ప్రాంతీయతత్వం మత్తు గొప్పదో కాదో కాని....

ప్రాంతీయతత్వం మత్తు గొప్పదో కాదో కాని
మనకు దారి చూపిన గొప్ప నాయకులను
గౌరవించలేని నీచ సంస్కృతి మాత్రం గొప్పది కాదు

తెలుగు వాడి వేడి ప్రపంచానికి చూపింది రామన్న
తెలుగు వారి ఆత్మ గౌరవం గుర్తు చేసింది రామన్న
తెలుగు వారి ప్రియతమ నాయకుడికి నీవందిస్తున్న ద్రోహ నివాళి
ప్రజలందరూ గమనిస్తున్నారు నీ సంకుచిత సరళి

రాజకీయ ప్రస్థానానికి నాంది పలికింది ఆ చేతుల మీదుగానే
భవిష్యత్తు దిద్దుకుంది ఆ నాయకత్వంలోనే
కాని నమ్మకద్రోహానికి మారుపేరు నీవు
కుంచిత మనస్తత్వానికి అసలు రూపు నీవు

విభజన ముందు సిగ్గు శరం లేనోళ్ళు అంధ్రోళ్ళన్నావు
నీచమైన పదాలతో దుమ్మెత్తిపోశావు
ఎన్నికలనగానే కాలి ముల్లును పంటితో తీస్తామన్నావు
వంచిత మనస్తత్వానికి బహురూపం నీవు

పత్రికలని మాధ్యమాల్ని అణచివేస్తూ
నియంత లక్షణాలు నిలువెల్లా చూపిస్తూ
నిర్ణయాలు నవ్వులపాలు కాగా నిచ్చేష్టుడవౌతూ
కుఠిల రాజకీయాల కుళ్ళు కంపు నీవు

అధికారం మూన్నాళ్ళ ముచ్చటే
పుచ్చు పదాల ఉచ్చు మాటలకు ప్రజలు పడిపోరు
బంధు జనాల నీ ఊరేగింపు ఎన్నళ్ళూ సాగుతుంది
పొగరు మాటల కండకావరం త్వరలోనే కొడిగడుతుంది

తెలుగును ఉరితీస్తున్నారు రక్షించండి


మాతృభాష మరువకుండా
తెలుగు మాట అంతరించిపోకుండా
నిండుగా గుండెల్లో ఉండాలని
పరాయి రాష్ట్రంలో ఉన్నా
తమ పిల్లలకి తెలుగు నేర్పుతుంటే
తమిళ భాషే నేర్చుకోవాలంటూ
వారి భాషే బ్రతకాలంటూ
వ్యాధి శోకిన కొందరు
సుందర తెలుంగు విలువ తెలియని కొందరు
వందల ఏళ్ళుగా సమాజ నిర్మాణంలో
పాలుపంచుకున్నామని విస్మరించిన కొందరు
తెలుగు భాషను ఉరితీస్తున్నారు

విద్యార్థుల్ని బలవంతంగా
తమ భాషలోనే చదవాలంటూ
ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వం రుచి చూపిస్తున్నారు
నిర్భంధంగా సమూలంగా తెలుగును తొలగిస్తున్నారు
న్యాయస్థాన తీర్పునే పరిహసిస్తున్నారు
పరీక్షలొచ్చే వేళ పైశాచికం ప్రబలిస్తున్నారు
తమిళవారు అంధ్రదేశంలోనూ  ఉన్నారు
తమ భాషను ఆనందంగా అభ్యసిస్తున్నారు
ఎందుకు వారికి ఈ పైత్యం అంటిందో
తెలుగు భాషను ఉరితీస్తున్నారు

అంధ్ర ముఖ్యమంత్రికి విన్నవిస్తే
ఏమి తెలియనట్లు అమాయకంగా వెళ్ళిపోయాడు
తెలుగు దేశమంటాడు
ప్రపంచంలోని తెలుగువాళ్ళందరూ తనవాళ్ళంటాడు
మరి అక్కడ తెలుగు భాషను ఉరితీస్తుంటే చోద్యం చూస్తున్నాడు

తెలుగు బ్రతకాలి
భావాల బంధాల వారధియై తులతూగుతుండాలి
పుడమి పై తెలుగు మాటలు తేనెలూరుతుండాలి
భాష పరంపర తర తరాలకు కొనసాగాలి
కాని...తెలుగును ఉరితీస్తున్నారు తమిళనాట...రక్షించండి