నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

అక్షర బానిసత్వం అణువణువునా నిర్వచిస్తూ
కలానికి సంకెళ్ళు వేసి
స్వేచ్ఛా భావాలని అణిచివేసి
రాజకీయాలకు లొంగిపోతూ
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

స్వంత ప్రచారానికి వాడుకుంటూ
రాజకీయ నాయకుల పుత్రికలై
సొంత బాక ఊదుకునే వేదికలై
స్వేచ్ఛను కాలదన్ని అచేతనమై
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

నిజాన్ని పాతరేసిన
వక్ర ధోరణుల
వికృత వ్రాతల
కర దీపికలు - పత్రికలు
బుల్లితెర స్వార్థ వాహికలు - మాధ్యమాలు
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

నాయకుల కొమ్ము కాస్తూ
వారి పంచనే పడగలు పెంచుకుంటూ
అధికారానికి అర్ధాంగిగామారి
వార్తలకు బదులు కట్టుకథలు అల్లేస్తూ
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

ప్రజలకు నిక్కచ్చి సమాచారమందించాల్సిన
ప్రధాన బాధ్యతను విస్మరించి
వ్యాపార సూత్రాలను వల్లెవేస్తూ
నికృష్ట రాజకీయాలు వంటబట్టి
బుల్లితెరలపై ప్రజలకు అబద్ధాలు నూరిపోస్తూ
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

ప్రజలకు తెలుసు ఏ పత్రిక ఎవరికి కొమ్ముకాస్తుందో
ప్రజలకు తెలుసు ఏ మాధ్యమం ఎవరిని ఆకశానికెత్తేస్తుందో
ఎవరు భ్రమలో ఉన్నారు?
ఎవరు నీచ సంస్కృతిని ఎగదోస్తున్నారు?
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

తగులబెట్టండి ఇటువంటి పత్రికల్నీ మాధ్యమాల్ని
విషసంస్కృతిని ప్రజలపై రుద్దకుండా
తిరిగి ఈ సర్పాలు మొలవకుండా
సమాజాన్ని శాసిస్తున్నామనుకోకుండా
తగిన శాస్తి చేయండి
ఎంత  నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు?!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Add your comment here