పేద రైతు ఆత్మహత్యలకు కారణమెవరు, కరుణించేదెవరు?

పదవిలోకొచ్చేసి
ఇచ్చిన మాటలన్నీ మరిచేసి
మడత నలగని బట్టలేసి
మట్టి పాదాలకంటని ఈ నాయకులు
మట్టి విలువ తెలియని ఒట్టి అమాయకులు
భూములను మ్రింగే మాయావులు

ఎన్నికల ముందు పాదయాత్రలు
ఎన్నికల తరువాత విమాన యాత్రలు
ప్రచారాలకూ ప్రారంభాలకూ విలువనిస్తూ
ప్రజల ప్రారబ్ధం గమనించని ఈ నాయకులెందుకు?

ప్రజలకు చేరని పధకాలెందుకు?
పేదల ప్రతినిధికాని ప్రభుత్వమెందుకు?
మూర్ఖుల చేతిలో మన భవిష్యత్తు పగ్గాలెందుకు?

చిత్రాలకు పరిమితమై విమానాలకు, విఫణులకు మాత్రమే విలువిస్తే
రైతాంగం దారేది, సాగు భూములకు నీరేది?
పేద రైతు ఆత్మహత్యలకు కారణమెవరు, కరుణించేదెవరు?
పది కూడ ఫలితమివ్వని వేయి పధకాలెందుకు?

భజనపరులు చుట్టూ ఉంటే
విమర్శలెలా తెలుస్తాయి?
వీధులవెంట జెండాల రంగులే తప్ప
ప్రజల కడగండ్లు ఎలా కనిపిస్తాయి?
ప్రచారాల డప్పు హోరులో ప్రజలకష్టాలు మూగవోతాయి

ప్రజాసమస్యను తెలుసుకున్నవాడే నిజమైన పాలకుడౌతాడు!
సమస్యను ఎదుర్కొన్నవాడే సరైన నాయకుడౌతాడు!!
సమస్యను పరిష్కరించినవాడే మాహాత్ముడు, కారణ జన్ముడౌతాడు!!!నిజంగానే మీరు నిజాం పాలనను మొదలెట్టినట్లే ఉంది!!

నిజాము రాజ్యపు
అరాచకాలు
రజాకార్ల అత్యాచారాలు
భారతావనికి మానని గాయాలు
చరిత్ర పుటలనుండి
చించేద్దామని
చెరిపేద్దామని
లేని పొగడ్తలు అతికేస్తూ
గొప్పతనమంటూ అబద్దాలు పులిమేస్తూ
ప్రజలపై పట్టు కోసమని
పెడ దారులు పడుతూ
నీతిమాలిన రాజకీయనాయకులు
స్వలాభం కోసం
తాము ప్రత్యేకమని చూపడానికి
స్థానికత విషం వ్యాపింపచేయడానికి
విభిన్నత చాటుకోడానికి
మిడిసిపాటు నిలుపుకోడానికి
మనము మనుషులన్న మాట మరచిన
నిజాము పాలకుల
నిర్దాక్షిణ్యపు పాలనల
వారసులమని
మురిసిపోతున్నారు
మాన ప్రాణాలను
ఆడుకున్న తోడుకున్న రాక్షస నైజపు
నిజాము రజాకార్లు
మీకు మార్గ దర్శకులా?
కర్కశ కౄర పాలకులపై పొగడ్తలా?
ఇది చరిత్ర క్షమించని నేరం
ఎరుపెక్కని ఈ మౌనం చూస్తుంటే
మీ దొరతనం మా గొప్పగా సాగుతోంది
నిజంగానే మీరు నిజాం పాలనను మొదలెట్టినట్లే ఉంది