విపత్తు సృష్టించిందీ చక్రవాకం

అలలతో కొట్టి
కలలు పోగొట్టి
పొలాలు చుట్టు ముట్టి
ప్రజల కడుపు గొట్టి
విపత్తు సృష్టించిందీ చక్రవాకం

ఒడ్డున పడవ లేదు
గుడిసె పై కప్పు లేదు
కడవ లోన నీరు లేదు
కంటినిండ కునుకు లేకుండా
విపత్తు సృష్టించిందీ చక్రవాకం

చెట్లు విరిగిపడి
స్తంబాలు తిరిగిపడి
వాహానాలు ఎగిరిపడి
ఊహించ నలవిగాకుండా
విపత్తు సృష్టించిందీ చక్రవాకం

గుడి ముంపు బడి ముంపు
తలలు వాల్చిన గుంపు
కలలు కూల్చిన ముప్పు
చెరగని కష్టాల రచింపు
విపత్తు సృష్టించిందీ చక్రవాకం

దారులన్నీ నీట నిండి
ప్రజకంట కన్నీరు నిండి
ఇళ్ళలోన నీరు నిండి
జీవితాన కష్టాలు దండి
విపత్తు సృష్టించిందీ చక్రవాకం

నేను నిరాశను-నీ నీడను!!

ఏ వాలే ప్రొద్దులోనో నేను మిగిలేవుంటాను
ఏ రగిలే గుండెలోనో నే పాటనై పొంగుతుంటాను
కడలి మధ్య ఒడ్డుకై వెదుకుతుంటాను
కడతేరని బాదలన్నీ చుట్టు ముడితే
పొరలే ఏడుపులో భాగమౌతాను
నేను నిరాశను-నీ నీడను!!

మరపురాని ఓటమికి జైకొడుతూ 
దీపం చుట్టి చుట్టి రాలే పురుగునౌతాను
ముళ్ళ మధ్య పెరగకుండానే ఒరిగిన ఆకునౌతాను
చెరిగిన కలల వాకిట చేరి నిస్తేజమై
ఓడిపోతూ అబధ్ధాన్ని గెలిపిస్తాను
నేను నిరాశను-నీ నీడను!!

చీకటి రాతిరి నలుపు దుప్పట్లు కప్పుకొని
వెక్కిరించే భయాలను తోడు చేసుకుంటాను
తిరిగిరాని కాలాన్ని కలల మేఘాలపై పొంచి
వెక్కిరిస్తాను
నేను నిరాశను-నీ నీడను!!

ఆశలని ఊరించే కోరికలని తరిమికొడతాను
వైరాగ్యాన్ని నిండు మిత్రునిగా అక్కున చేర్చుకుంటాను
నేడు నాటిన చిన్ని ఆశను
రేపే వెలికి తీసి ఎందుకు చివురించలేదని ప్రశ్నిస్తాను
నేను నిరాశను-నీ నీడను!!

నమ్మిన తూనిగ రెక్కలు కసాయిల్లాగా తెగనరుకుతామెందుకు?

పురివిప్పిన వయసు సంకేతాల భ్రమలు ప్రేమలుగా మొదలై
ఆమ్ల దాడులూ అసభ్య ఘటనలుగా ముగుస్తున్నాయి
అనుభవం కోసం తపించే శరీరాలు 
పరిమితి పరిణితి పరిసరాలను మరుస్తున్నాయి
సాంకేతికతతో తీపి జ్ఞాపకాలకు బదులు తీరని క్షోబలు మిగులుతున్నాయి
అనుబంధం ఎరుగని వివాహ బంధాలు 
అనుమానాల విచ్చు కత్తులకు బలియౌతున్నాయి
బంధాలు బరువై విముక్తి కోరుకుంటున్నాయి
పెంచిన చేతులే ప్రాణాలు పెకిలిస్తున్నాయి
అగ్ని సాక్షి ప్రమాణాలు వికటిస్తున్నాయి
లోకం ఎరుగని పసి మొగ్గలు వీరి మధ్య నేలరాలుతున్నాయి
బంధం నేర్వని మనము
తహతహలాడతామెందుకు?
స్వార్థపు సంకెళ్ళలో
మన ప్రేమను బంధిస్తామెందుకు?
నమ్మిన తూనిగ రెక్కలు
కసాయిల్లాగా తెగనరుకుతామెందుకు?
బంధం విలువ తెలియని మనం!
బాధ్యాత బరువు తెలియని మనం
ఏరి ఏరి కోరి కోరి సాధించుకుంటాము
కనువిప్పని అనుబంధాల పసికందును
ఈ ప్రపంచానికరుదెంచకనే
కర్కశ కార్పణ్యాలకు
అంధ ప్రతీకారేచ్చకు
బలి ఇచ్చి మన పేగు బంధాలకూ,
మనలను నమ్ముకున్న ప్రేమ బంధాలకు
నిర్దాక్షిణ్యంగా శలవిచ్చి
లోకం వదిలిపోతామెందుకు?

ఉదయ భానుడు వేంచేయుచున్నాడు

సుప్రభాతము సహస్ర గళముల పలుకుచుండగా
దినకరుడు, శుభకరుడు లోకబాంధవుడు ఉదయించుచున్నాడు
అరుణ కందూకమువలె తూరుపుకొండల నడుమ ఉద్భవించుచున్నాడు
శశిని సాదరముగా సాగనంపుతూ 
చుట్టలుగా చుట్టుకున్న చీకట్లను చీల్చుకుంటూ
సప్తాశ్వ వాహనుడై శ్వేతాంబరి
ఉదయ భానుడు వేంచేయుచున్నాడు
రవికాంతుడు, నింగినేలు నిత్య ప్రకాశకుడు
లోక సేవకు ఉద్యుక్తుడైనాడు
మేఘాలను అరుణ రంజితం చేస్తూ
భాస్కరుడు అంబరాన్ని అలంకరించుచున్నాడు
కొండలు, కోనలు, గుట్టలు, పుట్టలు
వెలుగులతో నింపుతూ
పూవులు, లతలు, మొక్కలు, వృక్షాలు 
వనజమిత్రునికి వినమ్ర స్వాగతాలు పలుకుచుండగా
మంద్ర మారుతాలు మౌన స్పర్శా మాధుర్యం పంచుచుండగా
ప్రకృతి ప్రభాత సొగసులు నింపుచుండగా
విధి మరువని లోక వీక్షకుడు
ఆకాశపథమును అరోహిస్తున్నాడు
ఉషాకిరణముల దీవెనలతో లోకం కనులు తెరిపిస్తూ
జగత్సాక్షైన ప్రచండ మర్తాండుడు
నింగినెగబాకుచున్నాడు




నెత్తుటి రంగు పులుముకుని ఎఱ్ఱెఱ్ఱని మందారాలు గుత్తులు గుత్తులుగా విరబూస్తాయి!!

ఎక్కడైతే...మూర్ఖత్వం ప్రకోపిస్తుందో
ఎక్కడైతే... అంధకారం రాజ్యమేలుతుందో
ఎక్కడైతే...గుప్పెడు మెతుకులు కరువైతాయో
ఎక్కడైతే...ప్రజాస్వామ్యం, పెత్తందార్ల చేతిలో
ప్రతిరోజూ మరణించే మూగజీవిగా మారుతుందో
అక్కడ ఎఱ్ఱని మందారాలు విరబూస్తాయి!

ఎక్కడైతే...
చినుకులు కరువై
ఆశలు ఆవిరై
బతుకే బరువై
చావే వరమైతే 
అక్కడ ఎఱ్ఱని మందారాలు విరబూస్తాయి!

ఎక్కడైతే...
బానిసత్వం బ్రతుకీడుస్తుందో
కూలీల కష్టం దోచేయబడుతుందో
మధ్య తరగతి మనుగడ ప్రశ్నార్థకమౌతుందో
అక్కడ ఎఱ్ఱెఱ్ఱని మందారాలు నిండుగా విరబూస్తాయి!

రాజకీయ కుతంత్రాలు తుద ముట్టించడానికి
కుటుంబ పాలనలు మట్టి కరిపించడానికి
ఒట్టి హామీలు గుప్పించే దొరల మెడలు వంచడానికి
నెత్తుటి రంగు పులుముకుని ఎఱ్ఱెఱ్ఱని మందారాలు గుత్తులు గుత్తులుగా విరబూస్తాయి!!


నేల రాలేముందు అమ్మ చేతి స్పర్శ గురుతు చేసింది

చెరిగిపోని అశృవులు దారినిండాపోసి
ముత్యాల కూర్పులని మభ్యపెడుతూ
విరిసిన పూవుల మెరిసిన భావాల కుత్తుకలు కత్తిరించి
రెప్పల చప్పుళ్ళను ఉద్విగ్న క్షణాలుగా ప్రయోగించి
వెదికే చూపుల వెలుగుకందకుండా
ఆశల నావలు ఒడ్డుకు చేరకుండానే
ప్రణయ సంధ్యలు ప్రళయ రాత్రులుగా మలచి
స్వప్నాల నిండా ఎడారుల ప్రయాణాలు 
స్వగతంలో నిర్వేదపు నిర్యాణాలు నింపి
భ్రమలు వీడిన లోకపు అక్షర సత్యాలు
దారం తెగిన పూదండకు మిగలని పుష్పాలై 
ద్వారాలను మూసుకున్న రక్త సంబంధాలు 
హృదయపు రాతిని కోస్తుంటే 
లతలు విడివడి కలతలతో కథ ముడిపడి
ఈదురుగాలికి కొమ్మలు రెమ్మలు తగులుకుంటూ 
తూలిపోతున్న తాను ముక్కై
నేల రాలేముందు అమ్మ చేతి స్పర్శ గురుతు చేసింది
నేనంటూ నాకంటూ ఒక ఆశ, శ్వాస నా చుట్టూ పరిభ్రమిస్తూనే వుందని.

దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!

భూమిలోకి తొక్కుతానంటరు
మెడలు విరిచేస్తానంటరు
జనాలను తరిమేస్తానంటరు
రెచ్చగొట్టే రోషం చూపిస్తరు

దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!

రైలు బండికి నిజాము పేరు పెట్టాలంట
పాఠంగా పిల్లలకూ చెప్పాలంట
నిజాము పాలనను తీసుకొస్తారంట
కాశ్మీరూ తెలంగాణ భారత్ లో లేవంట

దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!

నిజాము పాలనను మరిపిస్తూ ఇండ్లు పగలగొడితిరంట 
జనాలు తిరగబడితే తోక ముడిచిపోతిరంట 
మాధ్యమాలను మూయించి మొండిరాజులనిపిస్తిరంట 
ఇల్లు ఇల్లంతా రాజులూ మంత్రులై పదవులేమో పంచుకొంటిరంట 

దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!

విమోచన దినము చేయకుండ అడ్డుబడితిరంట
గోలుకొండ కోట మీద, 
ఏది!! మన గోలుకొండ కోట మీద జాతీయ జెండ ఎగిరేయకంటిరంట

దొర నైజము చూచితివా ఓ బిడ్డా!

బండెనక బండ్లుగట్టి...అంటూ మళ్ళీ పాడాలంటావా ఓ బిడ్డా!!


బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
ఒంకులొంకుల వయ్యారి గీత ఒంపు సొంపుల వన్నెలద్ది
మనసు పరవశించే అందమైన దృశ్యాలను మలచుతుంది 
గజి బిజి గీతలుగా మొదలై జిగి బిగి జవరాలిగా రూపు దిద్దుకుంటుంది

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
అల్లరి పిడుగు బుడుగు పరిచయమయ్యాడు
పిల్ల చేష్టల పెసూనాంబ పేద్ద ఆరిందాలా పలుకరిస్తుంది
భారీ కాయపు భార్య చనువుగా భర్తను విదిలిస్తుంది
బక్క భర్త మరీ కొయ్యబారి కలానికి దొరికిపోయాడు

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
వేంకటేసుని పాదాలు ఎంత అందంగా ఆ గీతలలో అల్లుకున్నాయి
బాధా తప్త హృదయుడైన శ్రీరాముని రూపం కట్టెదుట నిలిచింది 
అలవోకగా రాధా కృష్ణుల రాసకేళి చిత్ర ప్రేరితమయ్యింది
ఆంధ్ర రంగవల్లులు ముదితకంటే ముగ్ధంగా తెలుగు ముంగిలికి రంగులద్దాయి

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
చలన చిత్రాలతో ఊహలకు రూపం ఇచ్చి
జీవితాలకు బంగారు రంగారు వన్నెలద్ది
బంధాల అందాలను బహు చక్కగా చూపి
ప్రతి దృశ్యంలో తెలుగుదనాన్ని వెలిగించాడు

బాపు చేతిలో ఏం మాయ ఉందో కాని...
లిపి శైలిని సొంతం చేసుకున్న మహనీయుడు
చిత్రలేఖనంలో తెలుగుదనం నిర్వచించిన ఆదరణీయుడు
వ్యంగ్య చిత్రాల సునిశిత హాస్య చతుర కుంచె యుద్ధ నిష్ణాతుడు
రాత [వ్రాత], గీత [చిత్రలేఖనం], చేత[దర్శకత్వం], కోతలతో [చెణుకులు] చెరగని ముద్రవేసిన చిరస్మరణీయుడు

తెలంగాణ అభిమానం పొందేది ఇట్లగాదు -తెలంగాణ బూచీ

ప్రతి అంశానికి, ప్రతి నిముషానికి తెలంగాణ ముడిపెట్టి
ఎదుటివారిని భయపెట్టి, బెదరగొట్టి
రోజులు గడిపేద్దామని అనుకుంటివా?
నీ ఒక్కడిసొత్తుగాదు తెలంగాణ 
అత్మాహుతి చేసుకున్న అమరుల నెత్తుటిచుక్కలతో
పుట్టింది తెలంగాణ 
కష్టాలకోర్చి కన్నీళ్ళకోర్చి పోరాడిన
వీరుల సొంతం తెలంగాణ 
అధికారం కోసం, బంధుప్రీతి కోసం
మొగ్గ తొడగలేదు తెలంగాణ 

వంగితే....తెలంగాణను అవమానపరచినట్లే
లేస్తే.....తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టినట్లే
తుమ్మితే....తెలంగాణ పైన కుట్ర పన్నినట్లే
ఎవరైనా నిన్ను విమర్శిస్తే...తెలంగాణ బిడ్డ కానట్లే
ఎందుకు విషపు చుక్కలు కలుపుతావు?
ఎందుకు కలుపు మొక్కలు ఇంకా నాటుతావు? 

ఎన్నాళ్ళు  ప్రజలను తెలంగాణ బూచి చూపెట్టి తప్పుదారి పట్టిస్తావు 
ఎవరి నోటా మాట పెగలకుండా మాంఛి మంత్రమనుకొంటివా-తెలంగాణ బూచీ
మళ్ళీ మళ్ళీ భయపెడితే పిల్లికూడ భయపడదు -తెలంగాణ బూచీ
తెలంగాణ అభిమానం పొందేది ఇట్లగాదు -తెలంగాణ బూచీ

పాలనపై కళ్ళుపెట్టు పేదలకు కూడు బెట్టు, గూడు కట్టు
పంతాలకుపొయి వచ్చిన పని మరచిపోకు
పనికిమాలిన మాటలతో నోరు పారేసుకోకు
తెలంగాణ పాలించే అదృష్టం దక్కింది 
దండం బెట్టు జనాలకి, దారి చూపు జనాలకి!!

మాధ్యమాలను నియంత్రించి మూర్ఖుడివనిపించుకోకు

కత్తిపోటు ఒక ప్రాణాన్ని తీస్తే
కలంపోటు ఒక సైన్యాన్ని తయారు చేస్తుంది
అధికార మదమెక్కి విర్రవీగి 
కలంపై కత్తులు దూస్తూ
వేల జీవితాలపై ఉక్కు పాదం పెడుతున్నావు

పదాల పొందికలే పదునైన ఆయుధాలుగా
నిత్య వార్తలతో పత్రికలతో ప్రజల నాడి ప్రతిస్పందనగా 
సామాన్యునికందుబాటుగా, తోడ్పాటుగా 
మాధ్యమాలు నిలిచినపుడు
గొంతునొక్కి, అణగద్రొక్కి, 
త్రొక్కిపట్టి వేడుక చూస్తున్నావు

ఎన్ని నాళ్ళు నీ ప్రస్థానం
ఇదు సంవత్సరాల ఆ స్థానం 
అందలం దిగకా మానదు
నషాళానికంటిన మత్తు దిగిరాకా మానదు
మాధ్యమాలను నియంత్రించి మూర్ఖుడివనిపించుకోకు

పాత్రికేయ మహాశక్తి మౌన ముద్రయై
అహింసా పోరాటమై
ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నా
పదునెంచని, పరికించని నీవు
ఒకనాడు పశ్చాత్తాప పడక తప్పదు

గళానికి, కలానికి సంకెళ్ళు వేసినపుడు
పత్రికా, మాధ్యమాల స్వేచ్ఛను హరించినపుడు
నీలాంటి నియంతలకు నిష్క్రమణ తప్పదు
తునకలుగా, పిడకలుగా
దొరికిపోయి, తరిగిపోయి, 
కరిగిపోయి, చెరిగిపోయి
వెనుదిరికి కనువెదకి చూస్తే
తెర మరుగై, కంపు మురుగై
చీకొట్టి, ఫోకొట్టి
పతనం కాక తప్పదు

గుండె కోసే మంత్రము, ఏదో చెప్పండి చూద్దాం

కలలోనిది
కథలోనిది
వ్యధలోనిది
ఎదలోనిది

కనిపించదు
వినిపించదు
మరుపివ్వదు
మరణించదు

మౌన సంగీతము
విరహ విషతుల్యము
బంధ మకరందము
అంధకార సాగరము

ప్రభాత పారవశ్యము
సంధ్య సౌందర్యము
పులకిత వసంతము
నిశ్చల శిశిరము
కర్కశ తామిస్రము


విప్పారిన మనోనేత్రము
విధినెదురించు పాశాస్త్రము
గుండె కోసే మంత్రము
లౌక్యం పొసగని సూత్రము

పధకాలు సరే, పని జరిగిందెక్కడ బాబూ?


కోట్లంటావు కోతలు లేవంటావు
నడివీధిలో నిలిపారంటావు
నీళ్ళిస్తానంటావు 
నిధులెక్కడ కాస్త చూపించు బాబూ
పధకాలు సరే, పని జరిగిందెక్కడ బాబూ?

అదిగో ఓడరేవులంటావు
ఇదిగో విమానాశ్రయమంటావు
కేంద్ర అనుమతులెక్కడ బాబూ
పధకాలు సరే, పని జరిగిందెక్కడ బాబూ?

రైతు రాజ్యమంటావు
ఋణ మోక్షమంటావు
మహిళా ఋణాలంటావు
రూపాయలు చూపించు బాబూ
పధకాలు సరే, పని జరిగిందెక్కడ బాబూ?

ఒక పధకమైనా ప్రజలకందేలా చూడు
వేయికళ్ళతో ఎదురుచూచు ప్రజలమధ్యకొచ్చి చూడు
పధకాలు ప్రవేశపెట్టడం గొప్ప కాదు
ప్రజలకందేవరకూ ఇచ్చిన మాట నిజం కాదు

చట్ట సభనా లేక మీ చుట్టాల సభనా?

ప్రియురాలికి వీడుకోలు చెప్పినట్టు
చట్ట సభకు చేతులూపుతూ వెళ్ళిపోతావు
నీ సభ్యుల గొంతు నొక్కేసి
ఒక్కడివే ఎంచక్కా పుటలు పుటలు  చదివేస్తావు
దుడ్డు కర్ర పెట్టి చిన్నపుడు పధ్ధతులే నేర్పింటే ఇప్పుడిలాగుండెదా?

నీ మాటే సాగాలంటూ పట్టుబట్టేసి బల్లలు విరిచేసి
గజేంద్రమోక్షపు విష్ణువు పరుగులెట్టినట్లు
ఎక్కడికో వెళ్ళిపోతావు
మీ సభ్యులంతా అవాక్కై చూస్తుంటే ఎదో విజయం ఒంటిచేత్తో సాధించినట్లు
మొహమాటంగా నవ్వుకుంటూ మాయమౌతావు
దుడ్డు కర్ర పెట్టి చిన్నపుడు పధ్ధతులే నేర్పింటే ఇప్పుడిలాగుండెదా?

క్రొత్త సభ్యులకు పాఠాలే నేర్పుతుంటే రాను పొమ్మంటివి
అనుభజ్ఞుల మాటా పెడచెవిన పెట్టేస్తివి
చెప్పిందే వేదమంటూ చెవిపెట్టి ఆలకించవు
పెద్ద లేదు చిన్నలేదు, అందరినీ తోలుబొమ్మలాటాడిస్తావు
దుడ్డు కర్ర పెట్టి చిన్నపుడు పధ్ధతులే నేర్పింటే ఇప్పుడిలాగుండెదా?

గొడవ చేసి గోలచేసి చర్చ మాదే కావాలంటావు
చర్చ మొదలవ్వగానే నిష్క్రమిస్తున్నామంటావు
గందరగోళంలో మీ సభ్యులు తలలు పట్టుకుంటుంటే 
వెంట రాలేదని తలమీద మొట్టికాయలేస్తావు
దుడ్డు కర్ర పెట్టి చిన్నపుడు పధ్ధతులే నేర్పింటే ఇప్పుడిలాగుండెదా?

నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

కూత పెడుతూ, నా గుండె కోత కోస్తూ
పట్టాలెంబడి తనకేమి పట్టనట్టు
చలి గాలిని చీల్చుకుంటూ
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

ఇప్పుడే రాములోరి గుడి దాటి
చదూకున్న బడి దాటి
ఊరి చివరి నారు మళ్ళు దాటి
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

బరువెక్కిన గుండెతో
ఎరుపెక్కిన కళ్ళతో
తల్లడిల్లే మనసుతో
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

వయసుడిగిన అమ్మ నాయనలనొదిలి
ఎంటబడి వచ్చే నేస్తగాళ్ళనొదిలి
మాటిచ్చిన మగువనొదిలి
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

పంట చేలు నీరందక ఎండిపాయ
రాదారి పనులు డబ్బులందకనేపాయ 
రాయి గనులు రాజకీయాలతో మూతబడిపాయ
పొయ్యిలో పిల్లి లేవకపాయ
ఆకలి తీర్చ గతి లేక
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

ఎద్దులు ఎంకటేసుకు మరుగుతాయోలెదో
అమ్మ ఇదు మైళ్ళు బోయి పాలు అమ్ముకొస్తాదోలేదో
నాయిన కొండ మీద కట్టెలు మోసుకొస్తాడోలెదో
కష్టాలు తీరుస్తానని మాటిచ్చి 
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

శానా బరువబ్బా ఈ బాద
గుండె పగల గొట్టినట్టు
రంపంతో కోసినట్టు
రగతమేదో పీల్చినట్టు
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది

సేవ చేతువేని నిస్వార్థమైన మనసు తోడ

సేవ చేతువేని నిస్వార్థమైన మనసు తోడ
సర్వంబనుకూలించును ప్రకృతి వరము చేత
భొగ భాగ్యమ్ములొరుగునో లేదో చెప్ప జాలము కానీ
ఎవ్వండు కొనలేని సౌమనస్యము స్వంతమగు నేస్తమా

విజయం నీ సొంతం ఎందుకు కాదూ!?

చమట చుక్క
విలువ తెలిసి,
చెదిరిపోని
తపన కలిగి,
ఒడిదుడుకులకు
బిగి సడలక,
వెనుదిరగక
నినదిస్తే,
ఒటమి ఝడుపులను
పురోగమిస్తే,
విఘ్న శతఘ్నుల నెదిరించి
మున్ముందుకు పయనిస్తే,
మనసులోని
భయాలని తరిమేసి,
సాధించిన
అనుభూతిని నెమరేస్తే
విజయం నీ చెంతకు ఎందుకు రాదూ!?
సంకల్పం వెలిగించి
కొవ్వును కరిగించి
వేదన మరిగించి
ఇంధనముగ నడిపిస్తే
విజయం నీ సొంతం ఎందుకు కాదూ!?

న్యాయ స్థానం ఏ-కేసి ఆరు-న్నొక్క రాగం తీయించినా...

న్యాయ స్థానం ఏ-కేసి ఆరు-న్నొక్క రాగం తీయించినా
బుద్ధి రాని పాలకులు టపాకాయల్లా పేలుతున్నారు
వ్యర్థ ప్రేలాపనలు చేస్తున్నారు
వారు క్రొత్త అర్థాలు వెదుక్కుంటూ
ప్రజలను ప్రక్క దారి పట్టించాలని చూస్తుంటే
ప్రజలు మాత్రం వీరి వెర్రి చేష్టలకి విరగబడి నవ్వుతున్నారు
చేస్తున్నది తప్పని తెలిసి మరీ త్రవ్వుకుంటే
తాము తీసిన గోతిలో తామే పడతామని రుజువు చేస్తున్నారు
ఎందుకర్రా విఱ్ఱవీగుతారు
ప్రజలను మరచి పాలన మరచి
మొండి పట్టుదలలు పొంతనలేని పౌరుషాలు చూపిస్తూ
ఎవరూ లేని చీకట్లో జబ్బలు చరుస్తారు
నీడలపై పోట్లాటలకు సిద్ధమౌతారు
నివురు గప్పిన నిప్పంటూ బూడిద మసి పూసుకుంటే సరిపోతుందా?
లోన విషయముండాలి కదా!?
కనకపు సింహాసనమున ...
చందం కాకుండా
కృషి ఉంటే మనుషులు...
అనిపించుకోండి
మాకు మార్గదర్శులు కండి


నేనే ఒక పనిముట్టునై పదును తేలుతున్నా!

ఇనుప చట్రాలమధ్య చిక్కుకున్న ఒంటరి బానిసత్వం
ఎప్పుడో కడతేరిపోయింది
అంతః శత్రువుని శాశ్వతంగా సంహరించిన నాకు
క్రొత్త రెక్కలు ఎప్పుడొచ్చాయో తెలియదు
కోరినంత దూరం స్వెఛ్చా విహంగంలా ఎగిరిపోతున్నా
ఊహకందని తీరాలకు చేరుకుంటున్నా
వెలుగు కోరే చిరు ఆశల జాబితా 
పుటల క్రొద్దీ నిండిపోయింది
ఆత్మ విశ్వాసపు గొడ్డలి వ్రేటుతో
సోమరి సంకెళ్ళను తెగ నరికి
బద్దకపు పెనుభారాన్ని 
స్వేద శౌర్యానికి బలి ఇస్తున్నా! 
ఆరని ఆశయాల కొలిమిలో 
నేనే ఒక పనిముట్టునై పదును తేలుతున్నా!
ఎలుగెత్తిన వెలుగద్దిన నిలువెత్తు విజయాల 
సంతకం చేస్తున్నా!
అంతః శత్రువుని శాశ్వతంగా సంహరించి 
మున్ముందుకు దూసుకుపోతున్నా!!

ప్రంతీయత చిచ్చు పెట్టి పాలనను జోకొట్టలేరు

ఉద్యమాల ఊపిరితోడ ఉన్నతము ననుభవిస్తూ
దృష్టి ఆభివృద్ది పైనుంచక ప్రజా సంక్షేమమెంచక
కలిసి బ్రతికిన తోటి తెలుగువారలపై కక్ష పెంచుకొనుచూ
రాద్ధాంతముల్ సిద్దాంతమై సాగుతున్నది ఈ దమనకాండ

అణగారిన జీవులకాశ్రయమ్ము గల్పించి
కొండెక్కు జీవితాలకండగా నిలిచెదరనుకుంటే
వాలంబు పెంచి వైరమ్మున్ పంచి దలవంపులు దెచ్చితిరి
ఇది పాలనయాయని చిత్రముగ జూచి ప్రజలు ఛీత్కరించెదరు

నేను రాజు, నాదియే రాజ్యమటంచు విఱ్ఱవీగు
వక్ర వాక్కుల వికృత ప్రాంతీయవాద రాక్షసులు
ఉద్యమాలను స్వంత ఉయ్యాలలుగా వాడుకొను ఉత్తుత్తి నాయకులు
ప్రంతీయత చిచ్చు పెట్టి పాలనను జోకొట్టలేరు

సీమాంధ్రకాగర్భ శత్రువుగాదు - తెలంగాణ
ప్రాంతీయత పరిపక్వతనొందిన పరిణత ప్రేరణ - తెలంగాణ
వీనుల విందుసేయు పలునాదమ్ముల సమ్మోహన వీణ - తెలంగాణ
తేనియ తెలుగు తటాకమునందలరారు మూడు పసిడి కమలములు ఆంధ్ర, సీమ, తెలంగాణ

విషపు తరునఖములు దారి వెంబడి కాపు గాసి
బంధపు ఉనికినే ఎసరుబెట్టినచో
శత సహస్ర మార్గములన్వేషించి తెలుగు బంధం నిలుపుకొనెదము
వెఱ్ఱి పనులు మాని ప్రజలు మెచ్చే పాలన సాగించండి

పోలవరం కథ, స్థానికత కాదేదీ వివాదానికనర్హమంటూ

భావి పౌరుల భవితతోనా  ఆటలాడుతున్నావు?
తెలుగు బిడ్డల వెలుగుపైనా అడ్డం పడుతున్నావు?
ప్రవేశ సమయం మించి పోతున్నా మిన్నకున్నావు
నీ దారి నీదే నంటూ మొండికేసుకున్నావు
ఒక్కసారి అందలమెక్కా ఇంత విఱ్ఱవీగుతున్నావు?
వాహన పన్నంటూ చట్టం తీసుకోస్తే
న్యాయస్థానం మొట్టికాయలేసింది
ఉద్యమాల పేరు చెప్పి ఎన్నాళ్ళు తలలూపమంటావు
తగవుపెట్టి తెగదెంపులుచేసి తలుగందుకున్నావు
సొంత రాష్ట్రం సంతలాగ తయారౌతుంటే
ఎవరిపై ఉద్యమాలు చేయాలో తెలియక అనుచరులు వెర్రిమొహాలేస్తున్నారు
ప్రతి విషయం రాద్ధాంతం చేసి, శత్రుత్వం రగిలించి
పోలవరం కథ, స్థానికత కాదేదీ వివాదానికనర్హమంటూ
లక్ష మార్గాల్లో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నావు
పాలనంటే ప్రజలను రెచ్చగొట్టడం కాదు
పాలనంటే ప్రక్క రాష్ట్రం మీద పడి ఏడవడం కాదు
పాలనంటే ప్రజలపైన దండెత్తడం కాదు
పాలనంటే నియంతృత్వ నిరంకుశ ధోరణి కాదు