దొరతనమణచ ఎయ్ దరువెయ్

ఎయ్ దరువెయ్
దుమ్ముపట్టి ధూళిపట్టి
నిమ్మకు నీరెత్తని తొత్తుగాళ్ళ
ఈ పొత్తుగాళ్ళ
రాక్షస రాజకీయ
నాయకుల పాలకుల
వూడ్చివేయ పూడ్చివేయ
ఎయ్ దరువెయ్!!

పొగరుతో ఒగరుతో
జనాలను గుమ్మపు జంతువులుగ
గుప్పెట బంధించిన
నేరగాళ్ళ నేతగాళ్ళ
దొరతనమణచ
ఎయ్ దరువెయ్!!

ఎకరాలకు ఎకరాలు
బొక్కెటోళ్ళ పుక్కెటోళ్ళ
డబ్బుల జబ్బుపట్టి
గబ్బుగొట్టె
మోసగాళ్ళ దొంగకోళ్ళ
పూసలదరగొట్ట బెదరగొట్ట
ఎయ్ దరువెయ్!!

కష్టాల్లో కరవులో
అలో లక్ష్మణా అని మేముంటె
లంచమంటూ పంచమంటూ
కడుపు మాడగొట్టె
ఈ కలుపుగళ్ళ కైపుగాళ్ళ
తరిమిగొట్ట తురుముపట్ట
ఎయ్ దరువెయ్!!

గొంతెండి
పొలమెండి
గుండెమండి పోతుంటె
నీటి రాజకీయలతొ
నీఛ రాజకీయాలతొ
ఇంటి ఈతకొలను లో 
పబ్బం గడుపు
వడుపుగాళ్ళ ఏపుడుగాళ్ళ
గుండెలదర
కూసమదర
ఎయ్ దరువెయ్!!

నీకెప్పటికీ నిజం కాను

ఎక్కుపెట్టిన విల్లునై నేను
లక్ష్యం చేరకుండానే లౌక్యంతో
సంభాషిస్తాను, లౌకికత్వంతో పయనిస్తాను
విలుకాని వెన్ను విరుస్తాను
నమ్మకాన్ని వమ్ము చేస్తాను
అందుకే నేను నిజం కాను
దర్పణంలో ద్వయం నేను
సామాన్య జీవనపు గరళం మ్రింగిన నేను
చిరునవ్వుల వెనుక విషపు కోరలు దాచగలను
నీవెదురైనప్పుడు నెవ్వెరపోయే ప్రేమ చూపిస్తాను
దూరమున్నపుడు నమ్మలేని మౌనమౌతాను, తత్వానికి దొరకను
నేనందుకే నిజం కాను
వెనుతిరిగి చూసుకుంటే నీ తీపి గురుతులలో నేను
మున్ముందు ఈ ఒరవడి కొనసాగుతుందని నమ్మించలేను
ఇప్పటికిప్పుడు తెరలమాటున మాయమయ్యే నేను
నీకెప్పటికీ నిజం కాను
పదునైన అభిప్రాయాలు పంచుకునే నేను
తరచి చూస్తే ఎపుడూ పాటించను
ఒకింత అబద్ధం
ఒకింత స్వార్థం
ఒకింత పైత్యం
ఒకింత స్నెహం
ఎక్కడో కొంత ప్రేమ
మరింత చపలత్వం
కలగలిసిన నేను
నీకెప్పటికీ నిజం కాను

ఐదు సంవత్సరాల ఊడిగం

ఎన్నికలో ఎన్నికలు
ఎన్ని కలల ఎన్నికలు
కల్లి బొల్లి హామీల ఎన్నికలు
కలుగులో దూరిన ఎలుకల్లా బయటకొచ్చే ఏలికలు!!
కుంగిన గుండె పై ప్రేమపూతలు 
ముద్దుల ఒలకబోతలు
వంగి వంగి నమస్కారాలు
వేల వేల న "మస్కా"రాలు
నేతల నోట చిలుకపలుకులు
బక్క చిక్కిన ముక్కి మనిషిని ఆత్మబంధువని కౌగిలించే నేతలు!!
మందుల వరదై పారే ఎన్నికలు
గొర్రెల మందలా మారే ప్రజలు
ఎన్నుకున్న ప్రజలు మూర్ఖులపాలు 
ఎందుకన్నవారు తన్నులపాలు
ప్రజస్వామ్యం మళ్ళీ మళ్ళీ నగవుల పాలు
మరణించిన వారు సైతం పాల్గొనే ఎన్నికలు
ఎవరు నకిలీయో తెలియని ఎన్నికలు
"నల్ల" నగదు బదిలీ ఎన్నికలు
ఐదు సంవత్సరాల ఊడిగంకై సమర్పించే సంపూర్ణాంగీకారం ఎన్నికలు!!


అదిగో వచ్చేదే మా ఊరు

అదిగో వచ్చేదే మా ఊరు
పేడ కళ్ళాపి చల్లిన ముంగిళ్ళు
ముంగిళ్ళలో తీర్చిదిద్దిన రంగవల్లికలు
రంగవల్లికల మధ్యలో గొబ్బెమ్మలు
గొబ్బెమ్మలపై గుమ్మడిపూలు
గడపగడపకి మామిడి తొరణాలు
పసుపు గడపల బంగారు ధగధగలు
చిరునవ్వుల పలుకరింతలు
దూరం పెరిగిన స్నేహాల తీపి కలయికలు
చిరు మందహసం చేస్తున్న బుర్ర మీసాలు
భుజం తట్టి పలుకరిస్తున్న సమ వయస్కులు
క్రొత బట్టల్లో పరుగులెడుతున్న చిన్నపిల్లలు
అవి.... సంవత్సరాలనాటి జ్ఞాపకాలు
ఇప్పుడేమో ఊరు పెరిగింది
మనుషుల మధ్య దూరం ఇంకా పెరిగింది
పలుకరింపులు దూరవాణికి పరిమితమయ్యాయి
పండుగలు దూరదర్శన్ కి కార్యక్రమాలయ్యాయి
రికెళ్తే పోయినదేదో
వెదుకుతున్నట్టు
దొరికినదేదో
మనదికానట్టు
రంగులకలలేవో
ఛిద్రమైనట్టూ
నిజాల నిప్పురవ్వలు
గుండెను తాకుతున్నాయి

బంధం విలువ

నవ్వుకు
పువ్వుకు
తావికి
అల్లుకున్న బంధం విలువ తెలుసు
కడవకు
పడవకు
గొడుగుకు
నీవులేక నేనులేనన్న
అనుబంధం విలువ తెలుసు
చెలిమికి
బలిమికి
కలిమికి
వీడినప్పుడు మాత్రమే
మనసుల విలువ తెలుసు
వేకువకు
వెలుగుకు
వెన్నెలకు
చిగురిస్తున్న ఆశల 
నూతన బంధం విలువ తెలుసు

చరిత్ర పుటలపై నీ సంతకం

ఎండలో కరుగుతున్న మంచు ముక్కలాగా
పిడికిళ్ళ నుండి జారిపొయే ఇసుకలా
కళ్ళు మూసి తెరిచేంతలో
కాలం కరిగిపోతున్నది
వెలకట్టలేనిదై చెజారి పొతూంది
ఎవరి కోసం ఆగనంటూ
ఎందుకోసం అగాలంటూ
వెనక్కి తిరిగి చూసుకుంటే
పుట్టిన రొజులెన్నో గడచిపొయాయి
వగచిన రొజులన్నీ మిగిలిపొయాయి
నిముషం నిముషం
నిదురలొనే జోగితే
కలతల్లోనే మిగిలితే
ఇరవై లో అనుకున్నవి
అరవై లో చేయలవా?
మళ్ళీ చేద్దామంటూ
మతిమరపు పేరు చెప్పి
విధివ్రాత పేరు చెప్పి
సమయం కరిగించకు
నీ విలువను తరిగించకు
కాలు చేయి ఆడనివారు
అలుపెరుగక శ్రమిస్తున్నారు
ప్రపంచ ప్రఖ్యాతి పొందుతున్నారు
నీవెందుకు అందులో అంతో ఇంతో కొంతో
సాధించలేవు?
కాలం నిన్ను శాసింపక ముందే
నీవు ప్రణాళిక రచించు
చరిత్ర పుటలపై నీ సంతకం లిఖించు

ఆకాశంలో సగం ఎక్కడ?

ప్రేమ పంచడం తెలియక
మనసు గెలవటం తలంచక
అర్థం చేసుకుని ఆరాధించలే
మూర్ఖంగా స్వాదించాలనుకున్నారు
క్షణికపు కోర్కెలతో 
పైశాచికత్వం దుర్మార్గత్వం కలబోసి
జుగుప్సాకరమైన దారులెన్నుకున్నారు
ఆమ్ల దాడులు, అకృత్యాలు, అపహరణలు
నిర్వచింపలేని అపరాధాలతో
ప్రకృతిని శాసించామనుకొంటున్నారు
నీచప్రవృత్తిని భరించమంటున్నారు
ఆకాశంలో సగం ఎక్కడ, భూమిపై విలువే లేదిక్కడ
ప్రకృతి తిరగబడితే
ప్రపంచం నాశనమే
విశృంఖల బేహారులకు మరణశాసనమే
కామ ప్రకోపకుల మధాంధ తత్వాన్ని
అణచటానికి ఈ స్నిగ్ధ మనోహర సౌందర్యమే
శక్తిస్వరూపిణియై మృగతృష్ణను
కడతేరుస్తుంది, కాలరాస్తుంది
ప్రకృతే తనను తాను మలచుకొంటూ
ఓ విప్లవంగానో
ఓ విధ్వంసంగానో
ఓ సంఘటిత శక్తిగానో 
జీవుల సమతుల్యత పరిరక్షిస్తుంది
ఇది నిత్య సత్యం
ఇది సత్య కృత్యం

తరతరాలకు తెలుగు వెలుగు

పరభాషా ఒరవడిలో
తెలుగు తృణీకరింప
మనసేల ఒప్పుచున్నది
మాతృ భాష మన కంఠమ్ము వీడ
ఉనికి కోల్పోయి మూలమ్మున్గోల్పోయి
తెగిన గాలిపటమ్ము వలె 
జాతి బోవుచుండ మిన్నకుంటిమి
వంశ పారంపర్యముగ 
తెలుగు నాదరించువారు 
తరిగిపోగా
భాష మూగవోతున్నది
భావితరాలకు మరుగుకానున్నది
మాతృ భాష మధురమైన భాష 
లోకులెల్ల కొనియాడిన భాష
కథల్ కావ్యముల్
కీర్తనల్ శతకమ్ములు పురాణమ్ములు పండించిన భాష
జాతి జీవ నాడి యైన భాష
ఇట్లు రాలిపోవ తగునా
ఇట్లు అక్షర క్షరమగుట క్షమార్హమౌనా
ఆస్వాదించినన్ అరాదించినన్ 
నివేదించినన్ విభేదించినన్  
కీర్తించినన్ ప్రార్థించినన్ 
చక్కగ నొదుగు భాష తెలుగు భాష
కన్న బిడ్డ వలె కంటిపాప వలె
వెలకట్టలేని వజ్రం వలె
వేయి జన్మల ఫలము వలె
తెనుగును కాపాడుకోవలె
జాతి నొక్కటిగ నుంచు తెలుగు భాష
సంస్కృతి శాశ్వతమై నుంచు మన మాతృ భాష
భాషలోన భావమున్నది
భావములోన బంధమున్నది
బంధములోన భవితయున్నది
భవితలోన సౌభాగ్యమున్నది
భావ బంధ భవిత సౌభాగ్యము 
పరివృత్తమై భాష యున్నది
వారధిగా మనమున్నాము
తెలుగు వెలుగును తరతరాలకు అందిద్దాం