ముల్లు పంటితో తీస్తామంటున్నారు.....

రాష్ట్రం పగ్గాలు చేతికందగానే
ఎందుకు స్థిరపడతారు ఫోండి ఫోండి అన్నారు
స్థానిక ఎన్నికలు దరికొచ్చేసరికి
ముల్లు పంటితో తీస్తామంటున్నారు
సూటి పోటి మాటలతో గుండె గాయమే చేసి
వింత నిర్ణయాలతో విరక్తి పుట్టించి
ఎన్ని వేషాలేస్తారు?

మీకు బాకా ఊదిన పత్రికలు, కవి పుంగవులు
తరిమేద్దామని కలలుగన్న అంతర్జాల రచయితలు
నోరువెళ్ళబెట్టి చూస్తున్నారు
ఏ నిర్ణయానికి ఒత్తాసు పలకాలో తెలియక
బుర్రలు బ్రద్దలు కొట్టుకుంటున్నారు
ఒక పంధా అనుసరిస్తే మీ వెనుకనున్నవారు
నవ్వులపాలు కాబోరు
వారేమో నిజం మరచి ఉద్వేగంతో ఉత్సాహంతో
పుంఖనుపుంఖాలుగా మీ నిర్ణయాలు కీర్తిస్తే
మీరు తూచ్చి చెప్పి క్రొత్తగా దిమ్మతిరిగే నిర్ణయాలు వెలువరిస్తే
ఏ గంప క్రింద దాక్కోవాలో తెలియక మూగవోతున్నారు బాకావీరులు
స్థిరపడినవారి భుజం తడుతున్న మీ వైఖరికి
కవితలు రాక కారం పూసుకుంటున్నారు
ఎందుకీ విద్వేషాలు?

మనం తెలుగు వారలం
తరతరాల బాంధవ్యపు వెలుగు నీడలం
పట్టుదలలు, పంతాలు వదిలేసి
చేయి చేయి కలిపి నడుద్దాం
భావి తరాలకు తెలుగు వారధులు నిర్మిద్దాం
భాష నిరంతరం
మనం  గతించినా నా నాలుక నీ నాలుక పలికిన,
పలికించిన భాష తరతరాలకు సాగుతుంది
మృతించు ప్రతీకారాలకన్నా ప్రేమ పంచే అమృత భాషకై పాటుపడదాం
క్షరం లేని అక్షర యజ్ఞానికి అంకితమౌదాం

వడి వడిగా వచ్చిన మన వేడి వేడి మోడి

ఆకాశం దాటే మాటలు
కోట్లల్లో పెట్టుబడులు
అగ్ర రాజ్యాలతో మంతనాలు
ఊపిరి బిగబట్టే హడావుడి
వడి వడిగా వచ్చిన మన వేడి వేడి మోడి

దేశంలో మహిళలు అరాచకాలకు బలియైతున్నా
బడుగు జీవులు బ్రతకడానికి దారి చూపమంటున్నా
మతాల పేరుతో బాబాలు స్వాములు పిచ్చి కూతలు కూస్తున్నా
ఉలకడు పలకడు కనీసం ఖండించడు
వడి వడిగా వచ్చిన మన వేడి వేడి మోడి

రంగు హంగుల తలపాగలు
దొరలకు సాటిగా సరితూగగ పేరు మలచిన అంగీలు
విదేశాలలో వీరోచిత ఉపదేశాలు
విలక్షణ శైలికై తడబాట్లే తప్ప
ఉభయ సభలలో కాలు మోపడు
వడి వడిగా వచ్చిన మన వేడి వేడి మోడి

మన్మోహనుడు ప్రజలకు కనిపించినా మౌనంతొ విసిగిస్తే
మోడి ప్రజలకెదురుపడకుండానే పరుగులుతీస్తున్నాడు
మంచి రోజులొచ్చాయంటూ ఆయన మంచిగానే ఉన్నాడు
ఎన్నికల సభలలో మాత్రమే మాయాజాలం కురిపిస్తున్నాడు
వడి వడిగా వచ్చిన మన వేడి వేడి మోడి

ఆకాశవాణిలో ప్రజానాడి గమనిస్తాడు
ఆకాశంలోనే పయనిస్తాడు
స్వచ్చ భారతంటూ మొదలు పెట్టి మటు మాయం అయ్యాడు
నూరు రోజుల్లో నల్ల ధనం తెస్తానంటూ
రెండు నూర్ల రోజులైనా కిమ్మనకున్నాడు
హస్తినలో చీపురు ముస్తాబు చూసి
మతి తప్పినట్లున్నాడు
వడి వడిగా వచ్చిన మన వేడి వేడి మోడి!!

గోచీ కూడ మిగులకుండా మంచి కసరత్తే చేస్తున్నారు..ఓ బాబు!!

అప్పుల కుప్పల మధ్య తన్నుకునే అన్నదాతకు
రుణ విముక్తి కలిగిస్తానన్నారోబాబు
కానీ జీవన్ముక్తి మాత్రమే కలిగిస్తున్నారు
ఆధారాలు అన్నీ కలిపి చూపినా మెదలకున్నారు
జీవనాధారాలు రాలిపొతుంటే నిమిత్త మాత్రులై చూస్తున్నారు
బక్కరైతులు మాత్రం బలియైతూనేవున్నారు..ఓ బాబు

అప్పుల నుండి కాపాడబోయి కుత్తుక మీదికి తెస్తున్నారు
కరువు రోజులు మెండుగా కలిపి తెస్తున్నారు
కేంద్రం గుమ్మం ముందు బిక్కు బిక్కుమంటూ నిలుచున్నారు
బికారియై వెల వెల పోతున్నారు..ఓ బాబు

ఉన్న పళ్ళు ఊడగట్టి మిద్దెలు మేడలు కడతానంటారు
గోచీ కూడ మిగులకుండా మంచి కసరత్తే చేస్తున్నారు
మంత్రాంగం, మేధావితనంతో కాలం కరిగిపోతుంది కానీ
గనులు త్రవ్వినా, ఇసుక తెగనమ్మినా,
ఎర్ర చందనం అడవులంతా వేలం వేసినా
కరువు తీరదు, కాలే కడుపుకు కాస్త గంజి దొరకదు..ఓ బాబు

మెల్లగ కదిలే తాబేలు గెలిచినట్లు
పరుగెట్టిన కుందేలు అలసి ఓడినట్లు మనకు ముందే తెలుసు
ఒక్కొక్క అడుగు చూసివేయండి, క్రింద నమ్మిన ప్రజలున్నారు
ఆశగా క్రొత్త భవిష్యత్తుకై ఎదురుచూస్తున్నారు
మోడీలను నమ్మి మీరు మోడవ్వకండి
ముందు మాట త్రప్పిన వైనం మఱి చేయకండి..ఓ బాబు

వాస్తు భయం తమరి పదవికా లేక మన ఊరికా?

మనుషుల్ని విడదీయాలన్నది మీ  అభిమతమైతే
ఐక్యత మీ పదవికి, ఉనికికి ఎసరనుకుంటే
కలిసే ప్రతి కూడలిలో నిప్పులు పోస్తారు
విమర్శిస్తే మాధ్యమాలు మూయిస్తారు
ప్రజాస్వామ్యపు గొంతు నొక్కేస్తారు

విడిపోయినా కలిసుండడానికి ఉన్న అవసరాల
కనీస ప్రయత్నాల్ని గండి కొడతారు
రెండు మార్లు ఒకే పరీక్ష విద్యార్థులు వ్రాయాలంటారా?
పాలించమంటే ఈ పనికిమాలిన చేష్టలు తగునంటారా?

స్వంత భయాలకి, స్వార్థ చింతనలకు
ప్రజల డబ్బును బలిపెట్టాలా?
వాస్తు భయం తమరి పదవికా లేక మన ఊరికా?
ఊరికైతే చాలా ఇళ్ళు పడగొట్టి మళ్ళీ కట్టించాలి సుమా!!

రైలు మార్గం స్వంత దార్లో నడవాలని పట్టు
నీటికై ప్రక్క రాష్ట్రంతో శిగపట్లు
భజన పరులూ, బాకా పత్రికలే మన చుట్టూ
ప్రజలకై మనం ఏం ఆలోచిస్తున్నట్లు?

మీరు రాజకీయం మింగిన ఉద్యమకారులు
నిషా తలకెక్కిన వారి రంగుల మేడలు మీ అడియాశలు
కళ్ళు తెరచి చూసే లోపల ఊడిపోతాయి ఈ పదవులు
సామాన్యులే వంచగలరు మీ మెడలు!!

పదవి ఊడిన ప్రక్క రాష్ట్రపు ముఖ్యమంత్రిని చూశారా?
బంగారు సింహాసనమునెక్కి నీలిగిన వ్యక్తి కతలు చదివారా?
ప్రజలు నచ్చని ముఖ్యమంత్రికి దశాబ్దపు వనవాసం ఎరుగుదురా?
విభజన విషం చిమ్మిన నూరు ఎండ్ల చేతి గుర్తు చెదిరిపోయింది తెలియదా?
క్షణ భంగురపు చౌక బారు ఎత్తుగడలు కట్టి పెట్టి ప్రజలకై బ్రతుకు మిత్రమా!!