తరతరాలకు తెలుగు వెలుగు

పరభాషా ఒరవడిలో
తెలుగు తృణీకరింప
మనసేల ఒప్పుచున్నది
మాతృ భాష మన కంఠమ్ము వీడ
ఉనికి కోల్పోయి మూలమ్మున్గోల్పోయి
తెగిన గాలిపటమ్ము వలె 
జాతి బోవుచుండ మిన్నకుంటిమి
వంశ పారంపర్యముగ 
తెలుగు నాదరించువారు 
తరిగిపోగా
భాష మూగవోతున్నది
భావితరాలకు మరుగుకానున్నది
మాతృ భాష మధురమైన భాష 
లోకులెల్ల కొనియాడిన భాష
కథల్ కావ్యముల్
కీర్తనల్ శతకమ్ములు పురాణమ్ములు పండించిన భాష
జాతి జీవ నాడి యైన భాష
ఇట్లు రాలిపోవ తగునా
ఇట్లు అక్షర క్షరమగుట క్షమార్హమౌనా
ఆస్వాదించినన్ అరాదించినన్ 
నివేదించినన్ విభేదించినన్  
కీర్తించినన్ ప్రార్థించినన్ 
చక్కగ నొదుగు భాష తెలుగు భాష
కన్న బిడ్డ వలె కంటిపాప వలె
వెలకట్టలేని వజ్రం వలె
వేయి జన్మల ఫలము వలె
తెనుగును కాపాడుకోవలె
జాతి నొక్కటిగ నుంచు తెలుగు భాష
సంస్కృతి శాశ్వతమై నుంచు మన మాతృ భాష
భాషలోన భావమున్నది
భావములోన బంధమున్నది
బంధములోన భవితయున్నది
భవితలోన సౌభాగ్యమున్నది
భావ బంధ భవిత సౌభాగ్యము 
పరివృత్తమై భాష యున్నది
వారధిగా మనమున్నాము
తెలుగు వెలుగును తరతరాలకు అందిద్దాం

సమైక్యం ఎక్కడ దాక్కుంది?

సమైక్యం ఎక్కడ దాక్కుంది?
ఆ బాబు ఈ బాబు ఏమైయ్యారు?
ఆడకుండానే ఓడిపోవడం ఇదె, కాదా?
మనం ఆరంభ శూరులం కాదా?
ఉద్యమ వీరులెక్కడ?
అప్పుడప్పుడూ దిష్టి బొమ్మలు కాల్చిన ధీరులెక్కడ?
ఆంధ్ర పౌరుషమెక్కడ?
ఆత్మ గౌరవమెక్కడ?
సీమ చీమునెత్తురెక్కడ?
మీసం మెలిపెట్టడమెక్కడ?
తొడలు గొట్టటమెక్కడ?
జన వాహినులెక్కడ?
మానవ హారాలెక్కడ?
ఉద్యమం ముగిసిందంటారేం?
తట్టా బుట్టా సర్దెశారేం?
సభ ఆమోదిస్తే సరిపోతుందా?
పీడా పోయిందని అన్ని పక్షాలూ అప్పుడే నాకేంటి అంటున్నయేం?
పదవులెలా పంచుకోవాలని తపన పడ్తున్నాయేం?
మొదటి పౌరుడు మకిలిపట్టాడేం?
మౌన ప్రధానులు ఇప్పుడు మాత్రం గొంతెత్తారేం?
పెద్దమ్మ చిన్నమ్మల నాటకాలు ఇంకా చూసి తరిస్తారా?
న్యాయస్థానంలో పొరాడలేరా?
రాజకీయ అపహాస్యం ఆపలెరా?
రాజ్యాంగాన్ని బంతాట ఆడుకున్న హీనులను మట్టి కరిపించలేరా?
చెల్లని ముద్ర వెయించుకున్న కాగితం మనల్ని శాసిస్తుందా?
యెవత్తో విసిరేస్తే యెవరో తెస్తే మనం భరించాలా?
శతాబ్దాల బానిసత్వం ఇంకా పోలేదా?
వెలుగు కిరణం విచ్చుకుంటున్నది చూడలేరా?
సమైక్యరణంలో పొరాడుతాం లేవండ్రా!!

మనసిచ్చిన మాట

ఏకువ జాము సూరీడు ఎర్రాని సిగ్గద్దినట్టు
సిగురాకు లేతదనం వొల్లంత వొంపినట్టు
మబ్బుల్లొ తారాడు సెందురూడి సల్లదనం సూపుల్లొ నింపినట్టు
నగవులోన  మల్లెలేవో గుప్పిళ్ళతో మత్తు గుమ్మరించినట్టు
పాట కడదామంటె పలుకు రాకపాయ 
మాట కలుపుదామంటె మెలకువే లేకపాయ
రేపన్న చప్పాల
ఎట్టైన చప్పాల 
మనసులోనీ   మాట
మనసులో    నీ     మాట
మనసైన  ఆ  మాట
మనసిచ్చిన  మాట

వడగండ్ల వాన


ఎంటెంట వొచ్చింది
యెదలొనా గూడుకట్టింది
గుండెనిండా రూపు నింపింది
గువ్వలా వొదిగిపొయింది
పాటలెవో పాడి నిదురబుచ్చింది
కలలన్నీ చిలిపి కతలల్లె చేసింది 
ఎండినా ఈ మోడుకు నిండైన మనసుతోనా
మల్లె తీగై అల్లుకున్నాది  
సెగ రేగుతున్న యెడారి మింద 
వడగండ్ల వాన మల్లె కురిసింది

ఉద్యమం

ఉద్యమమంటే!
అలుపెరగని  పోరాట  స్పూర్తిని  రగిల్చేది
లక్ష్యపు  దావాగ్నిని  నిలువెల్లా  నింపుకొని నిప్పులు  కక్కేది
వేల  హృదయాల  ఆక్రందనను  విప్లవ  శంఖమై  పూరించేది
వేదన  ఎందుకు?
పద  ముందుకు !
కదన  విందుకు!!
అంటూ  దిశానిర్దేశం చేసేది
క్రోధం , మోదం , ఖేదం , భేదం  ప్రక్కన  పెట్టి
పిడికిలి  బిగించి
వ్యూహాల పదును  పెంచి  
సమ భావన పంచి
నేల  నెరియలీనేలా కదం  త్రోక్కిన్చేది
ఆకాశం  త్రుళ్లిపడేలా గంభీర సింహ నాదమయ్యేది
ప్రత్యర్థుల గుండె  గుభిల్లుమనేల వేన వేల సమూహపు
సంఘటిత శక్తియై విజ్రుంభించేది
విజయం మన సొంతమయ్యేవరకు విశ్రమించనిది
ఉద్యమమంటే !!

భవిష్యత్

కనుచూపు మెలోన కానరానిది
ముందుచూపు ఉన్నవారికి విశ్వాసం కలిగించేది
వెనుతిరిగితే మిగలినిది
ముందడుగేస్తే మనదయ్యేది
ఆశల పల్లకి కొందరికి
నిరాశల ఎండమావి మరికొందరికి
ఎంపిక మనదే
ఎదురుచూపు మనదే
ఎంచుకున్న మార్గంలో పయనిస్తే
కోరుకున్న గమ్యం చేరుస్తుంది
విశ్రమించక శ్రమతో సాధిద్దామా?
శయనించి స్వప్నంలో మిగిలిపోదామా?

ఈ గాథ

మలిసంజ మబ్బులపై నీ రూపున్గాంచి 
శిశిర ఉదయాలననుభవించు హృదయమ్ము తోడ 
జాగృతి నొసంగని జాములో జీర్ణ జీవఛ్చవమై 
నివృత్తిలేని వృత్త పరిభ్రమలో భ్రమలపాలై 
నిజం నైజం నిర్వచింప నోరురాక, 
ప్రవచించలేని ప్రబంధమై మిగిలిపొయెనీగాథ

సమైక్యం కోసం

రక్తం మరుగుతోంది
గుండె మండుతోంది
సమరానికైనా సిద్ధం
మరణానికైనా వెరువం
సమైక్యం కోసం!
రహదారులు జన ప్రవాహాలై పొంగుతుంటే
ఎలుగెత్తిన గళాలు సమర శంఖం పూరిస్తుంటే
లావా ప్రవాహమైతాం సమైక్యం కోసం !!
విప్లవమై రగిలిపోదాం
రణన్నినాదం వినిపిద్దాం
విద్యార్థులు,ఉపాధ్యాయులు,కార్మికులు,కర్షకులు
మహిళలు,వృద్ధులు,పెద్దలు,పిల్లలు
జన రేణువులై ఉద్యమ తీరాల్నినింపేస్తుంటే
స్వార్థ రాజకీయ శక్తుల నిర్ణయాలు తుడిచిపెట్టుకు పోతాయి
కదం త్రొక్కుతున్న సమైక్య సైనికుల కాళ్ళ క్రింద
పీలికలై పేలికలై నుజ్జునుజ్జై
ఈ నిర్ణయాలు నామరూపాలు లెకుండాపోతాయి
శిలాశాసనాలే శిధిలమయ్యాయి
నియంతలే ఉద్యమాలనెదిరించలేక ఉరేసుకొన్నారు
మీరెంత?, కాలికంటిన బురందంతా?
చేతికంటిన మసంతా??

ఆంధ్రదేశం

అరవై వసంతాల సమైక్యం
ఆరిపోతుంటే చూస్తూ మిగిలి పోవాలా ?
తల, మొండెం వేరు చేసి తెలివైన విభజనంటుంటే
మెదడులేని పశువులాగా తలాడించెయాలా?
మిరిమిట్లు గొలిపే మెరుపులై ఆకాశాన్ని జ్వలించాలి
నిప్పుల ఉప్పెనై
ఈ శిధిల నిర్ణయాన్ని, నియంతలనూ దహించేయాలి
మనోభావాల విలువ తెలియని మూర్ఖత్వాన్ని
కూకటి వ్రేళ్ళతో పెకిలించాలి
రాయలు ఏలిన రతనాల సీమ, మనది
కోటి రతనాల వీణ తెలంగాణ, మనది
ఆంధ్రులకు అస్తిత్వం కలిగించిన ఆంధ్ర, మనది
వాడెవ్వడు? వీడెవ్వాడు?
పంచేస్తాం, త్రుంచేస్తామంటూ
విలువలేని పలుకులు ఒలుకుతున్న
ఆ...కులుకుతున్న రాబందుల వలువలూడగొట్టు
పంచుతామంటే పళ్ళు రాలగొట్టు
తెలుగు తల్లి గుండె గాయమే చేస్తుంటే
జన వాహిని జగమెల్ల నినదిస్తుంది
సహస్ర కోటి గళాలు చేరి కుఠిల రాజకీయానికి చరమ గీతం పాడేస్తాయి
కేంద్రాలు, రాష్ట్రాలు, చట్టాలు, ఆ సభలు, ఈ సభలు
హృదయనుబంధాల్ని చెరపలేవు
ఈ మట్టి , ఈ నీరు, ఈ గాలి మనది
ఎవరూ పునర్నర్మించలేరు
మరియెవరు విభజించలేరు
తెలుగు జాతి పూజించు ప్రదేశమొకటే
ఆంధ్ర దేశమదొకటే 
ప్రజల అభీష్టానికి వ్యతిరేకమైన పాలనా,పాలకులు మనలేరు
చరిత్రలో ద్రోహులై మిగిలిపోతారు
సమైక్య ప్రభంజనంతో మూగవోతారు
మా తెలుగు తల్లికీ మల్లె పూదండ!
మన తెలుగువారికీ సమైక్యమే అండ!!

మన పత్రికలు


పత్రికల నిండుగా వెండి తెర బంగారు వార్తలు
వెలుగు నోచని జీవితాల నిలువెత్తు భంగిమలు
వెల ఎక్కువ దుస్తులతో నిండిన ఛాయా చిత్రాలు
వెల కట్టలేని శృంగార పాఠాలు
ఆది అంతం లేని చక్కని కథలు
తలకెక్కని ప్రశ్నలకి త్రుళ్ళిపడే సమాధానాలు
సాహిత్య స్వరూప స్వభావాలే మరిచాము
పఠనా సామర్థ్యం నీరసిస్తోంది
బుల్లితెర మాయ దహిస్తోంది
కాపాడుకోవాలి తీయనిన తెలుగుని
మన సాహిత్యాన్ని
మన బాష నిండుదనాన్ని
ప్రతుల విలువకన్నా
వ్రాతల విలువ పెరగాలి
పత్రికలు తెలుగుకు వెలుగు వేదికలై వర్ధిల్లాలి

-----------------------------------------------------
పత్రికలు వినోదం వైవిధ్యం పంచుతున్నా
కాని అంతర్లీనంగా భాషని, సాహిత్యాన్ని వ్యాపింప చేస్తున్నాయి
వాటి రాయభార భాద్యతలని గుర్తెరగాలి

వెలుగు - చీకటి

చీకటి తో పోరాటం
వెలుగు కై ఆరాటం
తరం తరం ఈ యుద్ధం నిరంతరం
వెలుగు రేఖలతో మన ప్రపంచం నిండాలంటే
స్వేదబిందువుల ఉప్పెన తప్పనిసరి
అలుపెరుగక శ్రమించితే మరి
అన్ని కష్టాలు సలాం అంటూ
మనముందు గులామౌతాయి

జీవన శైలి

మూడు వన్నెల జండా ఎగురవేసినప్పుడు
 ఉద్వేగంగా వుంటుంది
భారతీయుడినైనందుకు గర్వంగా వుంటుంది
దేశం కోసం ఏదైనా చేయాలన్పిస్తుంది
కాని అది ఆ ఒక్క క్షణమే
ఆలోచనలన్నీ మారిపోయే మరు నిమిషమే
దేశం కోసం సమయం లేదు కేటాయించడానికి
చలన చిత్రాలతో సరిపోయింది ఈ వారంతం మరి
బుల్లి తెర ధారావాహికలు
వార్తల పరంపరలు
అంతర్జాలం మహేంద్రజాలం
వేశాయి విలువైన కాలానికి గాలం
నాగరికత చెదలు పట్టింది
జీవిత శైలి భ్రస్టు పట్టింది
త్రుప్పు పట్టిన ఈ మనిషి తీరు మారాలి
ఆకలి చావులు ఒక వైపు
పుష్టి భోజనాలతో రోగిష్టులు మరో వైపు
బాలికా పసికందుల హత్యలు ఒక వైపు
ఆడది ఆకాశం లో సగం అనడం మరో వైపు
పులుల సంరక్షణ కాంక్షిస్తారు కొందరు
పులులై జనం మీద ఎగబడతారు మరికొందరు
అవినీతి నిత్య హారతి భారత మాతకి
కుళ్ళు రాజకీయం మణిహారమయ్యింది భారతావనికి

అలోచనల సాగరాలు

అంతు లేని అగాథాలు
అలోచనల సుడిగుండాలు
సమసిపోవు
మాసిపోవు
మరపురావు
మదిని వీడవు
త్రవ్వెకొద్దీ పుట్టలు పుట్టలు
విడమర్చెకొద్దీ చిలువలు పలువలు
తొలచి వెస్తాయి
మదిని కలచి వేస్తాయి
మౌనాన్ని మధిస్తాయి
ప్రశాంతతని హరిస్తాయి
రూపం లేని శత్రువై
నిదురకు దూరం చేస్తాయి
ఈ అలోచనల సాగరాలు
ఈ అవిశ్రాంత సంగ్రామాలు

వేంకటేశుడు

ఎన్నెన్ని పదముల
కీర్తింతును
ఏడుకొండలవాడిని
వేవేల నామాల
ఆపదమ్రొక్కులవాడిని
శంఖు చక్రములు ధరియించి
సప్త గిరులయందు అవతరించి
వెలుగొందు వేంకటేశుడు
మమ్ము దీవించు శ్రీనివాసుడు
దర్శనభాగ్యమ్ముకై తరలి వచ్చు
భక్త జనులు ఎల్లవేళలా
నిత్య కల్యాణమై వెలుగొందు తిరుపతి తిరుమల!
కలియుగ దైవ నామ స్మరణ ప్రతిధ్వనించు నలుమూలలా!!

బాసలు

చిక్కని బొట్టు
చక్కగ పెట్టి
చెవిన మెరిసే జూకాలు కూర్చి
తలనిండా పూవులు చేర్చి
చెంపలపై ఎర్ర రంగు పులిమేను
ఒరకంట నా యొంక జూసి
ఒక్క మురిపాల నవ్వు ముద్దుగ పంపి
కొండ వాలు లోకి చూపు సారించేను
గుండెల నిండా మంటలు రువ్వి
నిద్దరే రాని రాతిరి తిరిగి తిరిగి
నీ కంటి బాసలు పలుకరించేను

యుగాది

వసంతం అరుదెంచింది
వేకువ పులకించింది
క్రొత్త ఉగాది పలుకరించింది
లేత పచ్చ మామిడి పిందెలు
విరగబూసిన వేప పూత
ప్రకృతికి అలంకార శోభితమై
ఉగాదిని స్వాగతిస్తున్నాయి
తెలుగు సంస్కృతిలో భాగమై
జీవితపు సారాన్ని పంచిన వేదికై
జీవితంలో నిత్య వేడుకై
ఙ్ఞాపకాలు గుర్తుకు తెస్తూ
రుచుల కలగలుపు లాంటిదే జీవితానుభవమంటూ
ప్రభవిస్తోంది యుగాది
ఇది తెలుగు నేల తరించు పండుగ
మనసున నిలిచిపోవు నిండుగ
ఈ ఉగాది పండుగ

దీపావళి

వికసిత హృదయాల
తీపి సంబరం,
ఆకసానికి ఎగసిన
తారా జువ్వల సంరంభం,
నృత్య గీతికల కోలాహలం
కలగలిసిన సంభ్రమం ఈ దీపావళి!!
వెలుగు పూల తోరణాల దీపావళి
హృదయాలలో మ్రోగె అనంద రవళి
ఈ దివ్వెల నవ్వుల ముందు వెల వెల బోతుంది అ పాల వెల్లి

ఊహల వర్షం

నీ కన్నుల
మెరిసిన ఓ వెన్నెల
నా మనసు నిండుగ విరిసింది
వేకువ పలికిన రాగమల్లె
నా గుండె లోతును తాకింది
లిఖించలేని మౌన రాగం
సాగర కెరటమై ఎగసింది
రేయీ పగలు కురిసే ఈ ఊహల
వర్షంలో ఇంకొంచెం ఆడాలి
కలలాగ సాగే ఈ పయనం
అవిశ్రాంతంగా కొనసాగాలి

పేగుబంధం

గుండెలోని ఓ చిన్ని రాగం
తల్లి నేర్పిన మమతానుబంధం
నిదురరాని ఓ ఘడియలోన
నిశీధి పాలించు నిశ్శబ్దసీమలోన
కంటి ఎదుట నిలుస్తుంది
దూరమున్న ఆ పేగుబంధం
ఓ పలుకరింపుకు తపించునో
ఓ చిన్ని మాటకై ఎదురుచూచునో
ఏడు సముద్రాల ఆవల ఏచొట నుంటివో
ననుచు ఆ తల్లి వేయి దేవుళ్ళను మ్రొక్కుచుందునో
తల్లీ నీ దరికిచేరి సేవచేయు భాగ్యమ్ము
నాకిమ్మని ఆ దేవుని నే కోరుచుంటి

మరో ఉదయం

తెల తెల వారుతూంది
ఆకాశం క్రొత ఉదయాన్ని ఆవిష్కరించబోతున్నది
చిత్రకారుడి ఊహలు
రూపం దాల్చినట్లు
ప్రపంచమంతా చీకటి వెలుగుల మిశ్రమం
అక్కడక్కడా శీతాకాలపు చలిమంటలు
చలిమంటల నుండి ఎగసే పొగలన్నీ
నింగి నుండి నేలకు జారిన రహదారులల్లెవున్నాయి
చల్లని గాలి తెమ్మెరలు తాకి మేని పులకరిస్తోంది
ఉషాకాంతుల పలుకరింపులతో
జగత్తు నిండా వెలుగు నిండిపోతూంది
చీకటి పారిపోయింది
ఆశలన్నీ నిజమయ్యె మరో ఉదయం మొదలయ్యింది