగాలతో ఆడుకున్నవారు ధరావత్తు కోల్పోయారు
రాజకీయ చరిత్రలో కనుమరుగయ్యారు
కాలం పరీక్షలో ఇపుడు మీ వంతు
చెదిరిపోయే చెడు అనుభవమై మిగులుతారో
చెరిగిపోని చరిత్ర పుటలపై నిలుస్తారో
కాలమే నిర్ణయిస్తుంది

చెలిమి లిఖించిన జ్ఞాపకాల పుటల్లో

చెలిమి లిఖించిన జ్ఞాపకాల పుటల్లో
ఏదో మరచిపొయాను...ఏంటబ్బా!?
ఈదుతున్నప్పుడు జారిపోయిన కిట్టిగాడి చెడ్డీ చమత్కారం గురించా?
వనజకు వీడుకోలు తెలుపుతూ క్రిందపడి శాశ్వత గుర్తును
ముక్కుపై వేసుకున్న బాలు విరహం గురించా?
తప్పిపోయిన కుక్కపిల్లకై అన్నం మానేసిన బాచి అభిమానం గురించా?
మంచం క్రింద దాక్కుని నిదురపోయి ఊరినంతా వెదికించిన
వేణు నిర్వాకం గురించా?
చలిమంటకై గడ్డివామిని తగులబెట్టి వీధికెదురు నిలిచినా నా తెగింపు గురించా?
తేనెపట్టుకు పొగబెట్టబోయి దుప్పటి ముసుగులో ఇంటిని అంటించిన జగను సాహసం గురించా?
కుక్కల్ని భయపెట్టబోయి ఒళ్ళంతా కరిపించుకున్న వాసు ధీరత్వం గురించా?
బాదంకాయకై రాయి విసిరి నిలువెత్తు గాజు అద్దం పగులగొట్టి
ఆరు నెలలు వీధిని వెలివేసిన ప్రసాదు ఉద్యమం గురించా?
రాత్రంతా చదివి పరీక్షలో నిద్దురపోయిన మధు అలుపెరగని పోరాటం గురించా?
పులికైనా ఎదురునిలుస్తానని చెప్పి బల్లి మీదపడి భయపడి 
జ్వరమొచ్చిన నవీను శూరత్వం గురించా?
అబ్బో చాలా గుర్తొచ్చేశాయి!!
కాని మరేదో జ్ఞాపకం మరచిపోయాను

గుండెలో నీ గుడి

ఈ మధ్యే గుండె లయతప్పిందట
అన్ని పరీక్షలు చేసి
కొన్ని మందులు వ్రాసి
చెప్పారు వైద్యులు జాగ్రత్త అని
గుండె నిండా నీ చిత్రాలు రక్తానికి అడ్డం పడుతున్నాయట
ఇది నా వ్యాధి ముదిరిందని చెప్పటానికి అద్దం పడుతుందట
గుండె చప్పుడు మారి కూని రాగాలు తీస్తుందట
ఇది జబ్బుల జాబితాలో క్రొత్త విషయమని శలవిచ్చారు
నీ కౌగిలింతలతో గుండె వేగం పెరిగే అదృష్టముందన్నారు స్నేహితులు
శస్త్ర చికిత్స చేస్తామంటే
ఎక్కడ నీ జ్ఞాపకాలు గుండెల్లోనుండి ఎగిరిపోతాయోనని వద్దన్నా
గుండె మార్పిడి నేను కుదరదన్నా..చూశావా త్యాగాలమయమయ్యింది జీవితం
గుండెలో నీ గుడి కట్టమని నిన్ననే మేస్త్రిని కలిశా
ఎండాకాలం ఇసుక వెల ఎక్కువని కాస్త ఆగమన్నాడు
నీకై నేను చేయని ప్రయత్నంలేదు
నీవు త్వరగా నన్ను చేరకపోతే
నే చేజారిపోయే ప్రమాదముంది

రెండు రాజధానులొదిలాం, మన కష్టం ఒట్టిపోదు

కొంతమంది వెర్రి వెధవలు
ఫో అంటే
అధికార మదమెక్కిన
ఆంబోతులు సవాలు చేసి శివాలెత్తుతుంటే
మరి ఇంతమంది, కోట్లమంది ఏం పట్టనట్టు 
మనం వారికేం చెందనట్టు
మనల్ని ఎపుడూ ఎరగనట్టు
ఏదొ ఇంతకాలం బిచ్చమేసినట్టు
పీడ విరగడైనట్టు
ప్రవర్తిస్తున్న వీరితోనా మనం కలిసినడిచాం
వీరితోనా ఇన్ని తరాలు సోదరభావంతో మెలిగాం
స్వాభిమానం హద్దు మీరితే స్వార్థమే
ఆత్మాభిమానం తలవంచితే అవమానమే
కుళ్ళిన శవాల మధ్య నిదురిస్తే నీవూ శవమే
వారు క్రొత్త తల్లిని కనుగొన్నారు
విలక్షణంగా ఎదగాలనుకున్నారు
త్వరలో క్రొత భాషనూ కనిపెడతారు
మనమెవరో ఉనికే తెలియదంటారు
ఇంకా ఎందుకన్నా అలోచిస్తావు
ఏం మిగిలుందని వెనుతిరిగి చూస్తావ్?
స్నేహితులే శత్రువులై తరుముతుంటే
ఇంటికప్పే నీపై ఉరుముతుంటే
రెండు రాజధానులొదిలాం, మన కష్టం ఒట్టిపోదు
సున్నా నుండి మొదలు పెట్టడం మనకేం క్రొత్త కాదు
తెలుగు మహామహుల విగ్రహాల తలలే నరికారు
ఏదో పొట్ట చేతబట్టొచ్చిన గొట్టం సుబ్బడు నీవెంత
వారి సంస్కారం ముందు మనమెంత
మన నెత్తురు, మన చెమట ధారపోసిన నేల వదిలి
మనం ముందుకు సాగాలి
సొంత ఊరు పిలుస్తోంది రా కదిలి రా
నవ్యాంధ్ర ఉదయిస్తోంది రా రా

కన్నీటిచుక్క

తోకచుక్కై జారి నేల తాకకుండానే ఎటో మాయమయ్యింది కన్నీటిచుక్క
క్షణంలో మాయమయ్యింది కన్నీటిచుక్క
నిర్ణయమేదో రూపుదాల్చకుండానే మదిలో మిగిలిపోయినట్లు
తీరం తాకిన కెరటమేదో సముద్రంలోకి తిరిగి ఒరిగినట్లు వెనక్కుతగ్గిందో కన్నీటిచుక్క

కనుకొలుకుల కట్టలు దాటి పొంగిపొర్లుతూ
చారికలు చేస్తూ జారిపోయిందో కన్నీటిచుక్క
దారి ఎరిగిన కాలువల్లే బుగ్గలనుండి జారుకుంటూ తన దారి చూసుకుంది
ఉద్వేగం ఉక్రోషం అచేతనం ఆక్రోశం ఆనందం అద్భుతం
తేడాల్లేకుండా పుట్టుకొస్తుంది కన్నీటిచుక్క

మన అనుబంధం చిరకాలమంటోంది కన్నీటిచుక్క
తన వెచ్చటి స్పర్శలో చనువెక్కువ కనబడలేదా అంటూంది కన్నీటిచుక్క
వెళ్ళిపోతూ భారమంతా తీరుస్తుంది
ఒడలిపోయిన మోము కడిగేస్తుంది
తీరు మార్చే యోచన చేయిస్తుంది కన్నీటిచుక్క

పొరలి పొరలి పొంగుకొస్తుంది
ఆగనంటూ తరలిపోతుంది
కొన్నిసార్లు కన్నుల్లో గింగిరాలు తిరుగుతుంది
మరికొన్నిసార్లు కప్పేసిన కనురెప్పల మాటున దాగిపోతుంది
ఏ అర్ధరాత్రో దిండు తడిసిపోయేలా సుడులు తిరుగుతుంది  కన్నీటిచుక్క

మబ్బులు వీడిన ఆకాశంలా 
కళ్ళలో ఏవో క్రొత్త వెలుగులకు తిరిగి జీవం పోస్తూ
నిమిత్తమాత్రులమని నిలచిపోని, ఓటమికి బెదిరిపోని ధైర్యమిస్తూ
సెలవడిగింది కనీటిచుక్క!!

క్రొత్త అమ్మని కనుగొన్న నీకు...

కూడలిలో ఉన్నాము
కలవని దారులెంచుకున్నాము
నీ దారిటు
నా దారటు
జాగ్రత్త తమ్ముడూ!!
ముళ్ళ దారులుంటాయి
భవిష్యత్తు బంగారు చేస్తాననే
జిత్తులమారి నక్కలున్నాయి
అధికారం మరిగిన మృగాలు పొంచివున్నాయి
కనిపించని మలుపుల్లో
కమ్ముకున్న కౄరత్వం
జాలి చూపదు
జోల పాడదు
ఉక్కు కౌగిళ్ళ మధ్య
ఉక్కిరి బిక్కిరి చేస్తాయి
నీ కలలకు సంకెళ్ళు వేస్తాయి
నీవు విడిపోవాలన్నావు
స్వతంత్రమే లేదా అన్నావు
అనూనయించాలని యత్నించా
కలిసుందామన్నా
నీ పటిమతో
ఉద్యమమై నెగ్గావు
నిన్ను నిలుపుకోలేనందుకు సిగ్గు పడుతున్నా
కన్నీటితో సాగనంపుతున్నా
మన జ్ఞాపకాలు
నిలువెత్తు చిత్రపటాలుగా
గుండెల్లో ముద్రించుకున్నా
కుంచిత భావాల పండితులూ
కలుపులే చూస్తున్న కవులూ 
పేగుబంధం తెలియని పెద్దమనుషులూ
చిలువలు పలువలుగా
అల్లుతుండవచ్చు మన బంధాన్ని
జాగ్రత్త తమ్ముడూ!!
క్రొత్త అమ్మని కనుగొన్న నీకు
తెలుసోలేదో మరి
అమ్మ మౌనంగా రోధిస్తోంది
చిదిరిన సీమలవైపు చూసి
చెరగని నెత్తుటి సంతకాలవైపు చూసి
భువన భవనమ్ములు నేను కాంక్షించలేదు
నిధులు వజ్రవైఢూర్యాలు కోరనూలేదు
నిన్ను దోచి నేను ఎదగాలని ఎదురుచూడలేదు
తీయని అనురాగపు చెట్టు నీడలో కలిసుందామనుకున్నా
తరతరాల తెలుగు ఖ్యాతిని కలిసి పంచుదామనుకున్నా 
శలవు మరి
నీకు జయమగుగాక
నీకు సకల విజయములందుగాక
అమ్మ నేర్పిందిదే
తెలుగమ్మ నేర్పిందిదే

చైతన్యం మాలో లేదు

రైతును దోచేసి
ష్టం కాజేసి
కాష్టం రగిలించి
భూమిని పెకిలించి
ఖనిజం అమ్మేసి
గోతులు త్రవ్వేసి
గనులను ఖాళి చేసేసి
అడ్డమైన దారుల్లో
ఎన్ని అవినీతి
క్రతువులు నిర్వహిస్తావ్
అదుపులేని మదుపులేని
ధన ప్రవాహపు
ఒరవడిలో
ఎన్ని భవంతులు
నిర్మిస్తావ్
ఎన్ని పరిశ్రమలు
ఆక్రమిస్తావ్
కళ్ళారా ఇన్ని చూసి
ఇంకా చవి చూస్తున్న
ఈ గొఱ్ఱెల్ని
మంద బుఱ్ఱల్ని
మరింత దోచెయ్
మొత్తంగా అమ్మెయ్
చైతన్యం మాలో లేదు
నూతనత్వం మాకు వద్దు
మేమిలానే బ్రతుకుతాం
జీవఛ్చవాలై మిగులుతాం

శ్రమజీవికితోడై నీవుండాలి

ఏ పరిశ్రమ శ్రమజీవి లేక
పనికి ఉపక్రమించింది?
ఏ కట్టడం శ్రమజీవి లేక
నిర్మాణం జరిగింది?
ఏ క్రొత్త ఆవిర్భావం
శ్రమజీవి లేక
ఈ ప్రపంచంలో అడుగెట్టింది?
ఏ అద్భుతమైన కల
శ్రమజీవి లేక
సాకారమై మన ఎదుట నిలిచింది?
ఏ శ్రమ
దొపిడిలేకుండా సాగింది?
ఏ శ్రమ
బెత్తంపట్టిన పెత్తందార్ల చేతిలో
కీలుబొమ్మయ్యింది?
నీవు విప్లవమంటూ
ఎర్రగుడ్డ తలకుగట్టి
తుపాకీ చేతబట్టి
అడవికి పరిగెట్టితే
ఈ బడుగుజీవి అరణ్యరోదన
పట్టణాలలో అనామకవేదన
ఎవరు తీరుస్తారు?
జాగృతి లేని జనం మధ్య
ఈ కట్టడాల వనం మధ్య
నిలిచి నిలువరించి
పోరాడు 
పడగలెత్తిన దౌర్జన్యపు
మిడిసిపాటును వడిసిపట్టి
నేలకేసి కొట్టి కొట్టి
మదపు పొట్టు తొలచి ఒలిచి
తెట్టు తేలిన స్వార్థాన్ని
తూట్లు తూట్లు పొడిచి పొడిచి
వెగటు పుట్టిన ఈ వ్యవస్థ
పుట్టల్ని పగులగొట్టి
నాజూకు పేర్లతో క్రొత్తబడిన
వెట్టి చాకిరిని
కత్తివేటుకు బలియిచ్చి
శ్రమజీవికితోడై నీవుండాలి
శ్రమజీవివై ప్రజాస్వామ్యాన్ని
మెప్పించాలి
--------------------
కార్మికదినోత్సవ శుభాకాంక్షలు